షుగర్‌ తగ్గాలంటే ఇన్సులిన్‌ అక్కర్లేదు! | USA researchers find insulin-free path to blood sugar control | Sakshi
Sakshi News home page

షుగర్‌ తగ్గాలంటే ఇన్సులిన్‌ అక్కర్లేదు!

Nov 23 2026 3:18 AM | Updated on Nov 23 2026 3:18 AM

 USA researchers find insulin-free path to blood sugar control

వ్యాయామ సమయంలో రక్తంలోని చక్కెరను కండరాలు వేగంగా గ్రహించే కొత్త మార్గం గుర్తింపు 

కండర కణాల్లో ఎంఎస్‌జీఎల్‌టీ అనే రహస్య ద్వారాన్ని కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు 

టైప్‌–2 డయాబెటిస్‌ చికిత్సలో కొత్త తరం మందుల తయారీకి మార్గం సుగమం

మధుమేహం అనగానే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే ఇన్సులిన్‌ హార్మోన్‌ గుర్తుకొస్తుంది. అయితే శరీరానికి తగినంత శారీరక శ్రమ కల్పించినప్పుడు ఇన్సులిన్‌ సాయం ఏమాత్రం లేకపోయినా కండరాలు రక్తంలోని గ్లూకోజ్‌ను వేగంగా గ్రహించగలవని శాస్త్రవేత్తలు తేల్చారు. కండర కణాల్లో దాగి ఉన్న ఈ అద్భుత జీవక్రియ రహస్యాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటి కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్, ఈజిప్‌్టలోని మౌంట్‌ సినాయ్‌ పరిశోధకులు ఉమ్మడి పరిశోధనల్లో ఛేదించారు. ఈ జీవక్రియకు దోహదపడే కొత్త రవాణా వ్యవస్థకు ఎంఎస్‌జీఎల్‌టీ అని పేరు పెట్టారు. డా. నటాలీ జె. నార్మన్‌ నేతృత్వంలో సాగిన ఈ పరిశోధన వివరాలు ప్రముఖ జర్నల్‌ కమ్యూనికేషన్స్‌ బయాలజీలో ప్రచురితమయ్యాయి.

భవిష్యత్‌ ఆశలు 
ప్రస్తుతం ఈ పరిశోధన ఎలుకల కణజాలంపై మాత్రమే జరిగింది. తదుపరి దశలో ఎంఎస్‌జీఎల్‌టీ జన్యు నిర్మాణాన్ని పూర్తిగా విశ్లేíÙంచి మానవ శరీరంలో ఇది ఎలా పనిచేస్తుందో నిర్ధారించాల్సి ఉంది. ఈ మార్గాన్ని సురక్షితంగా ప్రేరేపించే మందులను భవిష్యత్తులో తయారు చేయగలిగితే ఇన్సులిన్‌ పనిచేయని రోగుల్లోనూ బ్లడ్‌ షుగర్‌ను సులభంగా నియంత్రించే సరికొత్త వైద్య విధానం అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వ్యాయామంతో 100 రెట్లు వేగంగా..
సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత రక్తంలో పెరిగే గ్లూకోజ్‌ను దేహంలోని కణాలు శోషించుకోవడానికి ఇన్సులిన్‌ ఒక తాళం చెవిలా పనిచేస్తుంది. ఇది కండర కణాల్లోని జీఎల్‌యూటీ4 అనే ద్వారాన్ని తెరవడం ద్వారా చక్కెరను లోపలికి పంపుతుంది. కానీ మనం వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో ఇన్సులిన్‌ స్థాయిలు సహజంగానే తగ్గిపోతాయి. అయినప్పటికీ వ్యాయామం జరిగేటప్పుడు కదిలే కండరాలు విశ్రాంతి సమయంలో కంటే ఏకంగా 100 రెట్లు వేగంగా రక్తంలోని చక్కెరను గ్రహిస్తాయి. ఇన్సులిన్‌ నిరోధకతతో బాధపడే టైప్‌–2 డయాబెటిస్‌ బాధితుల్లో సైతం వ్యాయామం చేసినప్పుడు ఈ ప్రక్రియ సమర్థంగా పనిచేయడం విశేషం. ఇన్నేళ్లుగా అంతుచిక్కని ఈ జీవక్రియ రహస్యాన్ని తాజా పరిశోధన వెలుగులోకి తెచి్చంది.

ఎలా పనిచేస్తుంది? 
ఇన్సులిన్‌ ఏమాత్రం లేని వాతావరణంలో ఎలుకల కండరాలను కదిలించి (సంకోచం చెందించి) పరిశోధకులు పరీక్షించారు. ఈ క్రమంలో జీఎల్‌యూటీ4 ద్వారానికి బదులుగా ఎంఎస్‌జీఎల్‌టీ అనే మరో స్వతంత్ర గ్లూకోజ్‌ రవాణా వ్యవస్థ పనిచేస్తున్నట్లు గుర్తించారు. కండర కణాల ఉపరితలంపై ఉండే సూక్ష్మ మడతల్లో ఒక చిన్న పంపు పక్కనే ఇది అమరి ఉంటుంది. కండరం కదిలిన ప్రతిసారీ ఈ పంపు శక్తినివ్వడంతో ఎంఎస్‌జీఎల్‌టీ ద్వారా గ్లూకోజ్‌ నేరుగా కండర కణాల్లోకి ప్రవహిస్తుంది. కిడ్నీలలో ఉండే చక్కెర రవాణా వ్యవస్థను పోలి ఉన్నప్పటికీ కిడ్నీ డయాబెటిస్‌ మందులు దీనిపై పెద్దగా ప్రభావం చూపవు. అంటే శారీరక శ్రమకు అవసరమైన శక్తిని అందించడానికి కండరాలు సొంతంగా ఈ ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉన్నాయని స్పష్టమైంది.

కండరాలే అసలైన ‘షుగర్‌ స్టోర్లు’ 
మానవ శరీర బరువులో సుమారు 40 శాతం వాటా ఎముకల చుట్టూ ఉండే కండరాల (స్కెలెటల్‌ మజిల్‌)దే. మనం ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి చేరే చక్కెరలో 90 శాతం వరకు కండరాలే శోషించుకొని నిల్వ చేసుకుంటాయి. విశ్రాంతి సమయంలో కంటే వ్యాయామం చేసేటప్పుడు కండరాలు 100 రెట్లు వేగంగా గ్లూకోజ్‌ను ఖర్చు చేస్తాయి. అందుకే డయాబెటిస్‌ నియంత్రణలో శారీరక శ్రమ అత్యంత కీలకం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement