ప్రపంచ అగ్రగామి చిప్ తయారీ సంస్థ అయిన ఎన్విడియా (Nvidia) మాజీ సీఈఓ జెన్సెన్ హువాంగ్ (Jensen Huang)పై వచ్చిన ఆరోపణలు దుమారం చివరకు ఆయన రాజీనామాకు దారి తీసింది. హువాంగ్ రాజీనామా తర్వాత దీర్ఘకాలిక ఫైనాన్స్ చీఫ్ కొలెట్ క్రెస్ (Colette Kress) తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తప్పులు మానవ సహజం అంటూ ఆయనే తమకు జెన్సన్ సీఈఓగా కావాలని కంపనీ ఉద్యోగులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉద్యోగులు డిమాండ్‌ను తిరస్కరించిన ఎన్విడియా కొత్త సీఈఓ అన్వేషణలో బిజీగా ఉంది.
మరోవైపు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా తిరిగి రావడానికి జెన్సన్ హువాంగ్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది ఇలా ఉంటే సంస్థలో కీలక వ్యక్తిగా ఎదిగిన జెన్సెన్ కుమార్తె మాడిసన్ హువాంగ్ (Madison Huang) భవిష్యత్తు ప్రభావంపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపార నిర్ణయాల విషయంలో ఈ ఇద్దరు మహిళల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
దశాబ్దాల క్రితం తాను సహ-వ్యవస్థాపకుడిగా ప్రారంభించిన ఎన్విడియా ప్రపంచ అగ్రగామి చిప్ తయారీ సంస్థ అయిన ఎన్విడియా నుండి ఆయన నిష్క్రమించడం ఒక అసాధారణ నాయకత్వ పరిస్థితికి దారితీసింది. జెన్సెన్ నాయకత్వం నుండి తప్పుకోవడంతో, సంస్థ అంతర్గత అధికార నిర్మాణాన్ని పునర్నిర్మించే అవకాశం క్రెస్‌కు లభించింది. ఇక్కడే మాడిసన్, క్రెస్ మధ్య విభైదాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
'ది ఇన్ఫర్మేషన్' (The Information) నివేదిక ప్రకారం, ఎన్విడియాలో శరవేగంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన మాడిసన్, ఆమె భర్త నికో కాప్రెజ్ (Nico Caprez)లతో క్రెస్‌కు విభేదాలు వచ్చాయి. జెన్సెన్ నిష్క్రమణ తర్వాత ఈ విభేదాలు ఆ దంపతుల ప్రభావంపై పరిణామాలను చూపే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. మాడిసన్ 2020లో ఎన్విడియాలో ఇంటర్న్‌గా చేరి, ప్రస్తుతం ఆమె ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే, ఆమె వాస్తవ బాధ్యతలకంటే తన తండ్రి ప్రతిష్టను కాపాడటం, ప్రచారం చేయడంలోనే ఎక్కువగా నిమగ్నమై ఉంటారనే ఆరోపణలున్నాయి. 'ఆమె చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా వ్యవహరిస్తూ, సీనియర్ ఉద్యోగులను తీవ్రంగా మందలించడంలో అపఖ్యాతి పాలయ్యారనే ది న్యూయార్క్ టైమ్స్' కథనం.
మరోవైపు, నికో 2024లో ఎన్విడియాలో చేరి, జనవరి 2026లో వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. క్లౌడ్-కంప్యూటింగ్ ప్రొవైడర్లతో సంస్థ సంబంధాలు ,ఏఐ (AI) మౌలిక సదుపాయాలను విస్తరించే ప్రయత్నాలలో ఆయన కీలక వ్యక్తిగా మారారు. మాడిసన్‌తో పాటు నికో కూడా ఎన్విడియాపై గణనీయమైన నియంత్రణ కలిగి ఉండటం కొందరు సీనియర్ ఉద్యోగులలో అసహనానికి కారణమైంది. జెన్సెన్ హువాంగ్‌తో ఉన్న ప్రత్యేక సాన్నిహిత్యం కారణంగా, ఈ దంపతులు కొన్నిసార్లు తమకంటే పైస్థాయి ఎగ్జిక్యూటివ్‌లను కూడా సవాలు చేసేవారని సంస్థ అంతర్గత సంస్కృతిపై 'వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) నిర్వహించిన ఒక పరిశోధనలో వెల్లడైంది.
ఇదీ చదవండి: International Men’s Day 2026: పెళ్లే పురుషుడి జీవిత లక్ష్యమా?
జెన్సెన్ హువాంగ్‌నే సవాల్ చేసిన చరిత్ర క్రెస్‌ది
హువాంగ్ తీసుకుంటున్నఅత్యంత ప్రతిష్టాత్మక ఆర్థిక నిర్ణయాలను ప్రశ్నించడానికి సిద్ధపడిన కొద్దిమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో క్రెస్ ఒకరిగా నిలిచారు. మైక్రోసాఫ్ట్, సిస్కో , టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లలో సీనియర్ ఫైనాన్స్ లాంటి బాధ్యతలు నిర్వహించిన క్రెస్ 2013లో ఎన్విడియాలో చేరారు. గ్రాఫిక్స్-చిప్ తయారీదారుగా ఉన్న సంస్థను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆధిపత్య శక్తిగా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అయితే, ఆర్థిక రిస్క్ విషయంలో ఆమె అనుసరించే విధానం కొన్నిసార్లు జెన్సెన్ హువాంగ్‌తో విభేదాలకు దారితీసింది. ఏఐ పరిశ్రమలో ఎన్విడియా స్థానాన్ని విస్తరించడానికి భారీ రిస్క్‌లు తీసుకోవడానికి సిద్ధపడే హువాంగ్ ధోరణికి, ఆమె జాగ్రత్తగా వ్యవహరించే విధానం పూర్తి భిన్నంగా ఉండేది.
