ఎఫ్‌ఐఐలు వచ్చారు..  బ్యాంకు షేర్లు పెరిగాయి..తరవాతేంటి? | FIIs have made a big comeback to the indian market, Sakshi Special Story | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఐఐలు వచ్చారు..  బ్యాంకు షేర్లు పెరిగాయి..తరవాతేంటి?

Nov 23 2026 1:23 AM | Updated on Nov 23 2026 1:23 AM

FIIs have made a big comeback to the indian market, Sakshi Special Story

అంతర్జాతీయ ట్రెండ్‌కు భిన్నంగా మన మార్కెట్లలో పరిస్థితి

20 రోజుల్లోనే రూ.1.06 లక్షల కోట్ల మేర ఎఫ్‌ఐఐ కొనుగోళ్లు

వీటిలో రూ.43వేల కోట్లు ఒక్క బ్యాంకింగ్, ఆర్థికసేవల్లోకే

భారీగా ర్యాలీ చేసిన బ్యాంకులు... ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి బ్యాంక్‌ నిఫ్టీ

కొనుగోళ్లలో తరువాతి స్థానాల్లో టెలికామ్, ఆటోమొబైల్‌ తదితరాలు

దేశీ మ్యూచ్‌వల్‌ ఫండ్లు అధికంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నది మాత్రం హెల్త్‌కేర్‌లో

తదుపరి ర్యాలీ ఈ రంగంలో ఉండొచ్చంటున్న నిపుణలు

అమెరికా, జపాన్, చైనా మార్కెట్లలో భారీ ర్యాలీలకు ఇప్పటికే బ్రేక్‌

గడిచిన నెలరోజుల్లోనే 15 శాతం వరకూ నష్టపోయిన నాస్‌డాక్‌

ట్రిలియన్ల కొద్దీ ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద

రూపాయి బలోపేతం, క్రూడ్‌ ధర తగ్గుదల, వేల్యుయేషన్లే మన ర్యాలీకి కారణం

డిసెంబరు త్రైమాసికం ఫలితాలను బట్టి తదుపరి పరిణామాలు

ఇన్వెస్టర్లు పెరిగే షేర్ల వెంట పడకుండా.. జాగ్రత్తగా అడుగులులేయాలంటున్న నిపుణులు  

ఇది మార్కెట్‌ పండితులు సైతం ఊహించని మార్పే. ఎందుకంటే జస్ట్‌ నెలరోజులు. అంతే!!. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆకర్షణీయంగా కనిపిస్తూ కొత్త గరిష్ఠ స్థాయిల్ని నమోదు చేస్తున్న అంతర్జాతీయ మార్కెట్లు నేలచూపులు మొదలెట్టాయి. అమెరికా, చైనా, జపాన్‌ వంటి దిగ్గజ మార్కెట్లు భారీ పతనాన్ని చూస్తున్నాయి. టెక్‌ దిగ్గజాల సూచీ నాస్‌డాక్‌ ఏకంగా 15 శాతానికిపైగా పడిపోయింది. 

ట్రిలియన్ల కొద్దీ డాలర్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతోంది. మరోవైపు భారత మార్కెట్లేమో ఈ ధోరణికి భిన్నంగా కదిలాయి. నెల కిందటివరకూ చతికిలబడి... చాలా షేర్లు ఏడాది కనిష్ఠ స్థాయిలకు చేరిన పరిస్థితి నుంచి ఒక్కసారిగా జోరందుకున్నాయి. నెల తిరిగేసరికి ఇపుడు సెన్సెక్స్, నిఫ్టీ వంటి సూచీలు కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేయటానికి ఉరకలేస్తున్నాయి. 

బ్యాంకుల పనితీరు చూపించే బ్యాంక్‌ నిఫ్టీ అయితే కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది కూడా!. ఎందుకిలా? అంతర్జాతీయ పరిణామాలు మన మార్కెట్లకు పట్టవా? ఇంతటి అనూహ్య పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఒకవేళ ఊహించని పతనం సంభవిస్తే ఏ సెక్టర్లయితే రక్షణనిస్తాయి? ఏ షేర్లు బాగున్నాయి? ఎఫ్‌ఐఐల పెట్టుబడుల రాకతో పెరిగిన షేర్ల పరిస్థితేంటి? ఇవన్నీ వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్‌’ ప్రత్యేక కథనం...

