సహాయం అడగండి... చేయండి! | Speech by Doshisha University President Katsuhiro Kohara | Sakshi
Sakshi News home page

సహాయం అడగండి... చేయండి!

Nov 23 2026 2:36 AM | Updated on Nov 23 2026 2:36 AM

Speech by Doshisha University President Katsuhiro Kohara

జపాన్‌లోని డోషిషా యూనివర్సిటీ 2026 బ్యాచ్‌ పట్టభద్రులను ఉద్దేశించి విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కాటసుహిరో కొహరా చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం

విశ్వగురు

ఈ రోజు బ్యాచిలర్, మాస్టర్స్, ప్రొఫెషనల్, డాక్టోరల్‌ డిగ్రీలను అందుకున్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈసంతోషకరమైన సందర్భంలో, మీరు యూనివర్సిటీలో ఏం నేర్చు కున్నారు, ఏం సాధించారు, ఇన్నేళ్లలో మీలో ఎలాంటి మార్పు వచ్చింది అనే విషయాలను ఒకసారి ఆలోచించండి. ఈ ఆలోచన కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే కాదు; ఇకపై మీరు సంపాదించిన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఎలా ఉపయోగించాలి? అనే దాని గురించి ఆలోచించడానికి ఇది ఒక ప్రారంభం.

ఏది నిజమైన స్వతంత్రత?
మన చదువు ప్రధానంగా మన జీవితాన్ని మనమే నిర్మించు కునే సామర్థ్యాన్ని పెంచుకోవడం గురించి ఉంటుంది. కానీ ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి, మంచి భవిష్యత్తును నిర్మించడానికి మన జ్ఞానం, అనుభవం ఉపయోగపడినప్పుడే వాటికి మరింత విలువ వస్తుంది. సమాజాన్ని గమనించడం, ‘వారికి నేను ఏమి చేయగలను?’ అని ఆలోచించడం ఉన్నత లక్షణం. ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టడం కోసం ముందుగా మీ కాళ్లపై మీరు నిలబడ గలగాలి. తనను తాను నియంత్రించుకోగల స్వతంత్ర వ్యక్తులను తయారు చేయడం ఉన్నత చదువు ముఖ్య ఆశయం. 

మీ కాళ్లపై మీరు నిలబడటమే స్వతంత్రత అనుకుంటున్నారా? నిజమైన స్వతంత్రత అంటే... ‘నాకు ఎవరి సహాయం అవసరం లేదు, అన్నీ నేనే చేసుకుంటాను’ అనే ఒంటరి స్వతంత్రత కాదు. మనకు సహాయం చేసే వ్యక్తులను కలుసుకోవడం, అదే సమయంలో మనం కూడా చాలామందికి సహాయం చేయగలిగే వ్యక్తు లుగా ఎదగడం... ఇదే నిజమైన స్వతంత్రత. ఎవరూ పూర్తిగాఒంటరిగా జీవించలేరు. మనకు సమస్య వచ్చినప్పుడు సహాయం అడగగలగడం, మన పరిమితులు ఏమిటో తెలుసుకోవడం, ఇతరు లను నమ్మడం కూడా ముఖ్యమైన సామర్థ్యాలే.

జపాన్‌ సమాజంలో సహాయం అడగడం అంత సులభం కాదు. ఒక వ్యక్తి చేయలేని పనులకు కూడా అతడినే నిందించడం, ‘అది నీ వ్యక్తిగత బాధ్యత’ అని పేర్కొనడం తరచుగా కనిపిస్తుంది. చిన్న ప్పటి నుంచే పెద్దలు మనకు ‘ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు’ అని పదే పదే చెబుతుంటారు. కానీ కుటుంబ సభ్యులతో సహా, జీవితంలో ఎప్పుడూ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా పెరిగిన వ్యక్తి ఎవరూ ఉండరు. ‘ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు’ అనే ఆలోచన బలంగా ఉంటే... సహాయం అవసరమైన వ్యక్తులు తమ బాధను బయటకు చెప్పలేకపోవచ్చు. దాంతో ఇతరుల కష్టాలను అర్థం చేసుకోలేని సమాజం ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకునే సమాజాన్ని నిర్మించడం చాలా అవసరం.

నీసిమా జీవిత స్ఫూర్తి
ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, మన లక్ష్యాలను సాధించేందుకు డోషిషా యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జోసెఫ్‌ హార్డీ నీసిమా జీవితం మనకు ఎంతో ప్రేరణ ఇస్తుంది. గత సంవత్సరం డోషిషా యూనివర్సిటీ 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. నీసిమా ప్రారంభించిన చిన్న పాఠశాల ఎంతో పెద్ద సంస్థగా ఎదిగింది. బయటికి చూస్తే నీసిమా జీవితం, డోషిషా చరిత్ర ఒక విజయగాథలా కనిపించవచ్చు. కానీ దాన్ని కేవలం విజయగాథగా మాత్రమే చూస్తే ఒక ముఖ్యమైన విషయాన్ని మనం కోల్పోతాం.  

జపాన్‌ నుంచి విదేశాలకు వెళ్లడంపై నిషేధం ఉన్న రోజుల్లో, నీసిమా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ సాహసోపేత మైన ప్రయాణానికి  కొంతమంది వ్యక్తులు సహాయం చేశారు. అమె రికా వెళ్లిన తర్వాత మిస్టర్, మిసెస్‌ హార్డీ సహాయం చేయకపోతే నీసిమాకు అక్కడ చదువు కాదు కదా, జీవించడమే కష్టమయ్యేది. నీసిమా జపాన్‌  కు తిరిగి వచ్చిన తర్వాత, ఒసాకాలో పాఠశాల ప్రారంభించాలన్న ఆయన ప్రణాళిక విఫలమైంది. అయితే, డోషిషా సహ వ్యవస్థాపకుడిగా మారిన యమమోటో కాకుమాతో జరిగిన పరిచయం, అలాగే మిషనరీ డేవిస్‌ అందించిన సహాయం వల్ల, 1875లో క్యోటోలో డోషిషా ఇంగ్లీష్‌ అకాడమీని స్థాపించారు. 

నీసిమా ప్రతి పరిచయాన్ని ఎంతో విలువైనదిగా భావించారు. అనేక మంది సహాయం పొందారు. ఆ సహాయంతోనే ఆయన తన కాళ్లపై తాను నిలబడగలిగే వ్యక్తిగా ఎదిగారు. నీసిమా తన ఆశయ సాధన కోసం తన చుట్టూ ఉన్నవారిని ఎన్నోసార్లుఆందోళనకు గురిచేశారు. వారిపై చాలా బాధ్యతను కూడా పెట్టారు. అయినప్పటికీ, తన చివరి రోజుల వరకు... ఆయన బలమైన లక్ష్యసాధనకు ఆకర్షితులై, ఆయనకు సహాయం చేయ డానికి అనేకమంది సిద్ధంగా ఉండేవారు. ఈ వ్యక్తుల సహాయం లేకుంటే, డోషిషా యూనివర్సిటీ ఏర్పడి అభివృద్ధి చెందేది కాదు. వేల మందికి జ్ఞానాన్ని అందించేది కాదు. 

కొత్త ప్రారంభం
మీరు ఇప్పుడు కొత్త సమాజంలోకి అడుగుపెడుతున్నారు. జీవి తంలో మీరు ఊహించని ఎన్నో సమస్యలను భవిష్యత్తులో ఎదు ర్కోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత ప్రయత్నించినాముందుకు వెళ్లడానికి మార్గం కనిపించక, మీపై మీకే నమ్మకం తగ్గ వచ్చు. అలాంటి సమయంలో, అనేక మంది సహాయంతో ఎదిగిన, అదే సమయంలో ఇతరులకు కూడా సహాయం చేసి ప్రోత్సహించిన నీసిమా జీవితాన్ని గుర్తు చేసుకోండి. సహాయం అడగడానికి భయ పడకండి. జీవితంలో మీరు కలిసే ప్రతి వ్యక్తిని విలువైనవారిగా భావించండి. అలాగే, మీరు కూడా ఇతరులకు సహాయం చేయ గలిగే వ్యక్తులుగా ఎదగండి. 

ఈ రోజు ప్రపంచం వేగంగా మారిపోతోంది. అందువల్ల మనం వెంటనే ఎదురయ్యే చిన్న సమస్యల గురించి ఆలోచిస్తూ, పెద్ద చిత్రాన్ని చూడటం మర్చిపోతుంటాం. కానీ ప్రపంచం ప్రస్తుతం అనేక పెద్ద సమస్యలను ఎదుర్కొంటోంది. వాటిలో వాతావరణ మార్పులు, ఆర్థిక అసమానతలు, వివక్ష, యుద్ధాలు, ఘర్షణలువంటివి ఉన్నాయి. ఇలాంటి సమయంలో, ఉన్నతమైన లక్ష్యాలు, బలమైన నైతిక విలువలు కలిగిన వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. తాము నేర్చుకున్న జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఉపయోగించి మంచి సమాజాన్ని నిర్మించగల వ్యక్తులు మనకు అవసరం.

గ్రాడ్యుయేషన్‌ అంటే మన సంబంధం ముగిసిపోవడం కాదు. డోషిషాతో మీ కొత్త సంబంధానికి ఇది ప్రారంభం. ఇప్పటివరకు డోషిషా యూనివర్సిటీ నుంచి సుమారు 3,80,000 మంది గ్రాడ్యు యేట్‌ అయ్యారు. వారు సమాజంలోని వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. అలాగే మీలో ప్రతి ఒక్కరూ సమాజానికి ఒక ఆశా కిరణంగా మారాలనీ, సమాజంలో చురుకుగా పనిచేయాలనీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి, మంచి భవిష్యత్తును నిర్మించడానికి మన జ్ఞానం, అనుభవం ఉపయోగపడినప్పుడే వాటికి మరింత విలువ వస్తుంది.

మనకు సహాయం చేసే వ్యక్తులను కలుసుకోవడం, అదే సమయంలో మనం కూడా చాలామందికి సహాయం చేయ గలిగే వ్యక్తులుగా ఎదగడం... ఇదే నిజమైన స్వతంత్రత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement