తొలి ఉద్యోగంలోనే తొలగింపు.. ఆ తర్వాత ఎన్నో సవాళ్లు.. నచ్చిన టెక్నాలజీలోకి మారేందుకు పోరాటం.. మెరుగైన జీతం కోసం ఉద్యోగ మార్పులు.. ఇలా దాదాపు 9.5 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మలుపులు ఎదుర్కొన్న ఓ ఐటీ ఉద్యోగికి ఇప్పుడు యూఏఈలో ఏడాదికి సుమారు రూ.1.5 కోట్ల వేతనంతో పనిచేసే అవకాశం లభించింది. తన కెరీర్ ప్రయాణాన్ని ఆయన రెడ్డిట్‌లో పంచుకోగా, ప్రస్తుతం ఈ కథనం చర్చనీయాంశమైంది.
రూ.2.9 లక్షలతో మొదలై..
ఆ వ్యక్తి తన కెరీర్‌ను ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌లో మాన్యువల్ టెస్టింగ్ ఉద్యోగంతో ప్రారంభించారు. అంతర్గత పరీక్షల్లో అవసరమైన అర్హత సాధించలేక ఉద్యోగం కోల్పోయారు. అప్పటికి ఆయన వార్షిక వేతనం రూ.2.9 లక్షలు. అయితే, 15 రోజుల్లోనే స్నేహితుడి ప్రోత్సాహంతో మళ్లీ ప్రయత్నించి ఐబీఎంలో ఉద్యోగం సంపాదించారు.
అక్కడ జేడీ ఎడ్వర్డ్స్ సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తున్నప్పటికీ, ఆయనకు బిగ్ డేటా రంగంలో స్థిరపడాలనే ఆసక్తి ఉండేది. సొంతంగా కొత్త సాంకేతికతలను నేర్చుకుంటూ, ఆ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించారు. చివరకు ఓ ప్రొఫెషనల్ పరిచయం, మేనేజర్ సహకారంతో 2020 మేలో బిగ్ డేటా ప్రాజెక్టులోకి మారగలిగారు. అయినప్పటికీ, 2022 జనవరి నాటికి ఆయన వార్షిక వేతనం రూ.3.78 లక్షలకే పరిమితమైంది.
ఉద్యోగ మార్పులతో భారీగా పెరిగిన జీతం
వేతన పెరుగుదల ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇతర సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, నైన్‌లీప్స్ నుంచి రూ.7.5 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు వార్షిక ప్యాకేజీలతో ఆఫర్లు వచ్చాయని తెలిపారు. అనంతరం ఎయిర్‌బస్‌లో రూ.23 లక్షల వార్షిక వేతనంతో పాటు రూ.5 లక్షల జాయినింగ్ బోనస్‌తో చేరారు.
ఎయిర్‌బస్‌లో పాలంటిర్ ఫౌండ్రీ టెక్నాలజీతో పనిచేస్తూ, సుమారు 50 వేల మంది వినియోగించే ప్లాట్‌ఫామ్ నిర్వహణలో భాగమయ్యారు. సంస్థకు భారీ స్థాయిలో ఖర్చు తగ్గించిన ప్రాజెక్టుల్లోనూ పాలుపంచుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, పనితీరు సమీక్షలో 5కి 2 రేటింగ్ రావడంతో మరోసారి ఉద్యోగ మార్పునకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో 15 ఆఫర్లు రాగా, థాట్‌వర్క్స్‌లో రూ.48 లక్షల వార్షిక ప్యాకేజీని ఎంచుకున్నారు.
అక్కడ చేరిన రెండు నెలలకే మరో సంస్థ నుంచి రూ.62 లక్షల వార్షిక వేతనంతో పాటు రూ.5 లక్షల జాయినింగ్ బోనస్ ఆఫర్ వచ్చింది. ఇంటి నుంచే పనిచేసే సౌలభ్యం ఉండటంతో ఆ అవకాశాన్ని అంగీకరించినట్లు రెడ్డిట్ పోస్టులో వెల్లడించారు.
యూఏఈలో రూ.1.5 కోట్ల ప్యాకేజీ
తాజాగా యూఏఈలోని ఓ కన్సల్టింగ్ సంస్థ నుంచి ఏడాదికి సుమారు రూ.1.5 కోట్ల పరిహారంతో పనిచేసే అవకాశం వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం వెనుక అధిక వేతనం ఒక్కటే కారణం కాదని, అంతర్జాతీయ అనుభవం సంపాదించడం, కొత్త మార్కెట్‌లో పనిచేయడం, పెద్ద సవాళ్లను ఎదుర్కోవడం, వృత్తిపరంగా ఎదగడం కూడా ముఖ్యమని వివరించారు.
తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, కష్టపడి పనిచేయడంతోపాటు సరైన సమయంలో వచ్చిన అవకాశాలు, పరిచయాలు, పట్టుదల తన ఎదుగుదలకు తోడ్పడ్డాయని పేర్కొన్నారు. కెరీర్‌లో ఎదురయ్యే వైఫల్యాలే భవిష్యత్తును నిర్ణయించవని, నేర్చుకుంటూ కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం ముఖ్యమని ఆయన అనుభవం సూచిస్తోంది.


