స్పందన
రెంచీలు, స్పానర్లు పట్టుకు తిరిగే మొరటోడే గదా ఇంజినీర్ అనుకుంటే... ఎన్‌వీఎస్ రెడ్డి గారేంటి మొరటు పనులు సునాయాసంగా, అత్యంత ఆధునికంగా మార్చి పడేశారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటాన్ని ఆచరణలో పెట్టిన ఎన్వీఎస్ ‘మేఘ పథం’ రచన ఆలస్యంగా చదివాను. ‘బెటర్ లేట్ దేన్ నెవర్’. అందుకే ఇపుడు స్పందిస్తున్నాను. వారి స్వీయచరిత్ర అనేకన్నా ‘హైదరాబాద్ మెట్రో చరిత్ర’ (Hyderabad Metro History) అంటే న్యాయంగా ఉంటుంది. మెట్రో ఆయా చారిత్రక స్థలాలపై నుంచీ ఎలా పయనిస్తుందో, భక్తి విశ్వాసాల ప్రదేశంలో ఎలా పయనిస్తుందో, ఆ యా సందర్భాలలో అనువుగా కార్టూన్లతోపాటు కవితాత్మకంగా లిఖించడం చూస్తుంటే ‘ఈయనగారు సుత్తిపెట్టి కొట్టేవాడే కాదురో నాయనో, కలం పోటుగాడుగా ఉన్నాడే’ అనిపించింది. వ్యాపార వర్గాలను, ఆధ్యాత్మికవాదుల్ని, రాజకీయ విన్యాసుకులను, అపర మేధావులను చాకచక్యంగా ఎదు ర్కొని అనుకున్న ప్రణాళికను ఓర్పుతో, నేర్పుతో సాధించినవాడు ఎన్వీఎస్.
ఈ నిర్మాణంపై నా సొంత అనుభవం కూడా చెప్పాలి. లేకపోతే మెట్రోచరిత్రలో సీపీఐ కనుమరుగవుతుంది. మెట్రో ప్రస్తావన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటిది. అది పురుట్లోనే ఆగిపోయింది. అప్పటికే ఎన్వీఎస్ ఉమ్మడి ఏపీకి వచ్చేశారు. సిటీ ట్రాఫిక్ పెరిగే కొద్దీ వంతెనల నిర్మాణం ప్రారంభమైంది. ఆ క్రమంలోనే మెట్రో అవసరాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా వైఎస్సార్ ప్రభుత్వం అడుగులు వేసింది.
మొదటగా సత్యం రామలింగరాజు కంపెనీకి మెట్రో నిర్మాణానికి అవకాశమేర్పడింది. మెట్రో నిర్మాణ ప్రతిపాదనను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హోదాలో నేను స్వాగతించాను. అయితే సత్యం సంస్థే ప్రశ్నార్థకంగా మారిపోవడంతో వైఎస్సార్ ప్రభుత్వం ఎల్ అండ్ టీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. అసలు మెట్రో నిర్మాణమే వద్దని మేధావులు ఒక సంస్థగా ఏర్పడి వ్యతిరేకించారు. కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా వ్యతిరేకించారు. సహజంగా చిన్నా చితక వ్యాపార వర్గాలు కూడా వ్యతిరేకించాయి.
ఆ సందర్భంగా మెట్రో ఎండీగా ఉన్న ఎన్వీఎస్ సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి మా మద్దతు అడిగారు. ఎలాంటి శషభిషలు లేకుండా బేషరుతుగా మద్దతు పలికాము. ప్రముఖ మేధో సంస్థ సీపీఐ మెట్రో నిర్మాణాన్ని వ్యతిరేకించాలని ప్రతిపాదించింది. భవిష్యత్తులో జనాభా పెరుగుతుంది, రవాణా సౌకర్యం కొరకు మెట్రో అవసరమని పెద్దలకు వివరించాను. నిర్మాణ దశలో ఉండగా ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాకు ఫోన్ చేసి మెట్రో నిర్మాణం ఆపుదామనీ, ఈ మేర ప్రకటన కూడా చేద్దామనీ అడిగారు. నేను అంగీకరించలేదు.
ఇదీ చదవండి: ప్రతీ ఓటు పరిరక్షణకే ఈ పోరాటం
ఎన్‌వీఎస్ మంచి పరిపాలనాదక్షుడే కాదు, మంచి డిప్లమాట్ కూడా. ప్రభుత్వాధికారిగా డిప్లమసీ తప్పదు. ఆశ్చర్యమేమిటంటే మెట్రో వ్యవస్థని వ్యతిరేకించిన రాజకీయ నాయకులతో సహా వాళ్ళందరి ఆనవాళ్లు వారి గ్రంథంలో కనబరిచారు. కానీ సమర్థించిన వారి ప్రస్తావనే లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా అనేది వారే చెప్పాలి.
- డాక్టర్ కె. నారాయణ
సీపీఐ జాతీయ నాయకులు


