విశ్లేషణ
మనసుకు కవిత్వాన్ని ఆపాదించాం. మెదడుకు నాడీశాస్త్రం పేరుతో ఒక భారీ పరిశోధనా ప్రపంచాన్నే సృష్టించాం.కానీ, మనలో చాలామంది మధ్యాహ్నం నాలుగు గంటలయ్యేసరికి ఎలా అను భూతి చెందాలో, ఎంత ఉల్లాసంగా లేదా ఎంత చిరాకుగా ఉండాలో వాస్తవంగా నిర్ణయించే అవయవానికి మాత్రం తగిన గుర్తింపే ఇవ్వడం లేదు. అదే గట్ (పేగులు)! ఇది ఏదో రూపకాలంకారం కాదు. మన అవగాహనలో జరిగిన ఒక తీవ్రమైన లోపం.
మన రోజును ఏది పాడుచేసిందని ఎవరినైనా అడగండి.అందుకు సమాధానం ఏదో అంతుబట్టని మానసిక స్థితి కాదు. సమ యానికి భోజనం చేయకపోవడం, ఆందోళనతో కడుపులో మెలి పెట్టినట్లుగా ఉండటం, తిన్న ఆహారం గంటల తరబడి అరగక ఇబ్బంది పెట్టడం వంటి కారణాలే ఎక్కువగా కనిపిస్తాయి. గుండె లేదా మూత్రపిండాల మాదిరిగా ఏదైనా తీవ్రమైన సమస్య తలెత్తే వరకు పెద్దగా సంకేతాలివ్వకుండా ఉండే అవయవం కాదు పేగులు. మెదడుతో అవి నిరంతరం సంభాషిస్తూనే ఉంటాయి.
రెండో మెదడు
మన పేగుల గోడల్లో నిక్షిప్తమై ఉన్న ఒక నాడీవ్యవస్థను శాస్త్ర వేత్తలు ‘ఎంటెరిక్ నర్వస్ సిస్టమ్’ అని పిలుస్తారు. ఇందులో సుమారు 10 కోట్ల నుంచి 60 కోట్ల వరకు నాడీకణాలు ఉంటాయి. ఈ సంఖ్య వెన్నుపాములోని నాడీకణాల కంటే ఎక్కువ. అంతేకాదు, ఇది కొంతవరకు స్వతంత్రంగానూ పనిచేయగలదు. మెదడుతో పేగులను అనుసంధానించే ప్రధాన నాడీ మార్గమైన ‘వేగస్ నాడి’ని (వేగస్ నర్వ్) శస్త్రచికిత్స ద్వారా వేరు చేసినప్పటికీ, పేగులు తమ జీర్ణక్రియకు సంబంధించిన సమన్వయ కార్యకలాపాలను చాలా వరకు స్వతంత్రంగానే కొనసాగించగలవు. ఈ స్వయంప్రతిపత్తి కారణంగానే నాడీశాస్త్రవేత్తలు దీన్ని ‘రెండో మెదడు’ అంటారు.
ఆందోళన తరచుగా జీర్ణకోశ సమస్యల రూపంలోనూ, జీర్ణకోశ సమస్యలు ఆందోళన రూపంలోనూ ఎందుకు వ్యక్తమవుతాయో అర్థం చేసుకోవడానికి ఇదొక ముఖ్యమైన కారణం.ఈ రెండు మెదళ్ల మధ్య సమాచార ప్రసారం ప్రధానంగా ఒకే దిశలో సాగుతుందని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. వేగస్ నాడిలోని నాడీ తంతువుల్లో దాదాపు 80 నుంచి 90 శాతం పేగుల నుంచి మెదడువైపు, అంటే కింది నుంచి పైకి సంకేతాలను చేరవేస్తాయి. మెదడు నుంచి పేగులకు సంకేతాలను తీసుకెళ్లేవి కావు ఇవి. మన రోజు ఎలా గడవబోతోందన్న ఆలోచన పూర్తిగా రూపుదిద్దుకోకముందే, మన పేగులు మెదడుకు తమ నివేదికను చేరవేసి ఉంటాయి.
సెరోటోనిన్ కథలోని వాస్తవాలు
కొన్నేళ్లుగా ఆరోగ్య, జీవనశైలి అంశాలపై రాసేవారు ఒక గణాంకాన్ని పదేపదే చెబుతున్నారు. మన శరీరంలో ఉత్పత్తయ్యే సెరో టోనిన్లో 90 నుంచి 95 శాతం పేగుల్లోనే తయారవుతుందని,అందువల్ల మన మానసిక స్థితిని పేగులే నియంత్రిస్తాయని వారి వాదన. ఈ గణాంకం దాదాపు వాస్తవమే. కానీ దాని ఆధారంగా వారు చేస్తున్న నిర్ధారణ మాత్రం సరైనది కాదు.పేగుల్లో ఉత్పత్తి అయ్యే సెరోటోనిన్ మెదడులోకి ప్రవేశించదు. పేగుల్లోని సెరోటోనిన్ ను, మెదడులోని సెరోటోనిన్ ను ‘బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్’(బీబీబీ) దాదాపు పూర్తిగా వేర్వేరు వ్యవస్థల్లో ఉంచుతుంది. నిజానికి పేగుల్లోని సెరోటోనిన్ ప్రధానంగా జీర్ణక్రియను నియంత్రిస్తుంది. మన శరీరంలోని రోగనిరోధక కణాల్లో దాదాపు 70 శాతం పేగుల కణజాలంలోనే ఉంటాయి.
