న్యూఢిల్లీ: నేపాల్ ప్రధాని బాలెన్ షా భారత పర్యటనలో ఆసక్తికర బహుమతుల మార్పిడి చోటుచేసుకుంది. ఒకరు శివుడి సన్నిధి నుంచి తెచ్చిన కానుక ఇస్తే.. మరొకరు పవిత్ర గంగాజలాన్ని అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలెన్ షా మధ్య జరిగిన ఈ కానుకల మార్పిడి ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేపాల్ ప్రధాని బాలెన్ షా తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాధి నేతలు ప్రత్యేక కానుకలను ఇచ్చిపుచ్చుకున్నారు.
బాలెన్ షా తీసుకొచ్చిన బహుమతి ప్రత్యేకతను సంతరించుకుంది. నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతినాథ ఆలయానికి సంబంధించిన రుద్రాక్షలు, చందనాన్ని ఆయన ప్రధాని మోదీకి అందజేశారు. హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసాల్లో ప్రత్యేక స్థానం ఉన్న రుద్రాక్షలు, చందనం కానుకగా ఇవ్వడం ద్వారా నేపాల్ సాంస్కృతిక సంప్రదాయాన్ని ఆయన చాటిచెప్పారు. బాలెన్ షా ఇచ్చిన కానుకకు ప్రతిగా ప్రధాని మోదీ కూడా ప్రత్యేక బహుమతిని అందించారు. త్రివేణి సంగమానికి చెందిన పవిత్ర గంగాజలంతో నింపిన కలశాన్ని నేపాల్ ప్రధానికిచ్చారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో గంగాజలానికి ఉన్న విశిష్టతను చాటేలా ఈ కానుకను అందించారు.
ఈ బహుమతుల మార్పిడి కేవలం ఇద్దరు ప్రధానుల మధ్య జరిగిన మర్యాదపూర్వక కార్యక్రమం మాత్రమే కాదు. భారత్, నేపాల్ మధ్య తరతరాలుగా కొనసాగుతున్న మతపరమైన, సాంస్కృతిక అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. బహుమతుల ఇచ్చిపుచ్చుకున్న అనంతరం మోదీ, బాలెన్ షా ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు.
ఇదీ చదవండి: భర్త పెట్టిన బొట్టు చెరిపించి.. ప్రియునితో తాళి కట్టించి..


