వరసగా 4 ఏళ్లు తెలంగాణలో చదవనందుకు.. | Harish Kumar Kolichala Write on Telugu Students Local Issue | Sakshi
Sakshi News home page

స్థానికత ఓ చిక్కుముడి

Oct 12 2026 2:42 PM | Updated on Oct 12 2026 3:02 PM

Harish Kumar Kolichala Write on Telugu Students Local Issue

ఇటీవల ఒక తెలంగాణ నివాసి స్థానికతపై చేసిన లీగల్‌ పోరాటం సఫలీకృతం కాలేదు. వరసగా నాలుగు ఏళ్లు తెలంగాణలో చదవనందుకు ఆ విద్యార్థినికి స్థానికత కోటాలో ప్రవేశం పొందే అర్హతలేదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట్‌ సమర్థించింది. ఫలితంగా, ఆ విద్యార్థినికి ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘స్థానికత’ లేకుండా పోయింది.

1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత వచ్చిన ఆంధ్ర, తెలంగాణ  ఉద్యమాల ప్రభావంతో 32 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 371 (డి)ని రాజ్యాంగంలో 1973లో పొందుపరచారు. దీని ద్వారా... విద్య, ఉద్యోగాలలో సమానావకాశాలకోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉస్మానియా, వేంకటేశ్వర, ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంతాలుగా విభజితమయ్యింది. దీని ప్రకారం, మూడు ప్రాంతాలలో స్థానికులకే 85% సీట్లు, ఉద్యోగాలు రిజర్వ్‌ అయ్యాయి. ఒకే ప్రాంతంలో నిర్దిష్టమైన సమయం వరకు కొనసాగిన చదువు ఆధారంగా స్థానికతను నిర్ణయించాలని 1974, 1976 లలో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు నిర్దేశించాయి. రాష్ట్రం విభజన తరవాత, 2024 లో అవే నియమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో అమలులోకి వచ్చాయి.

ఆనాటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించి కేవలం అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విషయంలో కల్పించిన ప్రత్యేక రక్షణ ఇది. ఈ ఉత్తర్వుల ప్రకారం, ఒక కోర్సులో ప్రవేశానికి ముందు వరుసగా నాలుగేళ్ళు ఒకే ప్రాంతంలో చదివి ఉండడం స్థానికతను నిర్ధారించడానికి కొలమానం. ఉదాహరణకు వైద్య కళాశాలలో ప్రవేశానికి ముందు నాలుగేళ్ళు ఇదే రాష్ట్రంలో (తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్‌లో) చదివి ఉండాలి.

ఇదీ చ‌ద‌వండి: పుస్తకాల వెన్ను విరుస్తున్న ఏఐ!

రాజ్యాంగం లోని 14, 15, 16 అధికరణాల ప్రకారం, నివాసం, పుట్టిన ప్రదేశం ఆధారంగా, ఎవరిపై వివక్ష చూపరాదు. స్థానికత ఆధారంగా రిజర్వేషన్‌ కల్పించడం ఒక విధంగా ఆర్టికల్‌ 14, 15, 16, 19 కి విఘాతం కల్పించడమే. ‘ప్రదీప్‌ జైన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో ఎంబీబీఎస్‌ కోర్సులో నివాసం ఆధారంగా ఎందుకు రిజర్వేషన్‌ కల్పించవచ్చో సుప్రీం కోర్ట్‌ వివరించింది.

ఇదీ చ‌ద‌వండి: ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేక కిరణం

పైన చెప్పిన విద్యార్థిని, తెలంగాణలో జన్మించి, పదిహేనేళ్ళు తెలంగాణలో నివసించినా, స్థానికత నియమాలను సంతృప్తి పరచనందున ఆమెకు ప్రవేశం నిరాకరించబడడం ఈ నియమం వల్ల కలిగిన ఊహించని అనర్థ పరిణామం. ఈ దేశంలో జన్మించిన ప్రతివారికీ భారత పౌరసత్వం లభిస్తుంది. కానీ జన్మించిన ప్రదేశంలో స్థానికత లేకపోవడం విడ్డూరం.

– హరీష్‌ కుమార్‌ కొలిచాల
విశ్రాంత అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (లా), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement