ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం అమెజాన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ల విధివిధానాలను మారుస్తూ తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు వరల్డ్‌వైడ్ అమెజాన్ స్టోర్స్ వైస్ ప్రెసిడెంట్ టెర్క్ టెర్కోవిజ్ సంస్థలోని ఇంజినీర్లకు అంతర్గత మెమోను జారీ చేశారు. ఏఐ ప్రభావం సాఫ్ట్‌వేర్ రంగంపై ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో ప్రారంభమవుతోందని, రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ టెక్ రంగంలో ప్రధాన కేంద్ర బిందువుగా మారనుందని ఈ మెమో ద్వారా స్పష్టం చేశారు.
‘పునరుజ్జీవన డెవలపర్ల’ యుగం
సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ విభాగంలో క్లౌడ్ కంప్యూటింగ్, మైక్రో సర్వీసెస్, సర్వర్‌లెస్ టెక్నాలజీల కంటే కూడా ఏఐ అత్యంత వేగంగా, మౌలికంగా మార్పులు తెస్తోందని అమెజాన్ అగ్రశ్రేణి ఇంజినీరింగ్ నాయకత్వం అభిప్రాయపడింది. మానవ మేధస్సు, డొమైన్ నైపుణ్యాలను ఏఐ టెక్నాలజీతో జోడించి సరికొత్త సృష్టి చేయగల ‘పునరుజ్జీవన డెవలపర్లు’ (Renaissance Developers) యుగంలోకి అడుగుపెట్టామని పేర్కొంది. ఏఐని తమ దైనందిన విధుల్లో భాగం చేసుకోని వారు వెనుకబడిపోయే ప్రమాదం ఉందని ఇంజినీర్లను హెచ్చరించింది.
టోకెన్లు, కోడ్ లైన్లే ముఖ్యం కాదు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పనితీరును అంచనా వేసే విషయంలో కేవలం టోకెన్ల వినియోగం, కోడింగ్ లైన్ల సంఖ్య వంటి లోపభూయిష్టమైన ఇన్‌పుట్ మెట్రిక్స్ మీదే పూర్తిగా ఆధారపడకూడదని అమెజాన్ స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే సంస్థలో ఖర్చులు పెరగడంతో పాటు అనవసరమైన సంక్లిష్టత పెరుగుతుందని హెచ్చరించింది. దీర్ఘకాలికంగా కస్టమర్లపై, వ్యాపారంపై పడే ప్రభావమే అత్యంత కీలకమని, అంతిమ ఫలితాలకే పెద్దపీట వేయాలని స్పష్టం చేసింది.
అయితే, ఏఐని విస్తృతంగా వాడుతున్న జట్లు మరింత మెరుగైన ఉత్పాదకతను కనబరుస్తున్నాయని కంపెనీ గుర్తుచేసింది. ఒకవేళ నిర్దిష్టమైన పనులకు ఏఐ టెక్నాలజీ ఉపయోగపడకపోతే దాన్ని లోపంగా కాకుండా ఒక సరికొత్త ఫైండింగ్‌గా పరిగణించాలని సూచించింది. ఏయే సందర్భాల్లో ఏఐ పనిచేయట్లేదో గుర్తించి వాటిని తమ మేనేజర్లు, తోటి ఉద్యోగులతో పంచుకోవాలని కోరింది. ఇది ఇంజినీర్ల పరిణతికి నిదర్శనమని పేర్కొంది.
కస్టమర్ల అవసరాలపై దృష్టి
అమెజాన్ సంస్థ విస్తరిస్తున్న కొద్దీ కొందరు ఇంజినీర్లు కస్టమర్లు, వ్యాపార వాస్తవాల నుంచి కాస్త దూరమవుతున్నారని, ఈ ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నాయకత్వం సూచించింది. టెక్ లీడర్లు నేరుగా క్షేత్రస్థాయిలో ఏఐ టూల్స్‌ను ఉపయోగించి పరిశీలించాలని, కస్టమర్ల అవసరాలను లోతుగా అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి: 120 కి.మీ వేగంతో వెళ్లినా చలాన్లు ఉండవు! కానీ..


