ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గ్లోబల్ టెక్ పరిశ్రమను ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి. ఒకవైపు దాదాపు 60,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ పథకం (వీఓఎస్-వాలంటరీ ఎక్జిట్ ఆఫర్) ప్రకటించడం, మరోవైపు సీఈఓ సత్య నాదెళ్ల కోట్లాది ‘ఏఐ ఏజెంట్ల’ వినియోగంపై గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో మరోసారి ప్రస్తుతం వైరల్ కావడం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మానవ వనరుల స్థానంలో ఏఐ ఏజెంట్లు భర్తీ కాబోతున్నాయా? అనే భయాలను ఈ పరిణామాలు బలపరుస్తున్నాయి.
60,000 మంది ఉద్యోగులకు వీఓఎస్ ప్రకటన
గత నెల 26న మైక్రోసాఫ్ట్ సంస్థ తమ కంపెనీలోని లెవెల్ 70, అంతకంటే తక్కువ కేటగిరీకి చెందిన భారత్, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ఆఫర్ చేసింది. కంపెనీ మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక మార్పులు చేసుకుంటోందని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్‌మన్ పేర్కొన్నప్పటికీ వీఓఎస్ ప్యాకేజీని దాదాపు 5 శాతం లోపు (సుమారు 3,000 మంది) మాత్రమే స్వీకరించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఏఐ వైపు మైక్రోసాఫ్ట్ వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో ఈ ప్రకటన రావడం విశేషం.
వైరల్‌గా సత్య నాదెళ్ల వీడియో
ఈ వీఓఎస్ వార్తల ప్రభావం తగ్గకముందే గత జూన్ 2026లో ‘పాజిబుల్’ పాడ్‌కాస్ట్‌లో లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్‌తో సత్య నాదెళ్ల జరిపిన సంభాషణ వీడియో మళ్లీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రత్యక్షమైంది. ఆ ఇంటర్వ్యూలో నాదెళ్ల మాట్లాడుతూ ‘మా వద్ద రెండు లక్షల మంది ఉద్యోగులు ఉంటే వారితో పాటు 20 లక్షల నుంచి 2 కోట్ల (20 మిలియన్) ఏఐ ఏజెంట్లు ఒకే లూప్‌లో పనిచేసే రోజులు రాబోతున్నాయి’ అని వివరించారు. సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో ఏఐ పాత్ర ఇప్పటికే గణనీయంగా పెరిగిందని, భవిష్యత్తులో ఏఐ కేవలం తోడ్పాటు అందించడమే కాకుండా స్వతంత్ర ఏజెంట్‌గా పనులు పూర్తి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

జాబ్ మార్కెట్‌లో రాబోయే మార్పులు
మైక్రోసాఫ్ట్ వ్యూహం ప్రస్తుతం టెక్ రంగానికి దిశా నిర్దేశం చేయనుంది. అయితే ఇది కొన్ని ప్రాథమిక ప్రశ్నలను తెరపైకి తెస్తోంది. సాధారణ కోడింగ్, డాక్యుమెంటేషన్, డేటా ప్రాసెసింగ్ చేసే ఉద్యోగాలపై ఏఐ ఏజెంట్ల ప్రభావం నేరుగా పడే అవకాశం ఉంది. కేవలం సాంకేతిక విజ్ఞానమే కాకుండా ఏఐ ఏజెంట్లను నడిపించడం (ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏఐ మేనేజ్‌మెంట్) మానవ ఉద్యోగులకు తప్పనిసరి కానుంది. ఒకవైపు సిబ్బందిని తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తూనే మరోవైపు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు, ఏఐ క్లౌడ్ మౌలిక సదుపాయాలపై రికార్డు స్థాయిలో నిధులు వెచ్చిస్తోంది.
ఇదీ చదవండి: ఎందుకో ఆ రైలు తొందరపడింది!


