ఇజ్రాయెల్‌లో నెతన్యాహు, ఐసెన్‌కోట్ మధ్య రాజకీయ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నెతన్యాహు కోరిన కొద్దిసేపటికే ప్రతిపక్ష నేత, మాజీ ఆర్మీ చీఫ్ గాడి ఐసెన్‌కోట్ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెతన్యాహు ప్రసంగం విద్వేషపూరితమని.. సిగ్గుచేటని మండిపడటమే కాకుండా.. ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇజ్రాయెల్ రాజకీయాల్లో కొత్త రగడ మొదలైంది.
దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఎగ్జిట్ పీఎం చేసిన ప్రసంగాన్ని విన్నాను. ఒక అధికారిక జాతీయ కార్యక్రమాన్ని ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారంటూ ఐసెన్‌కోట్ విమర్శించారు.
జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. ఇరాన్ నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ప్రజలంతా ఒక్కతాటిపైకి రావాలని కోరారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ (కెన్నెసెట్) తొలి సమావేశం అనంతరం నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటాన్ని అంగీకరించాలంటూ అంతర్జాతీయ సమాజం త్వరలో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. 66 ఏళ్ల ఐసెన్‌కోట్ ఇజ్రాయెల్ సైనిక దళాల అధిపతిగా పనిచేసిన అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. భిన్న రాజకీయ సిద్ధాంతాలు కలిగిన నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆయన మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా జాతీయ అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఇరాన్‌తో యుద్ధం ముగిసిందనే అనుకుంటున్నా


