దాదాపు 50 సంవత్సరాలుగా నిర్విరామంగా అంతరిక్షంలో ప్రయాణిస్తున్న నాసా వారి అంతరిక్ష పరిశోధనా నౌక ‘వాయేజర్ 1’ నవంబరు 18 బుధవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల 45 నిమిషాలకు భూమి నుండి ఒక ‘కాంతి దినం’ (లైట్ డే) దూరాన్ని చేరుకుని ముందుకు సాగిపోతోంది. మరే ఇతర మానవ నిర్మిత వస్తువు సాధించని ఘనతను ఇది సొంతం చేసుకుంది. ఒక కాంతి దినం అంటే కాంతి 24 గంటల్లో ప్రయాణించగల దూరం. సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్లకు సమానం. అంటే 2,590 కోట్ల కిలోమీటర్లు.
బృహస్పతి, శని గ్రహాలు; శని వలయాలు... ఆ రెండు గ్రహాల చంద్రుల ఫ్లైౖబైల ద్వారా అధ్యయనాలు నిర్వహించడానికి వాయేజర్ 1 మానవ రహిత రోబోటిక్ అంతరిక్ష అన్వేషక నౌకను నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించింది. సుదూర అంతరిక్షంలో శక్తి కోసం వాయేజర్ మూడు రేడియోఐసోటోప్ థర్మోఎలక్ట్రిక్ జనరేటర్లపై ఆధారపడుతోంది. 1979 మార్చి 5న బృహస్పతికి అత్యంత సమీపంగా వెళ్ళింది. ఐయో ఉపగ్రహంపై క్రియాశీల అగ్నిపర్వతాల ఆవిష్కరణ బృహస్పతి వద్ద జరిగిన అతి పెద్ద ఊహించని ఆవిష్కరణ.
సౌర వ్యవస్థ లోని మరో ఖగోళ వస్తువుపై క్రియాశీల అగ్నిపర్వతాలు కనిపించడం ఇదే మొదటిసారి. 1990 ఫిబ్రవరి 14న సౌర వ్యవస్థ వైపు తన కెమెరాలను మళ్లించి ఆరు గ్రహాల కుటుంబాన్ని ఫొటో తీసింది. అందులో 3.7 బిలియన్ మైళ్లకు పైగా దూరంలో ఉన్న భూమి చిత్రం కూడా ఉంది. ఆ భూమి సూక్ష్మ చిత్రం ‘లేత నీలి చుక్క’ (పేల్ బ్లూ డాట్) ఎంతో ప్రసిద్ధికెక్కింది. 2012 ఆగస్టు 25న సూర్య కుటుంబ హీలియోస్ఫియర్ సరిహద్దు హీలియోపాజ్‌ను దాటి నక్షత్రాంతర మాధ్యమంలోకి ప్రవేశించింది. ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత నౌక/వస్తువు ఇదే.
వాయేజర్ ప్రస్తుతం భూమి నుంచి దాదాపు 26 బిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ప్రయాణిస్తూ ఉంది. వాయేజర్ 1, వాయేజర్ 2 (దీన్ని వాయేజర్ 1 కంటే కొంచెం ముందుగా 1977 ఆగస్ట్ 20న ప్రయోగించారు. కానీ వాయేజర్ 1 ఎక్కువ దూరం ప్రయాణించింది) అంతరిక్ష నౌకలలో నాసా ఒక్కొక్క దానిలో ఒక గోల్డెన్ రికార్డును ఉంచింది.
భవిష్యత్తులో విశ్వంలో ఎక్కడైనా గ్రహాంతరవాసులు దీనిని కనుగొంటే వారు భూమి గురించిన వివ రాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా వివిధ సంస్కృతులు, యుగాలకు చెందిన సంగీత ఎంపికలు, 55 భాషలలో భూలోకవాసుల నుండి వచ్చిన శుభాకాంక్షలు ఉన్నాయి. విశేషమేమంటే ఈ రికార్డులో తెలుగు వారి శుభాకాంక్షలు కూడా రికార్డయి ఉన్నాయి! వాయేజర్ ప్రయోగం మానవ జిజ్ఞాసకు నిదర్శనం. శాస్త్ర విజ్ఞానం, సాంకేతికతల ఘన విజయం!
– సాంబశివరావు ముత్యాల, సైన్స్ ప్రేమికుడు
ఇదీ చదవండి: డ్రోన్ల దాడులకు చెక్.. భూమి లోపలే సైనికుల భీకర పోరాటం!


