మాధవ్ శింగరాజు
మంచి పుస్తకం ఎక్కడా ఆగనివ్వదు.
మనసుకు హత్తుకుపోయేంత మంచి పుస్తకం అసలే ముందుకు కదలనివ్వదు.
‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో నేను ఎక్కడికక్కడ నిలబడిపోతున్నాను, ఉన్నచోటే ఉండిపోతున్నాను. లేదంటే, వెనక్కు వెళ్లి మళ్లీ వస్తున్నాను. కొన్ని ప్రయాణాలు త్వరగా పూర్తి చేయాలనిపించనంతగా బాగుంటాయి.
ఆత్మకథలో నిజాయితీ ఉన్నప్పుడు, అందులోని రాసిలేని విషయాలు కూడా పాఠకులను చదివిస్తాయి.
సోనియాజీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో పైకి కనిపించేవి... ఇటలీలో ఆమె బాల్యం, కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీతో పరిచయం, ఇండియాకు రావడం, కుటుంబంలో జరిగిన విషాదాలు, ఆమె రాజకీయ ప్రస్థానం... ఇవే అయినా, వాటిని గట్టిగా కలిపి ఉంచిన ‘పర్ఫెక్ట్ బైండింగ్’ మాత్రం... మత సామరస్యం, లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం.
రాత్రి బాగా పొద్దు పోయింది.
చదువుతున్న పేజీ దగ్గర బుక్ మార్కర్ పెట్టి ‘బిలాంగింగ్’ను షెల్ఫ్‌లో సర్ది పెట్టాను. పక్కనే నా పుస్తకం ‘ఆడమ్, వేర్ ఆర్ట్ దౌ?’
నా ‘ఆదం, నీ ఎవిడే ఆకున్ను?’కు ఇంగ్లిష్ అనువాదమే ‘ఆడమ్, వేర్ ఆర్ట్ దౌ?’
క్రైస్తవ సదస్సులు, మతపరమైన సమావేశాలు, బహిరంగ సభలలో నేను చేసిన 32 సువార్త ప్రసంగాల పుస్తకం ‘ఆడమ్, వేర్ ఆర్ట్ దౌ?’ పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవూఫ్ రూమీ అనువదించారు.
ఒక హిందువు తన బైబిల్ ప్రసంగాలను పుస్తకంగా తేవడం, ఆ పుస్తకాన్ని ఒక ముస్లిం ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేయడం... ఏదీ అనుకుని చేసింది కాదు. బహుశా దైవ సంకల్పం కావచ్చు.
‘బిలాంగింగ్’లోని అంతర్లీన మత సామరస్యానికి... ‘ఆడమ్, వేర్ ఆర్ట్ దౌ?’ ఒక భౌతిక వ్యక్తీకరణలా అనిపించింది, ఆ రెండు పుస్తకాలను అలా పక్కపక్కనే చూస్తుంటే!
ఉదయాన్నే, చంగనస్సేరి ఆర్చ్‌డయోసిస్‌లో చర్చి కార్యక్రమం. అదయ్యాక, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో శబరిమల ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం. తర్వాత రెండు మూడు సభలు. తిరిగి ఇంటికి వచ్చాకే మళ్లీ నేను నా బుక్ షెల్ఫ్ దగ్గరకు వెళ్లటం.
కేరళం ప్రజల్లో నేను గుర్తించిన గొప్ప సాంస్కృతిక ఔదార్యం ఏమిటంటే, వారు తమ ముఖ్యమంత్రులకు పుస్తకాలు చదవడానికి, పుస్తకాలు రాయడానికి అంతరాయం కలిగించే ప్రదర్శనలేవీ తరచూ వీధుల్లో చేపడుతూ కనిపించరు. బదులుగా పుస్తక ప్రదర్శనలు కనిపిస్తుంటాయి.
ఇదీ చదవండి: జెన్సన్ హువాంగ్ (బిలియనీర్) రాయని డైరీ
కేరళ ఒక రాష్ట్రం కాదు నాకు. ఒక పుస్తకం.
నవంబర్ 24న కొచ్చిలోని ఒబెరాన్ మాల్‌లో ‘ద స్టోరీబాక్స్ బుక్ ఫెయిర్’. డిసెంబర్ 20న వయనాడ్ జిల్లా మానంతవాడిలో ‘వయనాడ్ లిటరేచర్ ఫెస్టివల్’. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు కొల్లాంలోని అష్టముడి సరస్సు తీరంలో ‘కొల్లాం ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్’. జనవరి రెండో వారంలో ‘కేరళ లెజిస్లేచర్ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్’. జనవరి 21 నుండి 24 వరకు కోళికోడ్ బీచ్‌లో ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’. జనవరి 28 నుండి 31 వరకు తిరువనంతపురంలోని కనకక్కున్ను ప్యాలెస్‌లో ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’.
ఇదీ చదవండి: నరేంద్ర మోదీ (దేశ ప్రధాని) రాయని డైరీ
నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో కేరళలో కొబ్బరి చెట్లకు కాయలు కాయవు. పుస్తకాలు కాస్తాయి.
‘ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు?’ (ఆదం, నీ ఎవిడే ఆకున్ను?) అని బైబిల్‌లోని మొదటి గ్రంథమైన ఆదికాండంలో దేవుడు పిలుస్తాడు.
మనిషి తప్పు చేసి దేవుడికి దూరంగా పారిపోతుంటే, దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చి తిరిగి తన అక్కున చేర్చుకోవడానికి పిలిచిన మొదటి పిలుపు అది.
పుస్తకం కూడా అంతే, దేవుడిలా వచ్చి మనిషిని చేతుల్లోకి తీసుకుంటుంది.


