గురునానక్ జయంతి (2026 నవంబర్ 24, మంగళవారం) సందర్భంగా దేశంలోని పలు నగరాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నవంబర్ నెల సెలవుల క్యాలెండర్ ప్రకారం మొత్తం 21 నగరాల్లో బ్యాంకు శాఖలు మూసివేయబడతాయి. అయితే ఈ సెలవు దేశవ్యాప్తంగా వర్తించదు. సెలవు ప్రకటించిన నగరాల్లో మాత్రమే బ్యాంకులు పనిచేయవు.
రిజర్వ్ బ్యాంక్ జాబితా ప్రకారం.. ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోహిమా, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్ నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ ప్రాంతాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI) సహా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల శాఖలు మూసివేయబడతాయి.
ఈ సెలవుకు ప్రధాన కారణం గురునానక్ జయంతి. సిక్కు మత స్థాపకుడు, తొలి గురువు అయిన గురునానక్ దేవ్ జీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు కార్తీక పౌర్ణమి, రాస్ పూర్ణిమ కూడా రావడంతో రిజర్వ్ బ్యాంక్ ఈ రోజును సెలవు దినంగా ప్రకటించింది. కార్తీక పౌర్ణమి హిందూ, జైన మతాల్లో పవిత్రమైన రోజుగా భావిస్తారు. రాస్ పూర్ణిమను శ్రీకృష్ణుడి రాసలీలకు గుర్తుగా జరుపుకుంటారు.
అయితే.. అగర్తల, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, గువాహటి, ఇంఫాల్, కొచ్చి, పనాజీ, పాట్నా, షిల్లాంగ్, తిరువనంతపురం, విజయవాడ వంటి నగరాల్లో బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. సెలవు ఉన్న నగరాల్లో కూడా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఎన్ఈఎఫ్టీ, ఐఎంపీఎస్ వంటి డిజిటల్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు నగదు బదిలీలు, బ్యాలెన్స్ తనిఖీలు, బిల్లుల చెల్లింపులు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: పెరిగిన డిమాండ్.. పుంజుకున్న పుత్తడి రేట్లు!


