డిజిటల్ యుగంలో ధరించగలిగే సాంకేతిక పరికరాలు (వేరబుల్స్) వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు, బ్యాండ్లు, స్మార్ట్‌రింగులు, తలకు ధరించే డిస్‌ప్లేలు, ఏఐ కళ్లద్దాలు, స్మార్ట్ ఇయర్ బడ్స్ వినియోగం ఇటీవల పెరిగింది. ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నారు, ఎలా కదులుతున్నారు, వారి శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వంటి వివరాలను ఇవి నమోదు చేస్తాయి.ఈ వేరబుల్స్ జాబితాలో తాజాగా చేరిన పరికరం ‘టెంపుల్’. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ స్థాపించిన ఓ స్టార్టప్ దీన్ని అభివృద్ధి చేసింది. నుదుటి పక్కభాగానికి ప్రత్యేకమైన అడెసివ్ పట్టీలతో దీన్ని అంటించుకోవచ్చు. మెదడులో రక్తప్రసరణలో చోటు చేసుకునే మార్పులను కొలవగలదని తొలుత ఈ పరికరం గురించి ప్రచారం చేశారు. అయితే, ప్రకటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీసింది.
‘టెంపుల్’తో సరికొత్త చర్చ
ఈ పరికరాల్లోని ఆప్టికల్ సెన్సర్లు మెదడులోని వాస్తవ రక్తప్రస రణను కొలవలేవని వైద్య నిపుణులు వాదిస్తున్నారు. అవి కేవలం కణత ప్రాంతంలోని ధమనుల (టెంపోరల్ ఆర్టరీ) ద్వారా చర్మానికి సమీపంలో జరిగే రక్తప్రసరణను మాత్రమే గుర్తించగలవనీ, మెదడు లోని రక్తప్రవాహాన్ని కొలవడం వాటి సామర్థ్యానికి మించిన విషయ మనీ అంటున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో దీపిందర్ గోయల్ టెంపుల్ కేవలం ఫిట్‌నెస్, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన పరికరమేననీ, ఇది ‘ఎంట్రోపీ’ అనే కొలమానాన్ని పర్యవేక్షిస్తుందనీ తెలిపారు. వ్యాధులను నిర్ధారించే పరికరంగానీ, వ్యాధుల నివార ణకు ఉపయోగపడే సాధనంగానీ కాదని స్పష్టం చేశారు.
ఈ వివాదం వైద్య, ఆరోగ్య పరిరక్షణ పరికరాల చుట్టూ కొన సాగుతున్న నియంత్రణపరమైన, నైతికపరమైన చర్చలకు ఒకమంచి ఉదాహరణ. పేస్‌మేకర్లు, గుండె పనితీరును పర్యవేక్షించే మానిటర్లు, నిరంతరం రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను కొలిచే పరిక రాలు వంటి వైద్య పరికరాలు చాలాకాలంగా అందుబాటులో ఉన్నాయి. వీటిపై ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లోనూ కఠినమైన నియంత్రణ వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. అయితే, ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్‌రింగుల వంటి కొత్త పరికరాలను ఆరోగ్య పరిరక్షణ సాధనాలుగా (వెల్‌నెస్ డివైజెస్) మార్కెట్ చేస్తున్నారు. ఇవి కీలకమైన ఆరోగ్య సూచికలను పర్యవేక్షించడమే కాకుండా, వ్యాధు లను ముందుగానే గుర్తించే లేదా నివారించే సాధనాలుగా కూడా ప్రచారంలో ఉంటున్నాయి.
ఆరోగ్య పరిరక్షణ పరికరానికీ, నియంత్రణ పరిధిలోకి వచ్చే వైద్య పరికరానికీ మధ్య విభజన రేఖ చాలా సన్నగా ఉంది. ఉదాహరణకు, వ్యాయామ సమయంలో గుండెస్పందనను నమోదు చేసే ఆప్టికల్ సెన్సర్ ఉన్న ఫిట్‌నెస్ బ్యాండ్‌ను ఆరోగ్య పరిరక్షణ సాధనంగా పరిగణించవచ్చు. కానీ, ఆ సెన్సర్ సేకరించిన సమాచారాన్ని ఒక అల్గారిథమ్ ద్వారా విశ్లేషించి, గుండె స్పందనలో అసాధారణమైన లయను గుర్తించి వినియోగదారుడిని అప్రమత్తం చేస్తే, అది వైద్య పరికరం పరిధిలోకి వస్తుంది. అలాంటి పరికరానికి నియంత్రణ సంస్థల అనుమతి అవసరం కావచ్చు.
వెల్‌నెస్ వరకేనా?
శారీరక సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా భద్రతాపరమైన ముప్పులు కలిగించే ఉత్పత్తుల విషయంలో అమెరికా ‘ఎఫ్‌డీఏ’ స్పష్టమైన నిబంధనలను రూపొందించింది. ప్రస్తుతం చాలా ఆరోగ్య పరిరక్షణ పరికరాలు కీలకమైన శారీరక సూచికలను పర్య వేక్షించడమే కాకుండా, అసాధారణ మార్పులు చోటుచేసుకున్న ప్పుడు వినియోగదారులను అప్రమత్తం చేసే సాఫ్ట్‌వేర్‌తో పని చేస్తున్నాయి. వైద్య పరిభాషలో ఇది వ్యాధి నిర్ధారణకు సమానమైన చర్యగా పరిగణించవచ్చు. భారత్‌లో వైద్య పరికరాలకు సంబంధించిన నిబంధనలు ఆరోగ్య పరిరక్షణ పరికరాల విషయంలో ‘ఉద్దేశిత వినియోగం’ అనే సూత్రాన్ని అనుసరిస్తాయి. నియంత్రణ నిబంధ నల్లోని ఈ వెసులుబాటును కొన్ని కంపెనీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయి. ‘ఈ పరికరాన్ని వైద్యపరమైన వ్యాధి నిర్ధారణ కోసం ఉపయోగించరాదు’ అనే హెచ్చరికను చిన్న అక్షరా లతో ముద్రించి తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయి.
డిజిటల్ పరికరాలు వ్యక్తులకు సంబంధించిన అత్యంత సున్నితమైన ఆరోగ్య సమాచారాన్ని సేకరించి నిల్వ చేస్తాయి. తమ వ్యక్తిగత సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారో వినియోగదారు లకు పూర్తిగా తెలియ జేయాలి. సమాచారాన్ని ఇతరులతో పంచు కోవడాన్ని తిరస్కరించే లేదా దాని వినియోగాన్ని పరిమితం చేసే అవకాశం కూడా వారికి ఉండాలి. ఫిట్‌బిట్ వినియోగదారులకుచెందిన లక్షలాది మంది ఫిట్‌నెస్ సమాచారాన్ని భారీ స్థాయిలో లీక్ చేసిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. వినియోగదారుల ఫిట్‌నెస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆరోగ్య బీమా సంస్థలవంటి మూడో పక్ష సంస్థలతోనూ పంచుకుంటున్నారు.
లేనిపోని ఆందోళన?
ఇటీవల ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో న్యూరో టెక్నాలజీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తలెత్తుతున్న నైతిక, చట్టపర మైన సమస్యలను పరిశీలించింది. వినియోగదారుల మార్కెట్‌లో అందుబాటులో ఉన్న నాన్ ఇన్వేజివ్ (శరీరంలోకి చొచ్చుకుపోని) న్యూరో టెక్నాలజీలపై సాధారణంగా చాలా తక్కువ నియంత్రణలు లేదా అసలు నియంత్రణలే లేవని ఆ నివేదిక పేర్కొంది.
వినియోగదారుల శారీరక, మానసిక భద్రత కూడా మరో ముఖ్యమైన సమస్య. ఒక పరికరాన్ని ఆరోగ్య పరిరక్షణ సాధనంగా వర్గీకరించినప్పటికీ, దాని వినియోగం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంది. వ్యక్తుల అలవాట్లను ప్రభావితం చేసేందుకు వేరబుల్ పరిక రాలు గేమిఫికేషన్ (ఆటల తరహా ప్రోత్సాహక పద్ధతులు), హెచ్చ రికలు, నిరంతర అభిప్రాయ సంకేతాలు వంటి సాంకేతికతలను ఉపయోగిస్తాయి.
ఇవన్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే ఉద్దేశించి నప్పటికీ, నిరంతర పర్యవేక్షణ వల్ల మానసికంగా ఆ పరికరాలపై ఆధారపడటం, ఆందోళన, తమలో ఏదో లోపం ఉందనే భావన లేదా ఆరోగ్య సూచికలను పదేపదే తనిఖీ చేసే బలవంతపు ప్రవర్తన వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించే అల్గారిథమ్‌లలో జనాభా వర్గాల మధ్య వివక్ష చూపే ధోరణులు కూడా కొనసాగవచ్చు. ఒక జనాభా వర్గానికి అనుగుణంగా గుండె స్పందన, కేలరీల వినియోగాన్ని కచ్చితంగా లెక్కించేలా రూపొందించిన పరికరం, వైవిధ్యమైన వర్గాల సమాచారంతో తగినంత శిక్షణ పొందకపోవడం వల్ల ఇతర సామాజిక వర్గాలు లేదా సమూహాలకు చెందిన వారి ఆరోగ్య సూచికలను తక్కువగా లెక్కించవచ్చు లేదా తప్పుగా అర్థం చేసుకోవచ్చు.
ఫలితంగా ఇలాంటి పరికరాలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది.అందుకే వైద్య పరికరాలు, ఆరోగ్య పరిరక్షణ సాధనాలురెండింటికీ వర్తించేలా పటిష్ఠమైన, సమగ్రమైన చట్టపరమైన, నైతిక నియంత్రణ వ్యవస్థలను రూపొందించాలి. కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకునే క్రమంలోనే వినియోగదారుల ప్రయోజనాలు, భద్రతకు తగిన రక్షణ కల్పించడం సమాంతరంగా సాగాలి.
ఆరోగ్య పరిరక్షణ పరికరానికీ, నియంత్రణ పరిధిలోకి వచ్చే వైద్య పరికరానికీ మధ్య విభజన రేఖ చాలా సన్నం.
-వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
-దినేశ్ సి. శర్మ