అలాగే ఓపెన్‌ఏఐ (OpenAI) , లాంబ్డా (Lambda) వంటి ఏఐ మౌలిక సదుపాయాల సంస్థలు, కస్టమర్లకు ఎన్విడియా చేస్తున్న భారీ ఆర్థిక సహాయాలను క్రెస్ , ఆమె ఫైనాన్స్ బృందం ప్రశ్నించినట్లు రాయిటర్స్ (Reuters) నివేదిక పేర్కొంది. ఒహియోలోని ఓపెన్‌ఏఐ డేటా-సెంటర్ ప్రాజెక్ట్ కోసం 250 బిలియన్ డాలర్ల వరకు క్రెడిట్ సపోర్ట్ అందించాలనే ఒక ప్రతిష్టాత్మక ప్రతిపాదనను ఆ తర్వాత 120 బిలియన్ డాలర్లకు తగ్గించారు.
ఇలాంటి ఒప్పందాలను మరింత నిశితంగా పరిశీలించాలని క్రెస్ ఒత్తిడి తెచ్చారు. ఎన్విడియా రిస్క్‌లను ఎలా అంచనా వేస్తుంది? ఏ డీల్స్‌కు మద్దతు ఇవ్వాలో ఎలా నిర్ణయిస్తుంది ? వాటి ద్వారా వచ్చే రాబడిని ఎలా లెక్కిస్తుందనే ప్రశ్నలను ఆమె లేవనెత్తారు. ఆగస్టులో జరిగిన ఒక సమావేశంలో జెన్సెన్ హువాంగ్, క్రెస్ ప్రజెంటేషన్ ఇస్తుండగా మధ్యలో అడ్డుకుని అవమానకరంగా మాట్లాడినట్టుగా కూడా సమాచారం. కేవలం ఆర్థిక సమాచారాన్ని నివేదించడం కాకుండా, వ్యూహరచన చేయడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె తనకు సహాయపడగలదా అని కూడా ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది.
కొలెట్ క్రెస్ Vs మాడిసన్ హువాంగ్
ఇప్పుడు జెన్సెన్ హువాంగ్ బాధ్యతల నుండి తప్పుకోవడంతో, సీఈఓతో నేరుగా సంబంధాలు ఉండవు కాబట్టి మాడిసన్, ఆమె భర్త ప్రభావం తగ్గే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఎన్విడియా నుండి జెన్సెన్ హువాంగ్ ఉద్వాసనకు కేంద్రబిందువుగా మారిన సింగపూర్ క్లౌడ్ ప్రొవైడర్ 'మెగాస్పీడ్' (Megaspeed)తో సంస్థకున్న సంబంధాలపై తలెత్తిన వివాదంలో, ఎన్విడియా అధికారిక స్పందనను రూపొందించడంలో మాడిసన్ ముఖ్య పాత్ర పోషించారని రాయిటర్స్ ఉటంకించిన 'ఫైనాన్షియల్ టైమ్స్' నివేదిక తెలిపింది. ఆమె తన అధికారిక పదవి పరిధిని దాటి బాధ్యతలు నిర్వర్తించారని సమాచారం.
ఆసియా అంతటా అంతర్జాతీయ క్లౌడ్-కంప్యూటింగ్ ఒప్పందాలను పర్యవేక్షించే బాధ్యతలు కలిగిన కాప్రెజ్‌కు కూడా ఈ వివాదంతో సంబంధం ఉంది. సంస్థ వ్యవహారాలపై తనిఖీలు ముమ్మరం కావడంతో, జాతీయ భద్రత, ఎగుమతి-నియంత్రణ విధానాలను పర్యవేక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్విడియా బోర్డు ప్రకటించింది.
కుటుంబ ప్రభావానికి , ఎగ్జిక్యూటివ్ అధికారానికి మధ్య సరిహద్దులను తిరిగి గీయడానికి క్రెస్ తన తాత్కాలిక నాయకత్వాన్ని ఉపయోగిస్తారా లేదా అనేది స్పష్టంగా తెలియదు. మాడిసన్ లేదా కాప్రెజ్ తమ పదవులను కోల్పోతారా అనేది కూడా స్పష్టత లేదు. ప్రస్తుతానికి, పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడం, ఎన్విడియా సాంకేతిక వేగాన్ని కొనసాగించడం మరియు సంస్థ పాలనపై తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం క్రెస్ ముందున్న సవాళ్లు. జెన్సెన్ హువాంగ్ నాయకత్వంతో అసాధారణ వృద్ధిని సాధించిన సంస్థను అంతే సమర్థతతో ముందుకు నడిపించాల్సిన గురుతర బాధ్యత ఆమెపైనే ఉంది.


