మార్కెట్‌కి రిస్క్‌లు ఇంకా తగ్గలేదు | Stock Market Risks Rise, Pharma And Healthcare Stocks Emerge As Attractive Investment Opportunities, Check More Details | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కి రిస్క్‌లు ఇంకా తగ్గలేదు

Oct 28 2026 10:12 AM | Updated on Oct 28 2026 10:37 AM

Stock Market Risks Pharma Healthcare Stocks Attractive

క్రూడాయిల్‌ రేట్లతో ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపరంగా ముప్పులు

ఆకర్షణీయంగా ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాలు

బరోడా బీఎన్‌పీ పారిబా ఎంఎఫ్‌ సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ జితేంద్ర శ్రీరామ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, అధిక చమురు ధరలు, కరెన్సీ హెచ్చుతగ్గులు, ఆదాయ వృద్ధిపై సందేహాలు తదితర అంశాలతో దేశీ ఈక్విటీ మార్కెట్లలో ఆందోళనకర పరిస్థితి నెలకొందని బరోడా బీఎన్‌పీ పారిబా మ్యుచువల్‌ ఫండ్‌ సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ జితేంద్ర శ్రీరామ్‌ తెలిపారు. ఇందులో కొన్ని అంశాలు ఇప్పటికే మార్కెట్‌ వేల్యుయేషన్లలో ప్రతిబింబించినప్పటికీ, ఇన్వెస్టర్లు పూర్తిగా పరిగణనలోకి తీసుకోని రిస్క్‌లు ఇంకా కొన్ని ఉన్నాయని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి తెలిపారు.

మార్కెట్‌ ఇంకా పూర్తిగా డిస్కౌంట్‌ చేసుకోని కీలక రిస్‌్కలలో పశ్చిమాసియా పరిణామాలు కూడా ఉన్నాయని వివరించారు. ముడి చమురు ధరలు దీర్ఘకాలం పాటు అధిక స్థాయిలో కొనసాగితే ఆ ప్రభావం ఇంధన వ్యయాలకే పరిమితం కాబోదని, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని శ్రీరామ్‌ తెలిపారు.  దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్థంలో కార్పొరేట్ల ఆదాయ వృద్ధి పరిమితంగానే ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయని చెప్పారు. నిశితంగా పరిశీలించాల్సిన అంశాల్లో అమెరికన్‌ బాండ్‌ ఈల్డ్‌లు కూడా ఒకానొకటని చెప్పారు. ఈ దశలో మార్కెట్‌ మొమెంటమ్‌ను అనుసరించడం కన్నా ఆదాయాలపై స్పష్టమైన అంచనాలతో, నిలకడగా రాణిస్తున్న కంపెనీలు, రంగాలపై దృష్టి పెట్టడం మంచిదని పేర్కొన్నారు.  

కొనుగోలు శక్తిపై ప్రభావం 
భారత్‌ ప్రధానంగా ఇంధనాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలు సుదీర్ఘ సమయం పాటు అధిక స్థాయిలో కొనసాగితే ద్రవ్యోల్బణం పెరుగుదల, కరెన్సీ విలువ క్షీణించి, కార్పొరేట్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడంతో పాటు కుటుంబాల కొనుగోలు శక్తిపై ప్రతికూల ప్రభావం పడొచ్చని శ్రీరామ్‌ చెప్పారు. భారత్‌ ఇంధన భద్రత సాధించే క్రమంలో పునరుత్పాదక వనరులకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ .. ఈ మార్పులన్నీ ఎకాయెకిన జరగబోవు కాబట్టి,  పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చేంత వరకు మధ్యకాలికంగా ఆర్థిక ఒత్తిళ్లు తప్పకపోవచ్చని పేర్కొన్నారు. జీఎస్‌టీ కోతల దన్నుతో గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఎల్రక్టానిక్స్, వైట్‌గూడ్స్‌ మొదలైన వాటి అమ్మకాలు భారీగా పెరిగి అధిక బేస్‌ ఏర్పడిందని చెప్పారు. ఫలితంగా ఈసారి కార్పొరేట్‌ ఆదాయాలు ఆ బేస్‌కి మించి వృద్ధి చెందే అవకాశాలు పరిమితంగానే కనిపిస్తున్నాయని శ్రీరామ్‌ తెలిపారు.  

దేశీ పెట్టుబడులతో ఊరట.. 
సాధారణంగా లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు అధికంగా ఉంటాయని, గత 18–20 నెలలుగా అవి తరలిపోతుండటంతో విస్తృత మార్కెట్లతో పోలిస్తే సదరు స్టాక్స్‌ వెనుకబడ్డాయని శ్రీరామ్‌ చెప్పారు. అయితే, దేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం ఈక్విటీ మార్కెట్లకు మద్దతుగా నిలుస్తుండటం ఊరటనిచ్చే అంశమని తెలిపారు. ఇక రూపాయి క్షీణత అనేది గ్లోబల్‌ ఇన్వెస్టర్లకు రాబడుల విషయంలో ప్రతికూలాంశమన్నారు. ఇటీవల ఆర్‌బీఐ చేపట్టిన ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) డిపాజిట్ల కార్యక్రమం విజయవంతం కావడమనేది రూపాయిపై నెలకొన్న ప్రతికూల సెంటిమెంటు కొంత వరకు తగ్గేందుకు దోహదపడగలదని శ్రీరామ్‌ వివరించారు.  

పెట్టుబడులకు అవకాశాలు... 
ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కేవలం మార్కెట్‌ మొమెంటమ్‌పై దృష్టి పెట్టడం కంటే.. ఆదాయ స్థిరత్వం, అంచనాలకు అందేలా వృద్ధి అవకాశాలు ఉండే రంగాలపై దృష్టి పెట్టొచ్చని శ్రీరామ్‌ చెప్పారు. ఆ విధంగా చూస్తే మిగతావాటితో పోల్చినప్పుడు మాంద్య ప్రభావం తక్కువగా ఉండే వాటిల్లో ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవలకు డిమాండ్‌ స్థిరంగా ఉంటుందన్నారు. కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్‌–మాన్యుఫాక్చరింగ్‌ సంస్థలు (సీడీఎంవో) బయోసిమిలర్స్, పెప్టైడ్స్‌ తదితర విభాగాల్లో దీర్ఘకాలికంగా పెట్టుబడుల అవకాశాలు కనిపిస్తున్నాయని శ్రీరామ్‌ చెప్పారు.

కాబట్టి ఫార్మాపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు తెలిపారు. అలాగే, హెల్త్‌కేర్, యుటిలిటీస్, టెలికం సరీ్వసులకు కూడా డిమాండ్‌ కొనసాగుతుంది కాబట్టి, అవి కూడా మెరుగ్గా రాణించవచ్చని వివరించారు. మరోవైపు, ఐటీ సరీ్వసుల విభాగం కొంత సంక్లిష్టంగా ఉన్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల కరెన్సీ బలహీనపడిపడితే దేశీ ఐటీ ఎగుమతి సంస్థలకు ప్రయోజనం చేకూరవచ్చు కానీ కృత్రిమ మేథ (ఏఐ)పరంగా ప్రతికూల ప్రభావం ఉండొచ్చని శ్రీరామ్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement