ఇండియాలో చైనా కంపెనీ సంచలనం.. 20 వేల కార్లు అమ్మేసింది! | BYD India Crosses 20000 EV Deliveries Know The Details | Sakshi
Sakshi News home page

ఇండియాలో చైనా కంపెనీ సంచలనం.. 20 వేల కార్లు అమ్మేసింది!

Nov 22 2026 8:09 AM | Updated on Nov 22 2026 8:16 AM

BYD India Crosses 20000 EV Deliveries Know The Details

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ భారత మార్కెట్లో కీలక మైలురాయిని చేరుకుంది. ఇండియాలో ఇప్పటివరకు 20,000 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో 10,000 కార్ల డెలివరీలను పూర్తి చేసిన సంస్థ.. తరువాత ఏడాదికంటే ఎక్కువ సమయంలో మరో 10వేల కార్లను విక్రయించింది. నవంబర్ 20న ఢిల్లీలోని పీపీఎస్ బీవైడీ షోరూమ్‌లో 20,000వ కారును కస్టమర్‌కు అందజేసి ఈ విజయాన్ని ప్రకటించింది.

ఇండియన్ మార్కెట్లోని బీవైడీ కార్లు
ఇండియన్ మార్కెట్లో.. ప్రస్తుతం బీవైడీ కంపెనీ అట్టో 3, సీలియన్ 7, సీల్, ఈమ్యాక్స్ 7 మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో అట్టో 3 దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ మోడల్ ఇప్పటివరకు 9,000కు పైగా డెలివరీలను సాధించింది. ఇక ఫిబ్రవరి 2025లో మార్కెట్లోకి వచ్చిన సీలియన్ 7 కూడా 5,000కు పైగా డెలివరీలను పూర్తి చేసింది. ఈ రెండు మోడళ్లే కలిపి 14,000కు పైగా కార్లను కస్టమర్లకు అందించాయి.

లగ్జరీ కారు
మరోవైపు.. బీవైడీ తన లగ్జరీ కార్ల వ్యాపారాన్ని కూడా విస్తరిస్తోంది. ఇటీవల డెంజా పేరుతో అల్ట్రా లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్‌ను భారతదేశంలో పరిచయం చేసింది. ఇందులో.. ఏడు సీట్ల లగ్జరీ ఎంపీవీ అయిన డెంజా డీ9 ధర రూ.90 లక్షలుగా ఉండగా, డెంజా జెడ్9 జీటీ ప్రారంభ ధర రూ.1.56 కోట్లుగా ఉంది. ఈ రెండు కార్లతో ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనూ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది.

పెరుగుతున్న షోరూమ్‌లు
ప్రస్తుతం బీవైడీకి దేశవ్యాప్తంగా 40 నగరాల్లో 51 షోరూమ్‌లు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్లపై పెరుగుతున్న ఆసక్తి బీవైడీకి కలిసొస్తోంది. రాబోయే రోజుల్లో టాటా, మహీంద్రా వంటి సంస్థలకు కూడా బీవైడీ పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: టీవీఎస్ బైక్ లవర్స్‌కు షాక్.. స్టార్ సిటీ ప్లస్ కనుమరుగు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement