రైలు ప్రయాణానికి చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు ఎంతో కీలకం. అయితే బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే టికెట్లు అయిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడం వేగంగా ఉంటుందా? లేక కంప్యూటర్‌లో వెబ్‌సైట్ ద్వారా ప్రయత్నించడం మంచిదా? అనే సందేహం చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలో యాప్, వెబ్‌సైట్ మధ్య వేగం విషయంలో తేడాను అర్థం చేసుకోవాలంటే కేవలం ఇంటర్‌ఫేస్‌ను మాత్రమే కాకుండా రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ పనితీరును కూడా లోతుగా పరిశీలించాలి. ప్రయాణికుడు ఉపయోగించే పరికరం ఒకటైతే, టికెట్ కేటాయింపును నిర్వహించే వ్యవస్థ మరొకటన్న వాస్తవాన్ని గ్రహించాలి.
ఒకే తత్కాల్ కోటా.. రెండు బుకింగ్ మార్గాలు
రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో మొబైల్ యాప్, వెబ్‌సైట్ రెండూ ఒకే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్‌ఎస్) ద్వారా పనిచేస్తాయి. తత్కాల్ టికెట్ల కోసం యాప్‌కు ప్రత్యేక కోటా, వెబ్‌సైట్‌కు ప్రత్యేక కోటా అంటూ ఏమీ ఉండదు. రెండు మార్గాల్లోనూ ప్రయాణికులు అందుబాటులో ఉన్న అదే సీట్ల కోసం పోటీపడతారు. కాబట్టి యాప్ ద్వారా ప్రయత్నిస్తే టికెట్ తప్పనిసరిగా త్వరగా వస్తుందనే ప్రచారానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. మొబైల్ యాప్ కొన్నిసార్లు వేగంగా ఓపెన్ అవ్వొచ్చు, మరోవైపు వెబ్‌సైట్‌లో అదనపు స్క్రిప్టులు, పేజీ లోడింగ్ ప్రక్రియల కారణంగా కొంత సమయం పట్టవచ్చు. అయితే మొత్తం బుకింగ్ ప్రక్రియలో ఈ వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉంటుంది. ఇంటర్నెట్ వేగం, సర్వర్ స్పందన, ప్రయాణికుల వివరాలు నమోదు చేయడం, చెల్లింపు ప్రక్రియ పూర్తికావడం వంటి అంశాలే టికెట్ కన్ఫర్మేషన్‌ను ప్రధానంగా ప్రభావితం చేస్తాయి.
ఆధార్ ఓటీపీ.. కీలకమైన దశ
తత్కాల్ బుకింగ్‌లో ఆధార్ ధ్రువీకరణ మరో అత్యంత కీలకమైన అంశం. రైల్వే శాఖ ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ ఆధారిత ధ్రువీకరణ తప్పనిసరి. 2025 జులై 15 నుంచి ఆధార్ ఆధారిత ఓటీపీ వెరిఫికేషన్ పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. ఓటీపీ ఆలస్యంగా రావడం, మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు ఎదురవడం వల్ల బుకింగ్ ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉంది. యాప్ లేదా వెబ్‌సైట్ మార్చినంత మాత్రాన ఈ సాంకేతిక సమస్య పరిష్కారం కాదు.
కొత్త వెబ్‌సైట్‌తో మారిన పరిస్థితులు
ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఐఆర్‌సీటీసీ 2026 జులై 15న కొత్త వెబ్‌సైట్ బీటా వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అనవసరమైన క్యాప్చాలు, పాప్‌అప్‌లను తగ్గించడం, ఒకే స్క్రీన్‌పై వివిధ తరగతుల సీట్ల లభ్యతను స్పష్టంగా చూపించడం, బుకింగ్ దశలను కుదించడం, ప్రయాణికుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకునే సౌకర్యం కల్పించడం వంటి విప్లవాత్మక మార్పులు ఇందులో ఉన్నాయి.
ఈ కొత్త వెబ్‌సైట్ పనితీరుపై ఐఆర్‌సీటీసీ వెల్లడించిన గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బుకింగ్ ప్రారంభమైన తొలి మూడు నిమిషాల్లో పూర్తయిన తత్కాల్ బుకింగ్‌లలో ఐదు శాతానికి పైగా పెరుగుదల నమోదైంది. ఐదు నిమిషాల వ్యవధిలో పూర్తయిన బుకింగ్‌లలో మూడు శాతం, 30 నిమిషాల వ్యవధిలో పూర్తయిన బుకింగ్‌లలో రెండు శాతానికి పైగా పెరుగుదల నమోదైనట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ గణాంకాలు కొత్త వెబ్‌సైట్‌ను పాత వెబ్‌సైట్ పనితీరుతో పోల్చిన ఫలితాలు మాత్రమేనని, మొబైల్ యాప్‌తో పోలిస్తే వెబ్‌సైట్ వేగంగా పనిచేస్తుందని నిరూపించేవి కావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
టికెట్ త్వరగా పొందాలంటే ఏం చేయాలి?
తత్కాల్ టికెట్ సులభంగా పొందాలంటే ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బుకింగ్ సమయానికి కనీసం ఐదు నిమిషాల ముందే ఐఆర్‌సీటీసీ ఖాతాలో లాగిన్ కావాలి. ఆధార్ ధ్రువీకరణ కోసం ఓటీపీ అందుకునే మొబైల్ ఫోన్‌ను సిగ్నల్ బాగుండే చోట సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రయాణికుల పేర్లు, వయస్సు, ఇతర వివరాలను మాస్టర్ లిస్ట్‌లో ముందుగానే సేవ్ చేసుకోవడం ఉత్తమం. వేగవంతమైన, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించడంతో పాటు యూపీఐ లేదా వాలెట్ వంటి వేగవంతమైన చెల్లింపు మార్గాలను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.
ఇదీ చదవండి: 167 ఏళ్ల గణిత సమస్యకు ఏఐ పరిష్కారం?


