ఉన్నత విద్య, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం, భారీ వేతనాలతో కూడిన కార్పొరేట్ ఉద్యోగాలు.. ఇవే విజయానికి ఏకైక మార్గాలనే సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా ఓ 22 ఏళ్ల యువకుడి ప్రయాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నెలకు కేవలం రూ.20 వేల సగటు ఆదాయంతో కెరీర్‌ను ప్రారంభించి గత ఏడాది కాలంలో రూ.1.4 కోట్లకు పైగా సంపాదించినట్లు అతడు వెల్లడించాడు. ఈ వివరాలు సామాజిక మాధ్యమ వేదిక రెడ్డిట్‌లోని ‘SideHustleIndia’ కమ్యూనిటీలో పంచుకున్న పోస్టు ద్వారా వెలుగులోకి వచ్చాయి.
ఇంటర్మీడియట్ తర్వాతే ఉద్యోగం..
సదరు యువకుడు 12వ తరగతి (ఇంటర్) పూర్తయిన వెంటనే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినట్లు తన పోస్టులో పేర్కొన్నాడు. అదే సమయంలో ఒక టైర్-3 కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) చదువును కొనసాగించాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు డైరెక్ట్ రెస్పాన్స్ కాపీరైటింగ్‌పై పట్టు సాధించేందుకు పుస్తకాలు, ఆన్‌లైన్ కోర్సులను ఆశ్రయించాడు.
ప్రారంభంలో పెద్దగా ఆదాయం లేకపోయినా క్రమంగా తన నైపుణ్యాలను పెంచుకున్నట్లు తెలిపాడు. కేవలం ప్రకటనలు రాయడానికే పరిమితం కాకుండా ప్రొడక్ట్ రీసెర్చ్, మార్కెటింగ్ ఫన్నెల్స్, ఫన్నెల్ ఎకనామిక్స్, రిక్రూట్‌మెంట్ వంటి కీలక విభాగాల్లో అనుభవం సంపాదించాడు. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లోని క్లయింట్లతో వృత్తిపరమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి లింక్డ్‌ఇన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకున్నట్లు వివరించాడు.
అమెరికా కంపెనీతో అంతర్జాతీయ అవకాశం
ప్రస్తుతం అమెరికాకు చెందిన ఓ సప్లిమెంట్ బ్రాండ్‌లో పనిచేస్తున్నట్లు ఆ యువకుడు వెల్లడించాడు. ఆ సంస్థ మార్కెటింగ్ వ్యూహాలు, ప్రకటనల రూపకల్పన, కస్టమర్లను ఆకర్షించే విధానాల అభివృద్ధిలో తన పాత్ర కీలకమని పేర్కొన్నాడు. తన సహకారంతో ఆ బ్రాండ్ నెలవారీ ఆదాయం 35 లక్షల డాలర్ల స్థాయికి చేరినట్లు చెప్పుకొచ్చాడు. పనితీరు ఆధారంగా తన వేతనంలో 250 శాతం పెరుగుదలతోపాటు బోనస్ విధానంలో మార్పులు చోటుచేసుకున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తాను ఏడాదికి రూ.1.4 కోట్లు సంపాదిస్తున్నట్లు చెప్పాడు.
ఈ ఉదంతాన్ని కేవలం ఒక వ్యక్తి ఆదాయ విజయగాథగా మాత్రమే చూడకూడదు. మారుతున్న అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌లో నైపుణ్యాల ప్రాధాన్యాన్ని గమనించాలి. కంపెనీ ఆదాయ వృద్ధికి నేరుగా దోహదపడే నైపుణ్యాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా ఏఐ ఆధారిత ఆటోమేషన్ వంటి ఆధునిక రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆ యువకుడు సూచిస్తున్నాడు. అయితే ఒక్కసారిగా సంపన్నులు కావాలనే తొందరపాటు ఆలోచన కంటే సహనం, నిరంతర అభ్యాసం, ఆచరణాత్మక అనుభవం ఎంతో ముఖ్యమని చెప్పాడు.
ఇదీ చదవండి: ఎన్విడియా సీఈఓ వారసుల జీతం ఎంతంటే..


