ఇజ్రాయెల్‌ నెతన్యాహుకు భారీ షాక్‌ | Netanyahu Suffers Major Setback Eisenkot Ally Elected Israel Speaker | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ నెతన్యాహుకు భారీ షాక్‌

Nov 18 2026 8:54 AM | Updated on Nov 18 2026 9:00 AM

Netanyahu Suffers Major Setback Eisenkot Ally Elected Israel Speaker

జెరూసలేం: ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు పార్లమెంట్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రత్యర్థి, మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్‌కాట్‌ వర్గానికి చెందిన మాటన్‌ కహానా ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ (నెస్సెట్‌) స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 120 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో కహానాకు 66 మంది మద్దతు పలకగా.. నెతన్యాహు పార్టీ అభ్యర్థి ఒఫిర్‌ కాట్జ్‌కు 52 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ ఎన్నిక నెతన్యాహు రాజకీయ ఆధిపత్యానికి మరో సవాలుగా మారింది. ఇప్పటివరకు స్పీకర్‌గా కొనసాగిన అమీర్‌ ఓహానా నెతన్యాహు లికుడ్‌ పార్టీకి చెందినవారు. ఆయన స్థానంలో ఐసెన్‌కాట్‌ వర్గానికి చెందిన కహానా బాధ్యతలు చేపట్టడం పార్లమెంట్‌లో అధికార సమీకరణాలను మార్చే పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్‌లో ఏ అంశాలపై చర్చ జరగాలి? ఏ బిల్లులను ఓటింగ్‌కు తీసుకురావాలి? అనే విషయాల్లో స్పీకర్‌కు కీలక పాత్ర ఉంటుంది. దీంతో నెతన్యాహు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్ష కూటమికి పార్లమెంట్‌లో మరింత పట్టు లభించనుంది.

నెతన్యాహు నిర్ణయాలకు బ్రేక్‌?
నెతన్యాహు ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయవ్యవస్థ సంస్కరణలను రద్దు చేయడం ఐసెన్‌కాట్‌ కూటమి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. న్యాయవ్యవస్థ స్వతంత్రతను తగ్గించేలా ఈ సంస్కరణలు ఉన్నాయంటూ గతంలో ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు జరిగాయి. వీటితో పాటు 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ దాడులను అడ్డుకోవడంలో భద్రతా వైఫల్యాలపై స్వతంత్ర విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఐసెన్‌కాట్‌ కోరుతున్నారు. ప్రధానమంత్రి పదవికి కాలపరిమితి విధించే ప్రతిపాదన కూడా ఆయన ఎజెండాలో ఉంది. ఈ అంశాలపై బుధవారం నుంచే పార్లమెంట్‌లో చర్యలు ప్రారంభించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ
అక్టోబర్‌ 27న జరిగిన ఎన్నికల్లో 120 స్థానాలున్న ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో నెతన్యాహు కూటమికి 53 సీట్లు, ఐసెన్‌కాట్‌ నేతృత్వంలోని కూటమికి 48 సీట్లు వచ్చాయి. అరబ్‌ పార్టీలకు చెందిన రెండు కూటములు కలిపి 19 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో ఏ పక్షానికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మెజారిటీ లభించలేదు. అరబ్‌ పార్టీల మద్దతుతోనే స్పీకర్‌ ఎన్నికలో ఐసెన్‌కాట్‌ వర్గం 66 ఓట్లు సాధించింది. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కాట్‌కు అవకాశం ఇచ్చారు. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 28 రోజుల గడువు ఉండగా, అవసరమైతే మరో 14 రోజులు పొడిగించవచ్చు. అయితే అరబ్‌ పార్టీల మద్దతును ప్రభుత్వ ఏర్పాటు వరకు కొనసాగించడం ఆయనకు కీలకం కానుంది.

మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. ఐసెన్‌కాట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైతే వచ్చే ఏడాది మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ ఎన్నికలో ఎదురైన పరాజయం నెతన్యాహుకు రాజకీయంగా మరో ఎదురుదెబ్బగా మారింది.

ఇదీ చదవండి: అమెరికా రాడార్‌పై ఇరాన్‌ గురి.. యూఎస్‌ ప్రతీకార మెరుపు దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement