ఢాకా: బంగ్లాదేశ్‌లో మీజిల్స్ (తట్టు) వ్యాధి కలవరం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ వ్యాధి కారణంగా 1,361 మంది మరణించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 105 మంది మరణాలను అధికారికంగా ధ్రువీకరించగా.. మరో 1,256 మరణాలు అనుమానిత జాబితాలో ఉన్నాయి. మంగళవారం ఉదయానికి ముందు 24 గంటల్లోనే మరో తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా అనుమానిత కేసుల సంఖ్య 2,59,190కి చేరగా.. ధ్రువీకరించిన కేసులు 26,300గా నమోదయ్యాయి.
భారత్‌కూ వ్యాపించే ప్రమాదం
బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య సరిహద్దులు, ప్రజల రాకపోకల నేపథ్యంలో వ్యాధి భారత్‌కు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఢాకా, చటోగ్రామ్, సిల్హెట్, కాక్స్‌బజార్ వంటి ప్రధాన నగరాలతోపాటు భారత్‌తో సరిహద్దులు పంచుకునే ప్రాంతాల్లో ప్రయాణాలు, రాకపోకలు వ్యాప్తికి కారణం కావచ్చని పేర్కొంది. అయితే భారత్‌లోకి వ్యాధి ఇప్పటికే ప్రవేశించినట్లు ఎలాంటి నిర్ధారణ లేదని స్పష్టం చేసింది.
వ్యాక్సినేషన్‌లో లోపాలే కారణమా?
బంగ్లాదేశ్‌లో టీకాల కొరత, సాధారణ వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో అంతరాయాలు వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. 2024-25లో దేశవ్యాప్తంగా మీజిల్స్-రుబెల్లా వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. 2020 తర్వాత క్రమం తప్పకుండా దేశవ్యాప్త అదనపు టీకా కార్యక్రమాలు నిర్వహించకపోవడం కూడా ప్రభావం చూపింది. బాధిత చిన్నారుల్లో చాలామంది అసలు టీకాలు తీసుకోనివారు లేదా ఒక్క డోసు మాత్రమే తీసుకున్నవారు ఉన్నారు.
భారత్‌లో టీకాల పరిస్థితి
భారత్‌లో మాత్రం మీజిల్స్ టీకాల కవరేజీ మెరుగ్గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2025లో మొదటి డోసు టీకా కవరేజీ 98 శాతం, రెండో డోసు కవరేజీ 95 శాతంగా నమోదైంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో టీకాలు తీసుకోని చిన్నారులు ఉండటంతో స్థానికంగా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యాధి లక్షణాలివే..
మీజిల్స్ అత్యంత వేగంగా వ్యాపించే వైరల్ వ్యాధి. బాధితులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిలోకి వెలువడే తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుంది. వైరస్ సోకిన 10-14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. అధిక జ్వరం, దగ్గు, ముక్కు కారడం, కళ్ల నుంచి నీరు రావడం ప్రారంభ లక్షణాలు. నోటి లోపల చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడటంతోపాటు ముఖం నుంచి శరీరమంతా దద్దుర్లు వ్యాపిస్తాయి.
అప్రమత్తతే అసలైన రక్షణ
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు భారత్‌కు హెచ్చరికగా నిలుస్తున్నాయి. చిన్నారులకు రెండు డోసుల టీకాలు అందేలా చూడటం, అనుమానిత కేసులను గుర్తించడం, టీకాలు తీసుకోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం టీకా కవరేజీ ఆశాజనకంగా ఉన్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో వ్యాధి నిఘాను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: మిస్ యూనివర్స్‌గా ప్యూర్టోరికో సుందరి!


