ఆసియా పసిఫిక్‌లో అత్యంత వేగంగా ఎదిగే ఎకానమీల్లో ఒకటిగా చోటు
కానీ ఎల్‌నినోతో ఆహారోత్పత్తుల రేట్లకు రెక్కలు
భారత్‌పై ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ నివేదిక
న్యూఢిల్లీ: ప్రస్తుత, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో భారత్ 7 శాతం వృద్ధి రేటు సాధించనుంది. తద్వారా 2027లో ఆసియా పసిఫిక్‌లో వియత్నాంతో పాటు అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీల్లో ఒకటిగా నిలవనుంది. ఆసియా పసిఫిక్ దేశాల ఆర్థిక భవితపై ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎల్‌నినో కారణంగా ఆసియా పసిఫిక్ దేశాల్లో, ముఖ్యంగా భారత్‌లో ఆహారోత్పత్తుల రేట్లు భారీగా పెరుగుతాయని రిపోర్ట్ పేర్కొంది. డిసెంబర్ నాటికి కీలక పాలసీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ మరో 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని తెలిపింది.
జూన్, సెపె్టంబర్ త్రైమాసికాల్లో పటిష్టమైన వృద్ధికి.. ఉత్పత్తుల ఎగుమతులు, ప్రభుత్వ రంగ పెట్టుబడులు, రుణాల దన్నుతో ప్రజల్లో వినియోగం పెరగడంలాంటి అంశాల కారణమని వివరించింది. జూలై–సెపె్టంబర్ జీడీపీ వృద్ధి గణాంకాలు నవంబర్ 30న విడుదల కానున్నాయి. సెపె్టంబర్ క్వార్టర్‌లో వృద్ధి 7.2 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్, 7.35 శాతంగా ఉంటుందని ఆర్థిక శాఖ అంచనాలు వెలువరించాయి. ఈ నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఎగుమతులకు కమోడిటీ ధరల దన్ను..
కమోడిటీల రేట్లు పెరగడంతో పాటు ఇతర మార్కెట్లకు విస్తరించడం, గ్లోబల్ సరఫరా వ్యవస్థలతో మరింతగా అనుసంధానం అవుతుండటమనేది భారతదేశ ఉత్పత్తుల ఎగుమతులకు దోహదపడినట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్.. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయనాల విభాగాల్లో ఇది స్పష్టంగా ఉన్నట్లు వివరించింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులు అంత సానుకూలంగా ఉండకపోవచ్చని తెలిపింది. ‘పెరుగుతున్న ముడి వస్తువుల ధరల భారాన్ని వినియోగదారులకు బదలాయించడం పెరగొచ్చు. గత సవాళ్ల ప్రభావాలు (వర్షాభావం మొదలైనవి) కూడా తాజా సమస్యలకు తోడు కావచ్చు‘ అని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. వర్షాభావం, రిజర్వాయర్లలో నిల్వలు తగ్గడం, ఎల్‌నినో పరిస్థితులు మొదలైనవి ప్రస్తుత, రాబోయే రోజుల్లో పంటల దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించింది.