మన మార్కెట్లను ప్రధానంగా నడిపించేది విదేశీ సంస్థాగత పెట్టుబడులేనని అందరికీ తెలుసు. కాకపోతే గడిచిన ఏడాదిగా ఎఫ్‌ఐఐలు ఇక్కడి షేర్లు అమ్మి డబ్బులు వెనక్కి తీసుకెళుతున్నారే తప్ప నికరంగా కొనటం లేదు. మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. కాకపోతే దేశీ ఇన్వెస్టర్లలో అవగాహన పెరిగి, క్రమం తప్పకుండా ‘సిప్‌’ పెట్టుబడులు చేస్తున్నారు కనక మన మార్కెట్లు మరీ దారుణంగా పతనమవ్వలేదు. సూచీలు మాత్రం భారీగానే తగ్గాయి. అంతర్జాతీయంగా బాండ్లపై వడ్డీలు పెరగటం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బాగా క్షీణించటం, ముడిచమురు ధరలు రికార్డు స్థాయికి చేరటంతో ఇవన్నీ ప్రతికూలంగా మారి ఎఫ్‌ఐఐలు వెనక్కెళ్లటం 
మొదలెట్టారు.  

పరిస్థితులు కొంత మారాయి. రూపాయి బలపడుతూ 97 స్థాయి నుంచి 92 స్థాయికి వచి్చంది. ముడిచమురు ధరలు కాస్త దిగివచ్చాయి. షేర్ల ధరలు తగ్గి ఆకర్షణీయంగా మారాయి. అంతే!! జనవరి నుంచి అక్టోబరు వరకు నికరంగా 2.95 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు.. అక్టోబరు 27 నుంచి నవంబరు 17 మధ్య... 20 రోజుల్లోనే ఏకంగా 1.06 లక్షల కోట్లు గుమ్మరించారు. ఫలితం... మార్కెట్లు రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. నిజానికి సెపె్టంబరు చివరినాటికి ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో ఎఫ్‌ఐఐల వాటా 14.7 శాతానికి పడిపోయింది. ఇది 21 ఏళ్ల కనిష్ఠ స్థాయి. ఇదే ఒకరకంగా టర్న్‌ అరౌండ్‌ స్థాయి అని చెప్పొచ్చు.

ఏ రంగాల్లో కొనుగోళ్లు జరిగాయంటే... 
నవంబరు 1–15 మధ్య కొనుగోళ్లకు సంబంధించి ఎన్‌ఎస్‌డీఎల్‌ రంగాలవారీ డేటాను చూస్తే ఆర్థికసేవల రంగంలోకి అత్యధిక నిధులు ప్రవహించాయి. అందుకే బ్యాంక్‌ నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిందని చెప్పాలి. ఆ తరువాతి వరసల్లో టెలికామ్, ఆటోమొబైల్, కన్సూమర్‌ సేవలు, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, నిర్మాణ రంగం ఉండగా... క్యాపిటల్‌ గూడ్స్‌ రంగం నుంచి నవంబర్లో కూడా వెనక్కి తీసుకోవటం గమనార్హం.


ఈ డేటాను చూస్తే అర్థమయ్యేది ఒక్కటే. నవంబరు కొనుగోళ్లతో బాగా లబ్ధి పొందింది బ్యాంకులు, ఆర్థిక సేవలందించే సంస్థలే. మొత్తం నిధుల్లో నగానికిపైగా ఒక్క సెక్టర్లోనే పెట్టారంటేనే దీనికిస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. నవంబర్లో ఈ రంగంలోని ప్రధాన షేర్ల పనితీరును చూద్దాం...



