దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లుగా అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లు విశేష ఆదరణతో నడుస్తున్నాయి. ఇవి కేవలం సీటింగ్ రైళ్లు కాగా ఈ మధ్యనే వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రవేశపెట్టారు. అయితే మిగితా అన్ని రైళ్లకూ ఉన్న టికెట్ బుకింగ్ నిబంధనలు వందే భారత్ స్లీపర్ రైళ్లకు వర్తించవు. వీటికంటూ కొన్ని ప్రత్యేక బుకింగ్ నిబంధనలను రైల్వే శాఖ అమలు చేస్తోంది.
వందే భారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణించాలని భావిస్తున్నవారు టికెట్ బుకింగ్ నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలి. ఈ ప్రీమియం రైళ్లలో తత్కాల్ టికెట్లు, వెయిట్‌లిస్ట్, ఆర్‌ఏసీ సదుపాయాలు అందుబాటులో ఉండవు. అంతేకాదు, డిమాండ్‌ను బట్టి టికెట్ ధరలు పెరిగే ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని కూడా అమలు చేయడం లేదు. దీంతో ప్రయాణికులు సాధారణ ముందస్తు రిజర్వేషన్ విధానంలోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
రైల్వే బోర్డు గత జనవరిలో జారీ చేసిన వాణిజ్య సర్క్యులర్‌లో ఈ నిబంధనలను స్పష్టం చేసింది. ప్రయాణికులకు టికెట్ బుక్ చేసినప్పుడే బెర్త్ ఖరారు అవుతుంది. అందుబాటులో ఉన్న బెర్తులన్నీ అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రారంభమైనప్పటి నుంచే బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయి.
823 బెర్తులు.. మూడు తరగతులు
వందే భారత్ స్లీపర్ రైలు మొత్తం 16 ఏసీ కోచ్‌లతో నడుస్తుంది. ప్రయాణికుల కోసం మూడు తరగతుల్లో బెర్తులను అందుబాటులో ఉంచారు. వాటిలో ఏసీ 3 టైర్‌లో 611 బెర్తులు, ఏసీ 2 టైర్‌లో 188 బెర్తులు, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 24 బెర్తులు మొత్తం 823 బెర్తులు ఉంటాయి. మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, రైల్వే ఉద్యోగుల కోసం నిబంధనల ప్రకారం ప్రత్యేక కోటాలు కూడా ఉన్నాయి. ఏసీ 3 టైర్‌లో మహిళలకు ఆరు బెర్తులు, డ్యూటీ పాస్‌పై ప్రయాణించే రైల్వే సిబ్బందికి 21 బెర్తులు కేటాయిస్తారు.
టికెట్ ధరలు ఎలా ఉంటాయి?
వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉండదు. ప్రయాణ దూరం, ఎంచుకున్న తరగతిని బట్టి టికెట్ ధర నిర్ణయిస్తారు. రైల్వే బోర్డు ప్రకటించిన ధరల ప్రకారం కనీస ఛార్జీ విధించే దూరం 400 కిలోమీటర్లు. దీనికి వర్తించే జీఎస్‌టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్గాలివే!
నవంబర్ 9, 2026 నాటికి దేశంలో మూడు జతల వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
హౌరా – కామాఖ్య (గువాహటి): తొలి వందే భారత్ స్లీపర్ సర్వీస్ 2026 జనవరి 22న ప్రారంభమైంది.
వారణాసి – న్యూఢిల్లీ: అక్టోబర్ 31న ఈ మార్గంలో కొత్త స్లీపర్ రైలు ప్రారంభమైంది.
బెంగళూరు – ముంబై: నవంబర్ 1న ప్రారంభించగా, సాధారణ సర్వీసులు నవంబర్ 2, 3 తేదీల నుంచి అందుబాటులోకి వచ్చాయి.
ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో బెర్తుల లభ్యతను ముందుగానే పరిశీలించాలి.


