పేదరికం తగ్గిందంటేవారికి నచ్చట్లేదు! | Opposition Can not Be Happy With India Development, Modi criticizes | Sakshi
Sakshi News home page

పేదరికం తగ్గిందంటేవారికి నచ్చట్లేదు!

Nov 23 2026 3:55 AM | Updated on Nov 23 2026 3:55 AM

Opposition Can not Be Happy With India Development, Modi criticizes

ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు  

తమ ప్రయత్నాలు ఫలించాయనే తృప్తి ఉందని స్పష్టీకరణ  

రాబోయే తరాలు భారతదేశ స్వర్ణయుగాన్ని చూస్తాయని వెల్లడి  

అహ్మదాబాద్‌: దేశంలో గత 12 ఏళ్లలో 50 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఈ నిజాన్ని అంగీకరించడానికి కొందరు వ్యక్తులు ఇప్పటికీ సంకోచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్షంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించిన ‘స్నేహ మిలన్‌’కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. 50 లక్షల మంది పేదరికం నుంచి బయటపడడం తమ ప్రభుత్వ విధానాలు, కృషికి లభించిన విజయమని పేర్కొన్నారు. 

స్వాతంత్య్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారు, స్వేచ్ఛ కోసం జీవితాలను అంకితం చేసినవారు, ప్రజల స్వేచ్ఛ కోసం తమ యవ్వనాన్ని జైళ్లలో గడిపినవారు.. వీరందరి ఆత్మలు ఎక్కడ ఉన్నా నేడు ప్రపంచ బ్యాంక్‌ నివేదికను చూసి ఎంతో సంతోషిస్తుంటారని చెప్పారు. ‘నా దేశం నుంచి పేదరికం తొలగిపోతోంది అని వారు భావిస్తుంటారు’అని పేర్కొన్నారు. వెయ్యి సంవత్సరాల బానిసత్వం మనల్ని పేదరికంలోకి నెట్టేసిందని, నేడు ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారని, జీవితంలో దీనికంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదు, దీనికంటే గొప్ప విజయం మరొకటి లేదని తేల్చిచెప్పారు.

 అయితే, కొందరు ఈ విజయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరని ప్రధాని విమర్శించారు. ఇదంతా బీజేపీ పాలనలో జరగడం వల్ల చాలామంది దీని గురించి బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారని చెప్పారు. వారికి నచ్చినా, నచ్చకపోయినా తమ ప్రయత్నాలు ఫలించాయనే తృప్తి తమకు ఉందని స్పష్టంచేశారు. ఈ పరిణామాన్ని పౌరుల జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాందిగా అభివర్ణించారు. రాబోయే తరాలు భారతదేశ స్వర్ణయుగాన్ని చూస్తాయని ఉద్ఘాటించారు. తమ ఉద్దేశం నిజాయతీతో కూడుకున్నదని, తమ విధానం, దిశ సరైనవని, కష్టపడే తత్వంలో లోపం లేదని వ్యాఖ్యానించారు.  

భూకంప బాధితులతో కలిసి దీపావళి  
ఈ ఏడాది దీపావళి తనకు ఎంతో ప్రత్యేకమని ప్రధాని మోదీ తెలిపారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టి నేటికి 25 ఏళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి కఠోర శ్రమ వల్లే తాను తన సొంత రాష్ట్రానికి, దేశానికి సేవ చేయగలిగానని వివరించారు. 2001లో గుజరాత్‌లో సంభవించిన వినాశకరమైన భూకంపం గురించి మోదీ గుర్తుచేసుకున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మొదటి దీపావళిని భూకంప బాధితుల కుటుంబాలతో కలిసి గడిపానని వెల్లడించారు. అసలైన సంతోషం, నిజమైన ఆనందం మరొకరి జీవితంలో ఆశ అనే దీపాన్ని వెలిగించడంలోనే ఉందన్న నమ్మకం ఆ రోజు మరింత బలపడిందని పేర్కొన్నారు. గుజరాత్‌ అభివృద్ధి ప్రస్థానాన్ని సైతం గుర్తుచేశారు. 

ఒకప్పుడు ప్రధానంగా వాణిజ్యానికి మాత్రమే పరిమితమైన రాష్ట్రం నేడు పాడి, వ్యవసాయం, పరిశ్రమలు, సెమీకండక్టర్లు, పెట్రోకెమికల్స్, ఆటోమొబైల్స్, హరిత ఇంధనం వంటి రంగాల్లో శరవేగంగా దూసుకెళ్తోందని హర్షం వ్యక్తంచేశారు.గుజరాత్‌ ఆర్థిక ప్రగతి దేశాభివృద్ధికి గణనీయంగా దోహదపడిందని మోదీ అన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని బీజేపీ కార్యకర్తలను పిలుపునిచ్చారు. గుజరాత్‌లో నెలకొల్పిన సామాజిక సామరస్యం, ఐక్యత రాష్ట్రంతో పాటు దేశ పురోగతికి కూడా దోహదపడతాయని చెప్పారు. గత 25 ఏళ్లలో సాధించిన విజయాల కంటే రాబోయే 20 ఏళ్లలో గుజరాత్‌ మరిన్ని గొప్ప విజయాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement