బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగే అవకాశముంది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు విలువైన లోహాల మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ వారం బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.1,700 తగ్గి రూ.1.45 లక్షల దిగువకు చేరింది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు రూ.2 లక్షల దిగువకు దిగివచ్చింది.
దీపావళి వేళ కొనుగోళ్లు పెరుగుతాయా?
దీపావళి, ధంతేరాస్ (ధన త్రయోదశి) పండుగలు సమీపిస్తున్న వేళ బంగారం, వెండి ధరలు తగ్గడం భారతీయ కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశం. ధంతేరాస్ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం శుభప్రదమని చాలామంది భావిస్తారు. దీంతో ధరలు తగ్గిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆభరణాలు, బంగారు నాణేలు, వెండి వస్తువుల కొనుగోళ్లు పెరిగే అవకాశముంది.
బంగారంలో పెట్టుబడికి ఏ మార్గాలు ఉన్నాయి?
బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలో గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. వీటి ధరలు బంగారం విలువకు అనుగుణంగా మారుతుంటాయి. అయితే, డీమ్యాట్ ఖాతా, బ్రోకరేజీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
భౌతిక బంగారం కొనుగోలు చేయాలనుకుంటే బంగారు కడ్డీలు, నాణేలు లేదా ఆభరణాలను ఎంచుకోవచ్చు. కడ్డీలు, నాణేల కొనుగోలుపై సాధారణంగా 3 శాతం జీఎస్టీ ఉంటుంది. ఆభరణాలపై కూడా వర్తించే జీఎస్టీతో పాటు తయారీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. తిరిగి విక్రయించే సమయంలో ఈ అదనపు ఖర్చులన్నీ తిరిగి రావని గుర్తుంచుకోవాలి.
ఇక సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్‌జీబీ) కొత్త విడతల జారీ ప్రస్తుతం నిలిచిపోయింది. అయినప్పటికీ, ఇప్పటికే జారీ చేసిన బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజీలో ఇతర పెట్టుబడిదారుల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే, అందుబాటులో ఉన్న బాండ్ల ధర, వాటి గడువు, వడ్డీ ప్రయోజనాలను పరిశీలించాలి.
గోల్డ్ ఈటీఎఫ్‌లలో కొత్త పెట్టుబడులకు బ్రేక్
పండుగల సీజన్‌లో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో పాటు, పెట్టుబడులకు సంబంధించిన కొన్ని పరిమితులపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించాల్సి ఉంది. దేశంలోని పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు అక్టోబర్ 16 నుంచి తమ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌ఓఎఫ్) పథకాల్లోకి కొత్త పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేశాయి.
అయితే, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నేరుగా కొనుగోలు చేసే గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఈ పరిమితి వర్తించదు. ఇప్పటికే ఈటీఎఫ్ ఎఫ్‌ఓఎఫ్‌లలో కొనసాగుతున్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)లకూ అంతరాయం ఉండదు. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు సంబంధిత పథకం తాజా నిబంధనలను పరిశీలించాలి.
ఇదీ చదవండి: బంగారంతో గిన్నిస్ రికార్డులు!