మరి పేగులు మనిషి మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయి? పేగుల్లోని బ్యాక్టీరియా ఆహారంలోని పీచు పదార్థాలను పులియబెట్టి ‘షార్ట్చైన్ ఫ్యాటీ యాసిడ్స్’ అనే రసాయన సమ్మేళ నాలను ఉత్పత్తి చేస్తుంది. పేగుల్లోని సెరోటోనిన్ కు భిన్నంగా, ఈ సమ్మేళనాలు బీబీబీని దాటి మెదడులోకి ప్రవేశించి, మానసిక స్థితిని నియంత్రించే మెదడు కణాలపై నేరుగా ప్రభావం చూపగలవు. మరోవైపు, జీర్ణక్రియ సక్రమంగా జరగనప్పుడు ‘ట్రిప్టోఫాన్ ’ అనే అమైనో ఆమ్లం ‘కైనురెనైన్ పాత్వే’ అనే మరో జీవరసాయన ప్రక్రియలోకి మళ్లుతుంది. ఈ మార్పునకు, డిప్రెషన్ లక్షణాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఇటీవలి వైద్య పరిశోధనలు గుర్తించాయి. ఇక పేగుల్లో నివసించే లక్షల కోట్ల సూక్ష్మజీవులు గమ్మా–ఎమినోబ్యూట్రిక్ యాసిడ్ (జీఏబీఏ)తోపాటు మెదడు పనితీరును, భావోద్వేగ స్థితిని ప్రభావితం చేసే ఇతర రసాయన సమ్మేళనాలను ఉత్పత్తి చేయగలవు. పేగులు కేవలం సెరోటోనిన్ ను ఉత్పత్తి చేసే ఒక రసాయన కుళాయి మాత్రమే కాదు. అవి ఒక రసాయన కర్మాగారం, సమాచార సంకేతాలను సమన్వయం చేసే ఒక నియంత్రణ కేంద్రం కూడా!
కడుపులోకి చేరిన ఘన ఆహారాన్ని రెండు మిల్లీమీటర్ల కంటే చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి కడుపు ఒక యంత్రంలా పనిచేస్తుంది. ఈ ప్రక్రియను ‘ట్రిట్యురేషన్ ’ అంటారు. కడుపు గోడల్లో ఉండే మూడు పొరల కండరాలు సమన్వయంతో తరంగాల మాదిరిగా సంకోచిస్తూ, ఆహారాన్ని మెత్తగా నూరి చిన్న చిన్న కణాలుగా మారుస్తాయి. కడుపులోని ‘పారియటల్ కణాలు’ హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల పీహెచ్ స్థాయి 1.5నుంచి 3.5 మధ్యకు పడిపోతుంది. ఆహారంలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి, హానికర సూక్ష్మజీవులను నాశనం చేయడా నికి ఈ స్థాయి ఆమ్లత్వం అవసరం. ఖాళీ కడుపు నుంచి విడుద లయ్యే ‘గ్రెలిన్ ’ అనే హార్మోన్ ఆకలి సంకేతాలను పంపగా, తిన్న ఆహారం పేగులకు చేరిన తర్వాత ‘లెప్టిన్ ’ ఆకలి తీరిందని మెదడుకు తెలియజేస్తుంది. వీటికి అదనంగా కడుపు గోడల్లో ఉండే ‘స్ట్రెచ్ రిసెప్టర్లు’ కడుపు ఎంతవరకు నిండిందో గుర్తిస్తాయి.
వ్యవస్థలో లోపం తలెత్తినప్పుడు...
‘హెలికోబాక్టర్ పైలోరి’ అనే బ్యాక్టీరియా కడుపులోని ఆమ్లాన్ని తటస్థీకరించే ఎంజైమ్‌ను విడుదల చేస్తూ, శ్లేష్మపు పొరను దెబ్బతీసి, పెప్టిక్ అల్సర్లకు కారణమయ్యే వాపును ప్రేరేపించగలదు. అలాగే, కడుపు పైభాగంలో ఉండే కవాటం సడలిపోవడం వల్ల ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి’ (జీఈఆర్డీ) ఏర్పడుతుంది. దీనివల్ల కడుపులోని ఆమ్లాలు తిరిగి అన్నవాహికలోకి ప్రవహిస్తాయి. దీర్ఘ కాలిక సమస్యగా గుర్తించి చికిత్స చేయాల్సిన ఈ వ్యాధిని చాలా సార్లు సాధారణ గుండెల్లో మంటగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు.
మన రోజువారీ ఆనందం కళ్ల వెనుక ఎక్కడో తయారై, అక్కడి నుంచి శరీరంలోని మిగతా భాగాలకు చేరేది కాదన్నదే ఇక్కడి అసలు విషయం. సుమారు తొమ్మిది మీటర్ల పొడవైన జీర్ణవ్యవస్థలో ప్రతి గంటకూ అది రూపుదిద్దుకుంటుంది. దానికి మంచి ఆహారాన్ని అందించి, భోజనాల మధ్య తగినంత విరామం ఇచ్చి, అది వ్యక్తం చేసే అసౌకర్యాలను శరీరం అందించే సమాచార సంకేతాలుగా పరిగణిస్తే చాలు. మన రోజును ఎంత ఆహ్లాదకరంగా మార్చాలన్నది నిర్ణయించే సంక్లిష్టమైన జీవరసాయన ప్రక్రియలను అది ఎలాంటి ప్రశంసలూ ఆశించకుండా కొనసాగిస్తూనే ఉంటుంది.

-వ్యాసకర్త రిటైర్డ్ ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త; రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ డైరెక్టర్
-మేడాపరమేశ్వర రెడ్డి