హెల్త్‌కేర్‌ వర్సెస్‌ ఫైనాన్షియల్స్‌
నవంబర్లో ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల తరవాత ఒక విచిత్రమైన  పరిస్థితి కనిపిస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాన్ని ఫేవరెట్లుగా భావిస్తుంటే... దేశీ మ్యూచువల్‌ ఫండ్లు మాత్రం  హెల్త్‌కేర్‌ రంగంపై దృష్టిపెట్టాయి. కాబట్టి రిటైల్‌  ఇన్వెస్టర్లు కూడా ఇప్పటికే భారీగా పెరిగిన బ్యాంకింగ్‌ రంగాన్ని ఒక్కదానే కాకుండా దేశీ ఫండ్లు ఇన్వెస్ట్‌ చేసిన హెల్త్‌కేర్‌ రంగాన్ని కూడా నిశితంగా గమనించాలన్నది నిపుణుల మాట. ఈ రంగం తదుపరి ర్యాలీని చూడొచ్చన్నది కూడా వారి అభిప్రాయం.

బ్యాంకులు సరే... వాట్‌ నెక్ట్స్‌? 
బ్యాంకింగ్‌
నవంబర్లో రికార్డు స్థాయిలో ఈ రంగంలోకి నిధులు ప్రవహించినా ఇంకా విదేశీ వాటాలు పెరగటానికి ఈ రంగంలో చాలా అవకాశముందన్నది నిపుణుల మాట. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్‌ మహీంద్రా వంటి ప్రైవేటు బ్యాంకులతో పాటు ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి ఆర్థిక సంస్థల రుణ వృద్ధి, ఆస్తుల నాణ్యత పెరిగితే వీటిలోకి మరిన్ని నిధులు ప్రవహిస్తాయన్నది వారి అభిప్రాయం.

ఆటోమొబైల్, ఆటో పరికరాలు..
దేశీ వినియోగం పెరుగుతుండటం, ప్రీమియం వాహనాలకు గిరాకీ, ఎస్‌యూవీలకు డిమాండ్‌ పెరగటం, ఈవీలపై మొగ్గుతో పాటు విదేశీ ఎగుమతులూ పెరుగుతున్న నేపథ్యంలో ఎం అండ్‌ ఎం, మారుతీ సుజుకీ, టీవీఎస్‌ మోటార్స్, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్, సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్‌ ఫోర్జింగ్స్‌ వంటివి ఈ 
రంగంలోని ఫేవరెట్లుగా చూడొచ్చు.

ఇన్‌ఫ్రా... పారిశ్రామిక సంస్థలు...
వాస్తవానికి ఇన్‌ఫ్రా రంగానికి పరిస్థితులేమీ అంత అనుకూలంగా లేవు. ఇంధన ధరల ప్రభావం వీటిపై తీవ్రంగా ఉంది. కానీ మూలధన విస్తరణ, మౌలిక  సదుపాయాల అభివృద్ధి, తయారీ రంగం పెరగటం వంటివి ఈ రంగంలో కొన్ని కంపెనీలకు అనుకూలమేనని చెప్పాలి. ప్రధానంగా అ్రల్టాటెక్‌ సిమెంట్, ఎల్‌ అండ్‌ టీ, సీమెన్స్, కమిన్స్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ వంటివి ధరలు తగ్గుతున్నపుడు ఇన్వెస్ట్‌ చేయదగ్గవేనని చెప్పొచ్చు.

టెలికామ్, డిజిటల్‌ ఇన్‌ఫ్రా..
డేటా వినియోగం పెరుగుతూనే ఉంది. 5జీపై రాబడులు... వినియోగదారుపై వచ్చే ఆదాయం పెరగటం వంటివి ఈ ర ంగంలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో, ఇండస్‌ టవర్స్‌ను ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.

