హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త బాస్‌గా అనుప్‌ బాగ్చీ  | Anup Bagchi takes charge as HDFC Bank MD and CEO | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త బాస్‌గా అనుప్‌ బాగ్చీ 

Oct 28 2026 4:50 AM | Updated on Oct 28 2026 4:50 AM

Anup Bagchi takes charge as HDFC Bank MD and CEO

బాధ్యతల స్వీకరణ 

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌ రంగ సంస్థ ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా అనుప్‌ బాగ్చీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ పదవిలో పనిచేసిన శశిధర్‌ జగదీశన్‌ పదవీ కాలం సోమవారంతో ముగిసింది. ఈ మేరకు బాగ్చీ నియామకంపై స్టాక్‌ ఎక్సే్చంజీలకు బ్యాంకు సమాచారం అందించింది. మూడు దశాబ్దాలకు పైబడిన బ్యాంక్‌ చరిత్రలోనే వెలుపలి వ్యక్తి ఎండీ, సీఈఓగా పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. 

ఐసీఐసీఐ గ్రూప్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న బాగ్చీ, అంతకుముందు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓగా సేవలందించారు. ప్రస్తుతం ప్రధాన ఆదాయ వృద్ధి మందగించడం, లాభాల మార్జిన్ల క్షీణత వంటి పలు సవాళ్లను బ్యాంక్‌ ఎదుర్కొంటున్న తరుణంలో బాగ్చీ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న  కైజాద్‌ భరూచా ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పదవీ విరమణ చేయనున్నట్లు ప్రకటించారు. 

జగదీశన్‌కు వీడ్కోలు 
కార్పొరేట్‌ గవర్నెన్స్‌ (పాలనా ప్రమాణాలు) లోపాలపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తన పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి జగదీశన్‌ నిరాకరించారు. అయితే, భారత్‌లోనే అతిపెద్ద కార్పొరేట్‌ విలీనాల్లో ఒకటైన ‘హెచ్‌డీఎఫ్‌సీ విలీనాన్ని’ విజయవంతంగా పూర్తి చేయడంలో, బ్యాంక్‌ పనితీరును మెరుగుపరచడంలో జగదీశన్‌ పాత్ర కీలకమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొనియాడింది. శశిధర్‌ జగదీశన్‌ అందించిన వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని, అంకితభావాన్ని ఈ సందర్భంగా యాజమాన్యం ప్రశంసించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement