పుణే ప్లాంట్‌లో ఉత్పత్తి షురూ
రూ.34 లక్షల వరకు తగ్గనున్న ధర
న్యూఢిల్లీ: లగ్జరీ వాహన తయారీ సంస్థ ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) ఇండియా’ తమ ప్రముఖ ఎస్‌యూవీ ‘డిఫెండర్ 110’ ఉత్పత్తిని మహారాష్ట్రలోని పుణే ప్లాంట్‌లో ప్రారంభించింది. దేశీయంగానే ఈ మోడల్‌ను అసెంబ్లింగ్ చేయడం ద్వారా టాప్–ఎండ్ వేరియంట్ ధర గరిష్టంగా రూ. 34 లక్షల వరకు తగ్గనుంది. ఈ స్థానిక తయారీ నిర్ణయంతో రానున్న కాలంలో విక్రయాలు 20 శాతం వరకు పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. యూరప్ బయట ‘డిఫెండర్’ ఎస్‌యూవీని స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న తొలి మార్కెట్‌గా భారత్ నిలిచింది.
అయితే, గ్లోబల్ వేరియంట్లయిన డిఫెండర్ 90, డిఫెండర్ 130, డిఫెండర్ ఆక్టా మోడళ్ల తయారీ మాత్రం స్లొవేకియాలోని నిత్రా ప్లాంట్‌లోనే కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. గడిచిన మూడున్నరేళ్లలో భారత మార్కెట్లో ఏకంగా 9,000 యూనిట్ల డిఫెండర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ‘ఫుణే ప్లాంట్‌లో ‘డిఫెండర్ 110’ తయారీ చేపట్టడం భారత మార్కెట్‌పై మాకున్న నమ్మకానికి నిదర్శనం. స్థానిక ఉత్పత్తి ద్వారా దేశీయ కస్టమర్ల డిమాండ్‌కు మరింత వేగంగా స్పందించే అవకాశం లభిస్తుంది’ అని జేఎల్‌ఆర్ ఇండియా ఎండీ రాజన్ అంబ తెలిపారు. కాగా, భారత్‌లో లభించే డిఫెండర్ 110 ఎస్‌యూవీ 2.0 లీటర్, 3.0 లీటర్ పెట్రోల్‌తో పాటు 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.


