కష్టకాలాన్ని అధిగమించడానికి, మనసుని మరల్చడానికి నచ్చిన అభిరుచిలో కొనసాగడమే మందు అని నిరూపించింది ఈ మహిళ. ఆమెకు కేన్సర్ మహ్మారి అంటే అలాంటి ఇలాంటి భయం కాదు. ఎందుకంటే ఆ మహమ్మారే తనకెంతో ఇష్టమైన వాళ్లను దూరం చూసింది. అది తనకు వస్తుందన్న ఊహ రాక మునుపే దాడి చేసి భయపెట్టింది. అయితే ఆమె ఆ మహమ్మారికి ఛాన్స్ ఇవ్వకుండా ధైర్యంగా ఎదుర్కొనేందుకు తనకిష్టమైన వంటనే ఆయుధంగా చేసుకుంది. తన కుకింగ్ స్కిల్స్‌తోనే కేన్సర్‌పై విజయం సాధించడం విశేషం . మరి అదెలాగో చకచక చదివేయండి మరి ఈ కథనం.
ఆ మహిళే జైపూర్‌కు చెందిన వినీతా సోమాని. ఆమెకు 2011లో రొమ్ము కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. అంతే ఒక్కసారిగా ఆమె కాళ్ల కింద భూమి కంపించిపోతున్నంత భయం వేసిందామెకు. ఎందుకుంటే ఆ మహమ్మారే తన తల్లి, తండ్రి, మేనత్త అనే ముగ్గురు కుటుంబ సభ్యులను దూరం చేసింది. తనకెంతో ఇష్టమైన వాళ్లు ఆ వ్యాధి వల్లే చనిపోయారు. ఇక తన పరిస్థితి ఏంటనేది ఆమెకు మరింత భయాందోళనలు రేకెత్తించింది.
ఈ వ్యాధికి అదే మందు..
అయితే ఆమె ఆ ప్రాణాంతక కేన్సర్‌కు అంత ఛాన్స్ ఇవకూడదని స్ట్రాంగ్ డిసైడ్ అయ్యింది. తన కొడుకు పెళ్లి ఏర్పాట్లు తనను కొంత ఆ భయం నుంచి బయటపడేసినప్పుడే తనలో ఒక ఆశాకిరణం వెల్లివిరిసింది. ఇలా ఆ బాధను మర్చిపోయేలా తనకు నచ్చిన అభిరుచిలో కొనసాగడమే దీనికి మందుకు అనుకుంది. తనకు చాన్నాళ్లుగా ఇష్టమైన అభిరుచి..అంతగా తను పట్టించుకోనిది అయిన కుకింగ్ వైపు అడుగులు వేసింది. తన ఇంటిలో ఖాళీగా ఉన్న గ్యారేజ్‌లో వంటకాలను అభ్యసించడం మొదలు పెట్టింది. ఒకపక్క కీమోథెరపీ చేయించుకుంటూనే..విరామ సమయంలో విభిన్న వంటకాలను ట్రై చేస్తూ ఉండేది. పైగా కొందరికి బోధించడం వంటివి చేస్తుండేది. త
న కుకింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి వంట పుస్తకాలు, పాకశాస్త్ర కార్యక్రమాలను అన్వేషించడం ప్రారంభించింది. అలా పాకశాస్త్ర రచియిత్రి తర్లా దలాల్ ఆమెను ఎంతగానే ప్రభావితం చేసింది. పైగా ఆమె నైపుణ్యాలన్నీ అందిపుచ్చుకుంది కూడా. ఆ తర్వాత అంతర్జాతీయ వంటకాలపై దృష్టిపెట్టింది. ఆ వంటకాలు జైపూర్‌లో అంతగా అందుబాటులో లేవని గమనించి ఇటాలియన్, మెక్సికన్, కాంటినెంటల్, జపనీస్ , చైనీస్ వంటకాలను తయారు చేయడం నేర్చుకోవడం మొదలుపెట్టడమే గాదు, ప్రజలు ఆమె వంటకాలను ఇష్టపడటం ప్రారంభించారు.
సరదాగా మొదలై..సంస్థగా..
ఏదో సరదాగా మొదలుపెట్టిన చిన్న గ్యారేజీ వంటగది కాస్తా ఆర్డర్లు వెల్లువెత్తడం వరకు దారితీసింది. దాంతో ఆమె ఆ గ్యారేజ్ వంటగదిని కాస్తా పాకశాస్త్ర సంస్థగా మార్చేసింది. డిమాండ్ పెరగడంతో సోమాని 'అపెటైట్' అనే ఒక స్వదేశీ ఆహార సంస్థను ప్రారంభించింది. దీని ద్వారా స్వదేశీ, అంతర్జాతీయ వంటకాలను కవర్ చేసేలా సర్వ్ చేయడమే కాదు వంట తరగతులను కూడా అందించింది. స్వయంగా సంపాదించాలనుకునే వాళ్లకు ఈ పాకవిద్య ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి వంట స్కూల్‌ని ప్రారంభించి బేకరీ, వంట పద్ధతలపై శిక్షణ కూడా ప్రారంభించిందామె.
ఆమె దగ్గర వంట స్కిల్స్ నేర్చుకున్న మహిళలు లక్షల్లో డబ్బు ఆర్జించడం ప్రారంభించడం విశేషం. అంతేగాదండోయ్ ప్రముఖ్ చెఫ్ సంజీవ్ కపూర్ సైతం ఆమెను ప్రశంసించారు. జైపూర్ హోమ్ చెఫ్‌గా గుర్తింపు లభించడమే కాదు పలు అవార్డులు, సత్కారాలు లభించాయి కూడా. అలా హాయిగా సాగిపోతుందనగా..మరోసారి కేన్సర్ దాడి చేసింది ఈసారి రెండొవ రొమ్ములో కేన్సర్ ఉందని, మూడో స్టేజ్‌లో ఉన్నట్లు నిర్థారించారు వైద్యులు.
ఈసారి తీవ్రమైన కీమోథెరపీ వల్ల వికారం..ఆ ట్రీట్‌మెంట్‌లో భాగంగా అధిక మొత్తంలో ఇచ్చే మందుల వల్ల కనీసం కొంచెం కూడా తినలేక అల్లాడింది. ఆ సమయంలో తన పాక విద్యతో సంపాదించుకున్న స్నేహితులు, ఆత్మీయులు ఆమెకు అండగా నిలిచారు. ఆమె సత్వరమే కోలుకునేలా ఆమె దగ్గర నేర్చుకున్న వంట స్కిల్స్‌నే ఆమె ముందు వీడియోల రూపంలో ప్రదర్శించేవారు. అలా మరోసారి ఆ కేన్సర్‌పై కూడా గెలిచింది సోమాని.
కేన్సర్ వారియర్‌లుగా మారుస్తూ..
అక్కడితో ఆగిపోలేదు..తనలా ఈ కేన్సర్ మహమ్మారితో పోరాడుతున్న వారికి తన కథను వివరిస్తూ..వారిలో ధైర్యాన్ని నూరుపోస్తూ..పోరాడేలా చేస్తుండటం విశేషం. తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ..ఎందరో మహిళనలను ప్రభావితం చేసిందామె. అలాగే ఆమె 'ఆప్‌బీతీ' ద్వారా ప్రజలు తాము ఎదుర్కొన్న అనారోగ్యాలు, కుటుంబ కష్టాలు గురించి విమర్శలు ఎదుర్కొనకుండా నిర్భయంగా పంచుకునేలా చేశారామె.
దాంతోపాటు తన వంతుగా వీలైన సాయం కూడా అందించి, ఎందరో జీవితాలను మార్చారామె. అంతేగాదు ఆమె ఇటీవలే, జూలై 2026లో FICCI FLO జైపూర్ ఆధ్వర్యంలో AWWA మహిళల కోసం ఆమె ఐదు రోజుల బేకరీ వర్క్‌షాప్‌ను నిర్వహించింది కూడా. ఆమె కథ కష్టకాలంలో చేపట్టే కొన్ని కార్యాలు ఎంత పెద్ద విజయానికి పునాది వేసి..మనకు ఆర్థికంగా మానసికంగా ఎలా భరోసానిస్తాయో చెబుతోంది కదూ..!.
ఇది చదవండి: అచ్చం పోస్ట్‌కార్డులో ఉన్నట్లుగా..బంతిపూల గ్రామం! ఎక్కడుందంటే..


