AI image
యూఏఈ (UAE)లోని ఒక సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్న భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. కేరళకు చెందిన 37 ఏళ్ల షఫీ తన తండ్రికి అదృష్ట సంఖ్యగా భావించే నంబర్‌ను ఎంచుకుని టికెట్ కొనుగోలు చేశాడు. కట్ చేస్తే.. 200 గ్రాముల బంగారు కడ్డీ లాటరీ తగిలింది. దాంతో సంతోషంతో షపీ ఉబ్బితబ్బిబ్బవు తున్నాడు. ఆ డబ్బుతో అతను ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా?
ఖలీజ్ టైమ్స్ (Khaleej Times) నివేదిక ప్రకారం, అబుదాబి 'బిగ్ టికెట్ సిరీస్ 292' (Big Ticket Series 292)లో 24 క్యారెట్ల బంగారు కడ్డీలను గెలుచుకున్న ఐదుగురు విజేతలలోకేరళకు చెందిన షఫీ పొక్కులంగర బప్పుహాజీ ఒకరు.తన స్నేహితులతో కలిసి గత మూడేళ్లుగా ఒక ప్రముఖ లక్కీ డ్రాలో పాల్గొంటూ చివరకు బంగారు బహుమతిని గెలుచుకున్నారు. నవంబర్ 16న యూఏఈలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 460 దిర్హామ్‌ల (సుమారు రూ. 11,704) కంటే ఎక్కువగా ఉంది. ఈ లెక్కన, 200 గ్రాముల బంగారు కడ్డీ విలువ 92,000 దిర్హామ్‌లకు పైగా, అంటే సుమారు రూ. 23.41 లక్షలకు సమానం. ఇపుడిదే డబ్బుతో తన స్నేహితులతో కలిసి యూఏఈలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆయన ఆశిస్తున్నాడు.
షఫీ గత మూడేళ్లుగా 15 నుండి 20 మంది స్నేహితుల బృందంతో కలిసి ఈ డ్రాలో పాల్గొంటున్నాడు. ఎలాగైనా లాటరీ గెలుచుకోవాలనే ఆశతో ఈ బృందం క్రమం తప్పకుండా డబ్బులు జమ చేసి మరీ టికెట్లు కొనుగోలు చేసేది. గెలుపొందిన ఈ టికెట్ కోసం షఫీ తన తండ్రి లక్కీ నంబర్ ప్రేరణతో నంబర్‌ను ఎంచుకున్నాడు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, షపీకి లాటరీ గెల్చుకున్న శుభవార్త నేరుగా నిర్వాహకుల నుండిరాలేదు. స్నేహితుల్లో ఒకరు ఉత్సుకతతో ఫోన్ చేసి, ఫలితం గురించి చెప్పినపుడు మాత్రమే తెలిసింది. తొలుత తనకు లాటరీ వచ్చిందన్న విషయాన్ని షఫీ నమ్మలేకపోయాడు. వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకున్న తర్వాతే ఆ వార్త నిజమని నిర్ధారించుకున్నాడు.
ఇదీ చదవండి: అమెరికాలో జాబ్ వదిలేసి.. ఇండియాలో దూకుడు!
షఫీ,అతని స్నేహితులు ఇప్పుడు బంగారు కడ్డీని అమ్మగా వచ్చిన డబ్బును తమ కొత్త వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టాలని ఆలోచిస్తున్నారు. తాము ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో వారు వెల్లడించనప్పటికీ, ఈ బహుమతి తమ చిరకాల డ్రీమ్‌కోసం సాయపడుతుందని షఫీ చెప్పాడు.
ఇదే సిరీస్‌లో బంగారు కడ్డీని గెలుచుకున్న భారతీయుడు షఫీ ఒక్కడే కాదు. గత రెండేళ్లుగా అల్ ఐన్ (Al Ain) లో నివసిస్తున్న 25 ఏళ్ల భారతీయ సేల్స్ ప్రొఫెషనల్ అన్షద్ విఎం (Anshad VM) కూడా మరో విజేతగా నిలిచాడు. ఇతను రెండేళ్లుగా 25 మంది స్నేహితులతో కలిసి ప్రతి నెలా రెండు మూడు టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఈ బృందం బంగారు కడ్డీని అమ్మి వచ్చిన డబ్బును సమానంగా పంచుకోవాలని యోచిస్తోంది. ఆ డబ్బుతో కేరళలోని తన కుటుంబానికి అండగా నిలవాలని, తన ఆర్థిక అవసరాలను తీర్చుకోవాలని అన్షద్ ఆశిస్తున్నాడు.
ఇదీ చదవండి: నో ఐఐటీ ట్యాగ్ : ఆంత్రోపిక్ సీటీఓగా రాహుల్ సక్సెస్ స్టోరీ


