విజయనగరం: మంగళ వాయిద్యాలు.. భక్తుల భజనలు... జై పైడిమాంబ.. జై జై పైడిమాంబ జయజయ ధ్వానాల నడుమ విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లి సిరిమాను సంబరం మంగళవారం ప్రశాంతంగా సాగింది.
సిరిమాను పూజారి రూపంలో దర్శనమిచ్చిన సిరులతల్లికి భక్తులు ప్రణమిల్లారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచి కురిసిన జోరువానలోనే సిరిమాను తిరువీధి సాగింది.
జిల్లా యంత్రాంగం ముందుస్తుగా నిర్ణయించిన సమయం ప్రకారం పూజారి బంటుపల్లి వెంకటరావు మధ్యాహ్నం 2.38 గంటలకు సిరిమానును అధిరోహించగా.. 2.55 గంటలకు సిరిమాను రథం కదిలింది.
పాలధార ముందు కదలగా తెల్ల ఏనుగు, బెస్తవారి వల, అంజలి రథం సిరిమాను వెంట సాగాయి. అమ్మవారి చుదురుగుడి నుంచి ప్రారంభమైన సిరిమాను తిరువీధి డెంకేషావలీబాబా దర్గా మీదుగా కోటకు చేరుకుని కోట శక్తికి మూడుసార్లు అభివాదం చేసింది.