హెల్త్‌కేర్, ఫార్మా స్యూటికల్స్‌..
ఆదాయాలు పెరిగి ఆరోగ్య సంరక్షణపై పెట్టే ఖర్చు కూడా పెరుగుతుండటం... దానికి తగ్గట్లే ఆసుపత్రులు విస్తరిస్తుండటం, ప్రత్యేక మందులు అందుబాటులోకి వస్తుండటం. ఎగుమతులు పెరగటం వంటివి ఈ రంగాన్ని ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌తో పాటు అపోలో హాస్పిటల్స్, లారస్‌ ల్యాబ్స్, సన్‌ ఫార్మాస్యూటికల్స్, డాక్టర్‌ రెడ్డీస్‌ వంటివి వాచ్‌లిస్ట్‌లో ఉంచొచ్చు.

ఇన్వెస్టర్లు ఏం చేయాలిపుడు? 
నిజానికి బ్యాంకింగ్‌ రంగంలోని షేర్లు ఇప్పటికే బాగా పెరిగాయి. మరింత పెరగాలంటే దానికి తగ్గ ఆదాయాలు కనిపించాలి. ఒకవేళ ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం కొనసాగితే కనక లార్జ్‌క్యాప్‌ ఆర్థిక రంగ షేర్లు, సూచీల్లో ఎక్కువ వెయిటేజీ ఉన్న షేర్లు బాగా లబ్ధి పొందుతాయి. ఒకవేళ ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు తగ్గితే దేశీ ఫండ్ల లిక్విడిటీ, తదుపరి ఆదాయాల వృద్ధిపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ రెండూకాకుండా అంతర్జాతీయ మార్కెట్ల మాదిరే ఇక్కడా రిస్కు తగ్గించుకోవాలనుకుని ఎఫ్‌ఐఐలు విక్రయాలు జరిపితే కనక పెరిగిన షేర్లలో వేగంగా కరెక్షన్‌ కూడా సంభవించవచ్చు. నవంబర్లో ‘స్టాండర్డ్‌ చార్టర్డ్‌’ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశీ మార్కెట్లలో రిస్‌్క–రివార్డ్‌ రేషియో చిన్న షేర్ల కన్నా పెద్ద షేర్లలోనే అనుకూలంగా ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు చేయాల్సిందేంటంటే... 

→ కొద్దిరోజుల్లోనే రివ్వుమంటూ 15–20 శాతం పెరిగిన షేర్లవెనక పరుగులొద్దు. కన్సాలిడేషన్‌ కోసం కొంత వేచిచూస్తే మంచిది.  
→ బలమైన ఆదాయ వృద్ధి, సరైన వాల్యుయేషన్స్‌ ఉన్న లార్జ్‌క్యాప్‌ షేర్లవైపే మొగ్గు చూపిస్తే మంచిది.  
→ ఎంపిక చేసుకున్న బ్యాంకింగ్, ఆర్థికసేవల రంగ షేర్లను మెల్లగా కొనుగోలు చేయొచ్చు.  
→ డిసెంబరు త్రైమాసికంలో విడుదలయ్యే డేటాను బట్టి ఎఫ్‌ఐఐల వాటా ఏఏ షేర్లలో పెరిగిందో తెలుస్తుంది. ఆదాయాలు, వాల్యుయేషన్ల ఆధారంగా వాటికి చూడొచ్చు.  
→ కరెక్షన్లు జరిగినపుడు కొనుగోలు చేయడానికి కొంత నగదు ఉంచుకోవటం మంచిది.  
→ ఎఫ్‌ఐఐలు వాటా పెంచుకున్నారనే ఒకే ఒక్క కారణంతో చిన్న షేర్లను కొనటం సరికాదు. లిక్విడిటీ, గవర్నెన్స్, వాల్యుయేషన్‌ రిసు్కలు వీటిలో చాలా ఎక్కువ. 
→ ఈ ర్యాలీ ఎక్కడ ముగుస్తుందో అంచనా వేయటం కాకుండా... దీర్ఘకాల ఇన్వెస్టర్లయితే ‘సిప్‌’ పద్ధతిలో పెట్టుబడులను డైవర్సిఫై చేసుకుంటూ వెళ్లటం బెటర్‌.

(రమణమూర్తి మంథా) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement