టీవీఎస్ బైక్ లవర్స్‌కు షాక్.. స్టార్ సిటీ ప్లస్ కనుమరుగు! | TVS Star City Plus Delisted From Website In India | Sakshi
Sakshi News home page

టీవీఎస్ బైక్ లవర్స్‌కు షాక్.. స్టార్ సిటీ ప్లస్ కనుమరుగు!

Nov 21 2026 2:29 PM | Updated on Nov 21 2026 3:01 PM

TVS Star City Plus Delisted From Website In India

టీవీఎస్ మోటార్ కంపెనీ తన అధికారిక భారతీయ వెబ్‌సైట్ నుంచి స్టార్ సిటీ ప్లస్ (Star City Plus) బైక్‌ను తొలగించింది. దీంతో ఈ 110 సీసీ కమ్యూటర్ బైక్‌ను సంస్థ నిలిపివేసే అవకాశం ఉందా? అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. బైక్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు టీవీఎస్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

ప్రస్తుతం టీవీఎస్ మోటార్ వెబ్‌సైట్‌లో రేడియన్, స్పోర్ట్ మోడళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో స్టార్ సిటీ ప్లస్ టీవీఎస్ కమ్యూటర్ బైక్ లైనప్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం.. ఈ బైక్ గత కొన్నేళ్లుగా ఎలాంటి అప్డేట్స్ పొందకపోవడమనే తెలుస్తోంది.

2021 మార్చిలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను పరిచయం చేసిన తర్వాత, ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌లో చేసిన మార్పులు మినహా స్టార్ సిటీ ప్లస్ బైకులో ఎలాంటి ముఖ్యమైన అప్‌డేట్లు రాలేదు. మరోవైపు.. ఈ బైక్ అమ్మకాలు కూడా బాగా తగ్గిపోయాయి. 2026 మొదటి నాలుగు నెలల్లో కేవలం 49 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు నివేదికలు చెబుతున్నాయి. మే నుంచి సెప్టెంబర్ వరకు ఒక్క యూనిట్ కూడా అమ్ముడుకాలేదని సమాచారం.

ఇక స్టార్ సిటీ ప్లస్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8.2 హెచ్‌పీ పవర్, 8.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసేది. దీనికి నాలుగు స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఫీచర్ల పరంగా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, సెల్ఫ్ స్టార్ట్ వంటివి ఉన్నాయి.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌ను తొలిసారిగా 2014లో భారత మార్కెట్లో విడుదల చేసింది. దాదాపు 12 సంవత్సరాల పాటు మధ్యతరగతి వినియోగదారులకు సరసమైన కమ్యూటర్ బైక్‌గా సేవలందించింది. ముఖ్యంగా.. రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో కూడిన బైక్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలిచింది. అయితే.. కాలక్రమేణా అమ్మకాలు తగ్గడం, కొత్త అప్‌డేట్లు లేకపోవడం వంటి కారణాలతో ఈ మోడల్ ప్రాధాన్యత కోల్పోయింది. ప్రస్తుతం టీవీఎస్ రేడియన్, స్పోర్ట్ మోడళ్లపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే స్టార్ సిటీ ప్లస్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందా లేదా అనే విషయంపై కంపెనీ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.

ఇదీ చదవండి: డ్రైవర్ లేకుండా.. 868 సార్లు తిరిగిన కారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement