breaking news
Realty Deal
-
ఒక్క ఫ్లాట్ రూ .121 కోట్లు.. రికార్డ్ ‘రియల్’ డీల్!
భారత లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో కళ్లు చెదిరే ఖరీదైన డీల్ నమోదైంది. ప్రముఖ ఇన్వెస్టర్ మధుసూదన్ మురళీధర్ కేలా.. డీఎల్ఎఫ్ అత్యంత విలాసవంతమైన నివాస ప్రాజెక్ట్ ‘ది దహ్లియాస్’లో ఒక అపార్ట్‌మెంట్‌ను రూ.120.71 కోట్లకు కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ డేటా సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ పరిశీలించిన రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ ఒప్పందం ఏప్రిల్ 15, 2026న నమోదైంది. అపార్ట్మెంట్ విస్తీర్ణం 6,233 చదరపు అడుగులు కాగా, ఐదు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.హర్యానాలోని గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్లో ఉన్న సెక్టార్–54 ప్రాంతం దేశంలోనే అత్యంత ప్రీమియం నివాస కేంద్రాల్లో ఒకటిగా ఎదుగుతోంది. డీఎల్ఎఫ్ సిటీ ఫేజ్–5లో అభివృద్ధి చేస్తున్న ‘ది దహ్లియాస్’ ప్రాజెక్ట్ ఇప్పటికే దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, అధిక సంపన్నుల దృష్టిని ఆకర్షిస్తోంది. చదరపు అడుగుకు దాదాపు రూ.1.9 లక్షలకుపైగా విలువతో జరిగిన ఈ డీల్ గురుగ్రామ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త రికార్డుగా నిలిచింది.స్టాక్ మార్కెట్లో కింగ్.. కేలాస్టాక్ మార్కెట్లో ప్రముఖ ఇన్వెస్టర్‌గా పేరుగాంచిన కేలా (Madhusudan Kela) , ప్రస్తుతం పలు లిస్టెడ్ కంపెనీల్లో గణనీయమైన వాటాలు కలిగి ఉన్నారు. తాజా షేర్‌హోల్డింగ్ వివరాల ప్రకారం, ఆయన పెట్టుబడుల మార్కెట్ విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు ఆయన లగ్జరీ రియల్ ఎస్టేట్‌లో చేసిన భారీ పెట్టుబడి, సంపన్న వర్గాలు నివాస ఆస్తులను కేవలం విలాసానికి మాత్రమే కాకుండా దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనంగా కూడా చూస్తున్నాయనే ధోరణిని మరోసారి స్పష్టం చేసింది.డీఎల్ఎఫ్ 2024 అక్టోబర్‌లో ప్రారంభించిన 17 ఎకరాల ‘ది దహ్లియాస్’ ప్రాజెక్ట్‌లో మొత్తం 420 అపార్ట్మెంట్లు, పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. కంపెనీ తాజా వివరాల ప్రకారం, ఇప్పటివరకు ప్రాజెక్ట్‌లో దాదాపు 60 శాతం యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి 2026 నాటికి ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.18,500 కోట్లకుపైగా అమ్మకాలు నమోదయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్ ఆదాయ సామర్థ్యం రూ.40,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.విస్తరిస్తున్న అల్ట్రా-లగ్జరీ హౌసింగ్భారత్లో అల్ట్రా-లగ్జరీ హౌసింగ్ విభాగం గత రెండేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గురుగ్రామ్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రూ.10 కోట్లకు పైబడిన గృహాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. పరిమిత సరఫరా, ప్రీమియం లొకేషన్లు, అధిక సంపన్నుల పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇటువంటి ప్రాజెక్ట్‌ల ధరలు వేగంగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మధుసూదన్ కేలా తాజా కొనుగోలు కూడా అదే ధోరణికి నిదర్శనంగా నిలిచింది. -
భారీ ‘రియల్టీ’ డీల్.. రూ. 707 కోట్లు
సింగపూర్‌కు చెందిన క్యాపిటాల్యాండ్ ఇండియా ట్రస్ట్ (గతంలో అసెండాస్ ఇండియా ట్రస్ట్) రియల్టీ డెవలపర్ ఆరమ్ వెంచర్స్‌కు చెందిన ముంబైలోని 22 అంతస్తుల ఆఫీస్ టవర్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. నవీ ముంబైలోని ఘన్సోలిలో 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని రూ.707 కోట్లకు కొన్నట్లు తెలిసింది.భారత్‌తో గ్లోబల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ద్వారా ఒక వాణిజ్య టవర్‌ను కొనుగోలు చేసిన అతిపెద్ద ఒప్పందాలలో ఇది ఒకటి. ఆరమ్ క్యూ పార్క్‌లోని బహుళ-అద్దె టవర్ 'బిల్డింగ్ క్యూ2'ని క్యాపిటాల్యాండ్ ఇండియా కొనుగోలు చేసింది. ఇందులో అన్ని ఆఫీసులు భర్తీగా ఉన్నాయి. ఒప్పందంలో భాగంగా కొనుగోలు చేసిన తేదీ నుంచి 12 నెలలలోపు ఆరమ్‌కు ఇంక్రిమెంటల్ లీజింగ్ చెల్లించనున్నారు.దీనికి సంబంధించి ఆరమ్ వెంచర్స్, అసెండాస్ ఇండియా ట్రస్ట్ మధ్య 2018 మేలోనే కొనుగోలు ఒప్పందం కుదిరింది. బిల్డింగ్ క్యూ2లో దాదాపు రూ. 707 కోట్ల స్థూల పరిశీలనతో జారీ చేసిన మొత్తం షేర్ క్యాపిటల్‌ను పొందేందుకు రెండు సంస్థల మధ్య ఖచ్చితమైన ఒప్పందాలు ఇప్పుడు అమలయ్యాయి. ఈ భవనంలో పలు మల్టీ నేషనల్ కంపెనీలు, ప్రముఖ బ్యాంకులు, ఇతర సంస్థలు తమ కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి.అంతకుముందు, 2021 నవంబర్‌లో అసెండాస్ ఇదే వాణిజ్య క్యాంపస్‌లో 6.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మొదటి కార్యాలయ భవనమైన Q1ని రూ.353 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ రెండు లావాదేవీలతో ఫార్వార్డ్ పర్చేజ్ ఒప్పందం ప్రకారం ఆరమ్కి సంచిత మానిటైజేషన్ రూ.1,070 కోట్లు దాటింది. -
ఫ్లిప్‌కార్ట్ భారీ రియల్టీ డీల్
30 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్న ఈ కామర్స్ దిగ్గజం ఏటా రూ. 300 కోట్ల కిరాయి న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. తాజాగా భారీ రియల్టీ డీల్‌కు తెరతీసింది. తమ కార్యకలాపాల కోసం బెంగళూరులో 30 లక్షల చ.అ. ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీనికి ఏటా రూ. 300 కోట్ల అద్దె చెల్లించనుంది. ఇందుకు సంబంధించి బెంగళూరుకి చెందిన రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆసక్తి వ్యక్తీకరణ పత్రంపై సంతకాలు చేసింది. 90 రోజుల్లోగా తుది ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని ఈ డీల్ విషయంలో తోడ్పాటు అందించిన ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా కంట్రీ హెడ్ అనుజ్ పురి తెలిపారు. దేశీయంగా రియల్ ఎస్టేట్ ఆఫీస్ మార్కెట్ రికవరీ బాట పడుతోందనడానికి ఈ డీల్ నిదర్శనమని ఆయన వివరించారు. ఈ ఒప్పందం ఒక కొలిక్కి రావడానికి దాదాపు ఏడాది పైగా పట్టిందని పురి చెప్పారు. మొత్తం 10 మంది డెవలపర్లను షార్ట్‌లిస్ట్ చేసి, చివరికి ఎంబసీ గ్రూప్‌ను ఎంపిక చేసినట్లు వివరించారు. అయితే, దీనిపై స్పందించడానికి ఫ్లిప్‌కార్ట్ నిరాకరించింది. స్నాప్‌డీల్, అమెజాన్ తదితర షాపింగ్ సైట్లతో పోటీపడేందుకు ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలు భారీగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాగంగా ఈ ఏడాది 12,000 మంది ఉద్యోగులను కూడా తీసుకోనుంది. చ.అ.కు నెలకు రూ. 90 అద్దె.. 30 లక్షల చ. అ. ఆఫీస్ స్థలాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు దశలవారీగా లీజుకు అందచేస్తామని ఎంబసీ గ్రూప్ సీఎండీ జితు విర్వానీ తెలిపారు. ఫుల్లీ ఫర్నిష్డ్ ఆఫీస్ స్పేస్‌కి అద్దె నెలకు చ.అ.కు రూ. 90గా ఉంటుందని విర్వానీ పేర్కొన్నారు. 24 నెలల్లో ప్రాథమికంగా 15 లక్షల చ.అ. స్థలాన్ని అందచేస్తామన్నారు. ఆ తర్వాత 3-5 ఏళ్లలో 32.5 లక్షల చ.అ.కు పెంచే అవకాశం ఉందని తెలిపారు. బెంగళూరులోని అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ‘ఎంబసీ ఆఫీస్ పార్క్’ పేరిట ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌తో కలిసి ఎంబసీ గ్రూప్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో ఈ ఆఫీస్ స్పేస్ ఉంటుంది.


