హైదరాబాద్‌లో రూ.1,450 కోట్ల భారీ ఆఫీస్ లీజు.. | Bank of America entity leases office space in Hyderabad at 1450 crore | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో రూ.1,450 కోట్ల భారీ ఆఫీస్ లీజు..

Nov 21 2026 3:28 PM | Updated on Nov 21 2026 4:00 PM

Bank of America entity leases office space in Hyderabad at 1450 crore

అంతర్జాతీయ సంస్థలకు గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్ల (జీసీసీ) కేంద్రంగా హైదరాబాద్‌ మారుతున్న నేపథ్యంలో మరో భారీ ఆఫీస్ లీజు ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా తన భారతీయ అనుబంధ సంస్థ బీఏ కంటిన్యూమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హైదరాబాద్‌లో 10.10 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ సైబరాబాద్‌లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. 12 ఏళ్ల లీజు కాలానికి అద్దె వ్యయం సుమారు రూ.1,450 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

రియల్ ఎస్టేట్ డేటా సంస్థ ప్రాపర్‌స్టాక్‌ సేకరించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. మైండ్‌స్పేస్ సైబరాబాద్‌లోని బిల్డింగ్ నంబర్‌ 1లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో 11 అంతస్తులను బీఏ కంటిన్యూమ్ లీజుకు తీసుకుంది. ఈ స్థలం యజమాని కే రహేజా ఐటీ పార్క్ (హైదరాబాద్) ప్రైవేట్ లిమిటెడ్. మొత్తం 10,10,467 చదరపు అడుగుల ఛార్జ్ చేయదగిన విస్తీర్ణానికి చదరపు అడుగుకు నెలకు రూ.82 చొప్పున అద్దె చెల్లించనుంది. దీంతో ప్రారంభ నెలవారీ అద్దె సుమారు రూ.8.28 కోట్లకు చేరుతుంది. 2026 సెప్టెంబర్ 7న లీజు ఒప్పందం ప్రారంభం కాగా, 2027 జనవరి నుంచి అద్దె చెల్లింపులు మొదలుకానున్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా రూ.49.72 కోట్ల సేఫ్టీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి మూడేళ్లకు అద్దెను 15 శాతం పెంచే నిబంధన కూడా ఉంది. ఈ పెంపులతో కలిపి 12 ఏళ్లలో మొత్తం అద్దె భారం రూ.1,450 కోట్లకు చేరుతుందని అంచనా.

కమర్షియల్‌ రియల్ ఎస్టేట్‌లో భారీ డీల్స్‌

హైదరాబాద్‌ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో భారీ కార్యాలయ లీజుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల అమెరికాకు చెందిన హెచ్‌సీఏ హెల్త్‌కేర్ అనుబంధ సంస్థ హెచ్‌సీఏ గ్లోబల్ సర్వీసెస్ కూడా మైండ్‌స్పేస్ ఐటీ పార్క్‌లో 6.44 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని 10 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.945 కోట్లుగా అంచనా. బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా ఒప్పందం కూడా నగరంలో అంతర్జాతీయ సంస్థల విస్తరణకు, ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలోని జీసీసీలకు హైదరాబాద్‌ ప్రాధాన్యం పెరుగుతోందని సూచిస్తోంది.

ఇదీ చదవండి: బెంగళూరులో ఖరీదైన స్థలాలు కొనేసిన మీషో సీఈవో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement