రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి భావోద్వేగభరిత క్షణం ఎదురైంది. ఆయన నేతృత్వంలో విస్తరించిన జియో ప్లాట్‌ఫామ్స్ సంస్థ బుధవారం (అక్టోబర్ 28) తొలిసారిగా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. కుమారుడు అనంత్ అంబానీ ప్రసంగంలో రిలయన్స్, జియో ప్రయాణాన్ని, వాటి వెనుక ఉన్న వారసత్వాన్ని ప్రస్తావిస్తున్న సమయంలో ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి ఆయన సతీమణి నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కుమార్తె ఇషా హాజరయ్యారు.
21 శాతం ప్రీమియంతో మార్కెట్‌లోకి..
జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్లో ఘనంగా అరంగేట్రం చేశాయి. ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.1,119 కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)ల్లో రూ.1,358 వద్ద లిస్టయ్యాయి. దీంతో ఇష్యూ ధరతో పోలిస్తే 21.36 శాతం ప్రీమియం లభించింది. ఈ లిస్టింగ్‌తో కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.12.5 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలిచింది. ఈ క్రమంలో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లను అధిగమించింది.
దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా జియో
జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు రూ.30,213 కోట్లు సమీకరించింది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది నిలిచింది. అక్టోబర్ 21న ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూ 23న ముగిసే సమయానికి మొత్తం 22.19 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. దేశీయ, అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఈ లిస్టింగ్‌తో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి మరో కీలక సంస్థ స్టాక్ మార్కెట్లోకి వచ్చింది.
Mukesh Ambani gets teary-eyed as Anant speaks about Reliance's Jio journey. https://t.co/I9eWTs70my
— AK (@ashking1008) October 28, 2026


