ఏ కంపెనీలో ఉద్యోగం పొందాలి అనే ప్రశ్నతో పాటు.. | National Education Day 2026: JNTU Professor Uma Article | Sakshi
Sakshi News home page

సంప్రదాయ ఇంజినీరింగ్‌కు భిన్నంగా!

Nov 11 2026 2:47 PM | Updated on Nov 11 2026 2:55 PM

National Education Day 2026: JNTU Professor Uma Article

సందర్భం

భారతదేశంలో జీవ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. అదే సమ యంలో వైద్య పరికరాలు, ఔషధాల తయారీకి అవసరమైన కీలక ముడిపదార్థాలు, ప్రత్యేక భాగాలు, అధునాతన సాంకేతిక పరి జ్ఞానం విషయంలో దిగుమతులపై ఆధారపడటం కొనసాగుతోంది. ఈ పరిస్థితి ఇంజినీరింగ్‌ విద్యకు ఒక కొత్త అవకాశాన్ని సూచిస్తోంది: జీవశాస్త్రం, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం వంటి రంగాల సమస్యలకు ఇంజినీరింగ్‌ పరిష్కారాలను అభివృద్ధి చేయడం.

ఇండియా బయోఎకానమీ రిపోర్ట్‌ 2026 ప్రకారం... 2025లో భారత జీవఆర్థిక వ్యవస్థ విలువ 195.3 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరింది. బయోటెక్నాలజీ స్టార్టప్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే వైద్య పరికరాల రంగంలో దిగుమతులపై ఆధార పడటం గణనీయంగా ఉంది. 2024–25లో వైద్య పరికరాల దిగుమతుల విలువ సుమారు 8.82 బిలియన్‌ డాలర్లు కాగా, ఎగుమతులు రూ. 42,360 కోట్లు. దిగుమతి గణాంకాలను కేవలం వాణిజ్య సమాచారంగా కాకుండా, విద్యార్థులు పరిశోధించి ప్రత్యామ్నాయాలు రూపొందించాల్సిన సాంకేతిక సమస్యల జాబితాగా చూడాలి.

జీవశాస్త్రంతో ముడి
ప్రతి ఇంజినీరింగ్‌ విభాగానికీ జీవశాస్త్ర రంగంలో పాత్ర ఉంది. ఎలక్ట్రానిక్స్‌ విద్యార్థులు బయోసెన్సర్లు, మెడికల్‌ ఇమేజింగ్, ధరించగల పరికరాలు, రోగి పర్యవేక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయవచ్చు. మెకానికల్, మెకాట్రానిక్స్‌ ఇంజినీర్లు శస్త్రచికిత్స రోబోలు, కృత్రిమ అవయవాలు, ప్రయోగశాల ఆటోమేషన్‌పై పనిచేయవచ్చు.

మెటీరియల్స్‌ ఇంజినీర్లు...
ఇంప్లాంట్లు, బయోకాంపాటిబుల్‌ పదార్థాలు రూపొందించవచ్చు. కెమికల్‌ ఇంజినీర్లు ఫెర్మెంటేషన్, బయోరియాక్టర్లు, శుద్ధీకరణ, పారిశ్రామిక స్థాయి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించ వచ్చు. భారత ఔషధ పరిశ్రమ క్రియాశీల ఔషధ పదార్థాలు, బల్క్‌ డ్రగ్స్, మధ్యవర్తి పదార్థాల దిగుమతులపై ఆధారపడుతోంది. ప్రయోగశాలలో పనిచేసిన నమూనాను సురక్షితమైన, నాణ్యమైన, ధ్రువీకరించబడిన, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఉత్పత్తిగా మార్చడమే అసలు సవాలు. అందువల్ల ఇంజినీరింగ్‌ విద్యలో జీవశాస్త్రాల ప్రాథమిక అవగా హనతో పాటు సెన్సర్లు, రోబోటిక్స్, ఏఐ, ఇమేజింగ్, ఆటోమేషన్, బయోరియాక్టర్లు, ప్రాసెస్‌ కంట్రోల్, నాణ్యత ప్రమాణాలు, నియంత్రణ విధానాలు, మేధో సంపత్తి హక్కులపై అనుభవాధారిత శిక్షణ అవసరం.

ఇదీ చ‌ద‌వండి: డిజిటల్‌ తరానికి సురక్షిత ఏఐ ఎలా?

ఐటీ, ఔషధ రంగాల్లో భారత్‌ సాధించిన విజయాన్ని ఇప్పుడు ఇంజినీరింగ్‌– జీవశాస్త్రాల సమన్వయం ద్వారా మరింత విస్తరించవచ్చు. రేపటి ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు ‘ఏ కంపెనీలో ఉద్యోగం పొందాలి?’ అనే ప్రశ్నతో పాటు, ‘ఆరోగ్యం, వ్యవసాయం, బయోటెక్నాలజీ లేదా పర్యావరణ సమస్యకు నా ఇంజినీరింగ్‌ నైపుణ్యంతో ఏ పరిష్కారం అందించగలను?’ అని కూడా ఆలోచించాలి.

- ఎ. ఉమ‌
ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, జేఎన్‌టీయూ, హైదరాబాద్‌ 
(న‌వంబ‌ర్ 11 జాతీయ విద్యా దినోత్సవం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement