1.20 లక్షల నిపుణులకు కొలువులు
ఓపీపీఐ, ఈవై నివేదిక
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ ఫార్మా జీసీసీలు ఫార్మా రంగ జీసీసీలు (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్) దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నాయి. 1,20,000 మంది నిపుణులకు కొలువులు కల్పిస్తూ, 10.5 బిలియన్ డాలర్ల స్థూల ఆర్థిక విలువను (జీవీఏ) సృష్టిస్తున్నాయి. ఫార్మా తయారీదారుల సంఘం (ఓపీపీఐ), ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది ఆదాయంపరంగా ప్రపంచంలోనే టాప్ 20 బయోఫార్మా కంపెనీల్లో 80 శాతం సంస్థలు భారత్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయని నివేదిక పేర్కొంది.
ఇవి డ్రగ్ డిస్కవరీ, ఫార్మకోవిజిలెన్స్, క్లినికల్ డెవలప్‌మెంట్, తయారీ, సరఫరా వ్యవస్థ తదితర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపింది. డిజిటల్..ఏఐ సామర్థ్యాలు, మెరుగైన జీసీసీ వ్యవస్థ, పరిశ్రమ–విద్యాసంస్థల నెట్‌వర్క్‌లు, విధానాల మద్దతు మొదలైనవి పరిశ్రమకు సానుకూలంగా ఉంటున్నాయని వివరించింది. పరిశోధనలు, ఆవిష్కరణలు ఆధారిత శక్తివంతమైన ప్రపంచ ఫార్మా కేంద్రంగా భారత్ ఎదిగేందుకు ఇవి దోహదపడగలవని ఓపీపీఐ డైరెక్టర్ అనిల్ మతాయ్ తెలిపారు. కంపెనీల పరివర్తన, మెరుగైన చికిత్స ఫలితాలు, శాస్త్రీయ ఆవిష్కరణలు తదితర అంశాల్లో కీలక పాత్ర పోషించగలిగే జీసీసీలను నెలకొల్పే సామర్థ్యాలు భారత్‌కి ఉన్నాయని ఈవై ఇండియా పార్ట్‌నర్ నిఖిల్ కుమార్ చెప్పారు.


