సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ జీవితంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పటికీ ఆసక్తికరంగా చెప్పుకుంటారు. ఒకరోజు ఉదయం స్నానం కోసం నదికి వెళ్లిన ఆయన మూడు రోజులపాటు కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు మూడు రోజుల తర్వాత తిరిగొచ్చిన ఆయన.. ‘హిందువులంటూ ఎవరూ లేరు.. ముస్లింలంటూ ఎవరూ లేరు’ అంటూ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్ లోధిలో ఉన్న కాళీ బేయీ నది సమీపంలో చోటుచేసుకున్నదని చెబుతారు.
నిత్యం నదికి వెళ్లే గురునానక్
జనమ్‌సాఖీలుగా పిలిచే సిక్కు సంప్రదాయ కథనాల ప్రకారం.. గురునానక్ దేవ్ తన సోదరి బీబీ నానకి, బావతో కలిసి సుల్తాన్‌పూర్ లోధిలో నివసించేవారు. నవాబ్ దౌలత్ ఖాన్ ధాన్యం దుకాణంలో పనిచేసేవారు. ప్రతిరోజూ ఉదయం స్నానం, దైవధ్యానం కోసం కాళీ బేయీ నదికి వెళ్లేవారు. ఒకరోజు తన సహచరుడు భాయ్ మర్దానాతో కలిసి నదికి వెళ్లిన ఆయన.. స్నానం కోసం నీటిలోకి దిగిన తర్వాత అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు.
మూడు రోజుల పాటు ఆచూకీ లేదు
చాలాసేపైనా గురునానక్ తిరిగి రాకపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఆయన కోసం వెతికారు. నదిలో మునిగిపోయి ఉంటారేమోనని కొందరు భావించారు. అయితే మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి కనిపించారు. ఈ సంఘటన అనంతరం ఆయన జీవితంలో కీలకమైన మార్పు చోటుచేసుకుందని అంటారు.
‘హిందువులూ లేరు.. ముస్లింలూ లేరు’
మూడు రోజుల తర్వాత తిరిగొచ్చిన గురునానక్ దేవ్.. తనకు దైవిక అనుభవం కలిగిందని, మానవాళికి సత్య సందేశాన్ని అందించాలనే ప్రేరణ పొందారని జనమ్‌సాఖీల్లో పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ‘న కోయీ హిందూ హై.. న కోయీ ముసల్మాన్’. అంటే దేవుడి దృష్టిలో మతాలకతీతంగా మానవులంతా సమానమేనని ఆయన సందేశం.
మానవత్వమే అసలైన మతం
కులం, మతం, హెచ్చుతగ్గుల పేరుతో మనుషుల మధ్య భేదాలు చూపకూడదని గురునానక్ బోధించారు. పరస్పర ప్రేమ, నిజాయతీ, సేవాభావంతో జీవించాలని సూచించారు. మనిషి గొప్పతనం అతడి మతంలో కాకుండా చేసే మంచి పనుల్లో ఉంటుందని ఆయన బోధనలు తెలియజేస్తాయి.
గురునానక్ బోధించిన మూడు సూత్రాలు
ఆయన బోధనల్లో మూడు ప్రధాన సూత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. నామ్ జపో అంటే భగవంతుడిని స్మరించడం. కిరత్ కరో అంటే కష్టపడి, నిజాయతీగా సంపాదించడం. వండ్ చఖో అంటే సంపాదించిన దానిని ఇతరులతో పంచుకోవడం. ఈ మూడు సూత్రాలు సమాజంలో సమానత్వం, సేవాభావం, మానవత్వం పెంపొందించేందుకు మార్గదర్శకంగా నిలిచాయి.
ఇదీ చదవండి: ‘దురంతో’పై రాళ్ల దాడి.. ఏసీ కోచ్ అద్దం ధ్వంసం!


