వీడియో గేమింగ్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో (GTA) సిరీస్ మరోసారి తన సత్తా చాటింది. రాక్‌స్టార్ గేమ్స్ రూపొందించిన తాజా గేమ్ GTA 6 విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.79 బిలియన్ డాలర్ల (రూ.35,126 కోట్లకు పైగా) రిటైల్ అమ్మకాలను సాధించింది. ఈ విషయాన్ని మాతృసంస్థ టేక్-టూ ఇంటరాక్టివ్ అధికారికంగా వెల్లడించింది. నవంబర్ 19న గేమ్ విడుదలైన రోజు ముగిసే సమయానికి నమోదైన అమ్మకాల ఆధారంగా ఈ అంచనాను రూపొందించినట్లు తెలిపింది. దీంతో అన్ని వినోద మాధ్యమాల్లోనే అతిపెద్ద ప్రారంభంగా GTA 6 నిలిచిందని కంపెనీ ప్రకటించింది.
సినిమాల రికార్డులనూ అధిగమించిన గేమ్
GTA 6 తొలి రోజు అమ్మకాలు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాల వసూళ్లను సైతం మించిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.9 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్'తో పోలిస్తే GTA 6 ఒక్కరోజు అమ్మకాలే ఎక్కువగా ఉండటం విశేషం. అయితే గేమ్ రిటైల్ అమ్మకాలను, సినిమా మొత్తం థియేటర్ల వసూళ్లతో నేరుగా పోల్చలేమని గుర్తుంచుకోవాలి. మరోవైపు, విడుదలకు ముందే GTA 6 ఏకంగా 3.25 కోట్ల కాపీలు అమ్ముడైందని టేక్-టూ వెల్లడించింది. ఈ సంఖ్య కూడా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త రికార్డుగా నిలిచింది.
13 ఏళ్ల తర్వాత కొత్త గేమ్
GTA ఫ్రాంచైజీలో 13 ఏళ్లకు పైగా విరామం తర్వాత విడుదలైన ప్రధాన గేమ్ ఇదే. గతంలో 2013లో విడుదలైన GTA 5 తొలి మూడు రోజుల్లోనే బిలియన్ డాలర్ల రిటైల్ అమ్మకాలను సాధించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 23 కోట్లకు పైగా కాపీలు అమ్ముడై అత్యంత విజయవంతమైన వీడియో గేమ్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో GTA 6 ప్రారంభం గేమింగ్ పరిశ్రమలో కొత్త అంచనాలను నెలకొల్పుతోంది.
వైస్ సిటీ నేపథ్యంలో కథ..
GTA 6 కథ ఫ్లోరిడా రాష్ట్రం నుంచి స్ఫూర్తి పొందిన కల్పిత లియోనిడా ప్రాంతంలో సాగుతుంది. ఇందులో గతంలోనూ GTA సిరీస్‌లో కనిపించిన వైస్ సిటీ ప్రధాన నేపథ్యంగా ఉంటుంది. జేసన్ డువాల్, లూసియా కామినోస్ అనే ఇద్దరు ప్రధాన పాత్రల చుట్టూ కథ నడుస్తుంది. ప్రస్తుతం ఈ గేమ్ ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ X|S ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: బజాజ్ కొత్త పల్సర్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే?


