విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, శరణుకోరిన భక్తుల కొంగుబంగారం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు విజయనగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.
నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతర మహోత్స వాల్లో అత్యంత ప్రధానమైన ‘తొలేళ్లు’, ‘సిరిమానోత్సవం’ ఘట్టాలకు వేళైంది.
లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనార్థం తరలివస్తారని అంచనా వేస్తుండడంతో అధికారులు, ఆలయ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు.
1700వ సంవత్సరం నాటి చారిత్రక విజయనగరం కోటతో పాటు గంటస్తంభం, మూడు లాంతర్ల కూడలి, ప్రధాన రహదారులన్నీ మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్నాయి.
నగరమంతా అమ్మ వారి నామస్మరణతో మారుమోగుతూ పండగ వాతావరణం సంతరించుకుంది.
ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ‘తొలేళ్ల’ (తొలి ఏరు) పండుగను అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు.
భక్తులు వారు మొక్కుకున్న విధంగా విచిత్ర వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
జిల్లాలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ అమ్మ వారికి విశేష పూజలు చేస్తారు.


