సాధారణంగా పండుగ సీజన్ వచ్చిందంటే కంపెనీలు ఉద్యోగులకు బాక్సులు, స్వీట్లు, బోనస్‌లు లేదా చిన్నపాటి గిఫ్ట్ వోచర్లు ఇవ్వడం ఆనవాయితీ. కానీ, ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ మాత్రం తన ఉద్యోగుల కష్టానికి, అంకితభావానికి నిలువెత్తు రూపంగా ఏకంగా సరికొత్త ఎస్‌యూవీ కార్లను కానుకగా ప్రకటించి వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగుల పట్ల యాజమాన్యం చూపిన ఈ వినూత్న ఉదారత కార్పొరేట్ రంగంలో సరికొత్త చర్చకు దారితీసింది.
చండీగఢ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ ‘మిట్స్ గ్రూప్’ ఫార్మా సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ఎం.కె భాటియా తన సంస్థలో కష్టపడి పనిచేస్తున్న అత్యుత్తమ ప్రతిభావంతులైన ఉద్యోగులకు దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ కానుకలను అందజేశారు. కంపెనీ పురోగతికి శ్రమించడమే కాక, సంస్థపై విశ్వాసంతో దీర్ఘకాలంగా సేవలనందిస్తున్న సిబ్బందిని సత్కరించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
జీవిత పాఠాలు, కష్టాల నుంచి శిఖరాలకు..
ఈ అసాధారణ బహుమతుల వెనుక ఓ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం దాగి ఉంది. మిట్స్ గ్రూప్ అధినేత ఎం.కె భాటియా తన కెరీర్ ప్రారంభంలో వ్యాపారపరంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఒక దశలో దివాళా అంచు వరకు వెళ్లారు. అయితే పట్టుదల కోల్పోకుండా కష్టపడి పైకి వచ్చి నేడు హరియాణాలోని పంచకుల కేంద్రంగా బహుళ కంపెనీలను విజయవంతంగా నడుపుతున్నారు. అంతేకాక కెనడా, లండన్, దుబాయ్ తదితర అంతర్జాతీయ మార్కెట్లలోనూ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. తాను ఎదుర్కొన్న కష్టాల్లో తోడుగా ఉన్నవారికి, తనతో పాటు ప్రయాణిస్తున్న సిబ్బందికి అండగా నిలవాలన్నదే తన ప్రధాన ధ్యేయమని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
నెటిజన్ల ప్రశంసలు
కంపెనీ యాజమాన్యం ఉద్యోగులకు కార్ల తాళాలను అందజేస్తున్న దృశ్యాలు, షోరూమ్ నుంచి కార్లు బయటకు వస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫార్మా సీఈఓ ఉదారతను కొనియాడుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ఇలాంటి బాస్‌లు ఉండటం అదృష్టం’, ‘కష్టపడే వారికి తగిన గుర్తింపు అంటే ఇదే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. బంగారం ధరల దడ


