బంగ్లాదేశ్‌లో ఘర్షణలు..ఒకరు మృతి  | Bangladesh witnessing a fresh wave of violence as political tensions | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో ఘర్షణలు..ఒకరు మృతి 

Nov 11 2026 6:28 AM | Updated on Nov 11 2026 6:28 AM

Bangladesh witnessing a fresh wave of violence as political tensions


హసీనా పునరాగమనం వార్తల నేపథ్యంలో ఉద్రిక్తతలు 

ఢాకా: పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనా(79)తిరిగి స్వదేశానికి రానున్నారన్న వార్తల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా జరిగిన వేర్వేరు ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, 8 వాహనాలు కాలిబూడిదయ్యాయని పోలీసులు మంగళవారం ఉదయం తెలిపారు. హసీనా సారథ్యంలోని నిషేధిత అవామీ లీగ్‌ పార్టీ, అనుబంధ గ్రూపుల కార్యకర్తలే ఈ హింసాత్మక ఘటనలకు కారణమని ఆరోపించారు. 

ఫరీద్‌పూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు నిలిపి ఉంచిన బస్సులపై నాటుబాంబులు వేశారు. దీంతో, కొన్ని బస్సులకు నష్టం వాటిల్లింది. ఈ దాడితో ఓ బస్సులో నిద్రిస్తున్న డ్రైవర్‌ దట్టమైన పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. షరియత్‌పూర్‌ జిల్లాలో మంగళవారం వేకువజామున అవామీలీగ్, అనుబంధ సంస్థలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు పద్మా నది వంతెనపై ఉన్న టోల్‌ ప్లాజాను దిగ్బంధించడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయన్నారు. ఆందోళనకారులు నాటు బాంబులు విసరడడంతోపాటు వాహనాలను ధ్వంసం చేశారన్నారు. 

ఆందోళనకారులు నోట్రోకొనా జిల్లాలోని మోహన్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌లో హవోర్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీకి నిప్పుపెట్టడంతో కొంత మేర నష్టం వాటిల్లిందని వివరించారు. హసీనా సొంతూరు తుంగిపారాలో అవామీ లీగ్, అనుబంధ విద్యార్థి సంఘానికి చెందిన వారు పోలీసులతో తలపడ్డారు. ఈ సందర్భంగా పోలీసు వాహనానికి నిప్పంటించారు. 

బంగ్లాదేశ్‌ తిరిగి వచ్చేందుకు వీలుగా కొత్తగా పాస్‌పోర్టును, జాతీయ గుర్తింపు కార్డును జారీ చేయాలంటూ ప్రభుత్వానికి హసీనా చేసిన వినతిపై ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ మహ్మద్‌ అమినుల్‌ ఇస్లాం తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం హసీనాకు మరణ శిక్షను అనుభవించడం మినహా న్యాయపరంగా ఎటువంటి దారులు లేవన్నారు. ఆమెకు పాస్‌పోర్టు వంటివి జారీ చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. నిజంగా ఆమెకు రావాలని ఉంటే ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతున్న సమయంలో లేదా, శిక్షను ప్రకటించిన 30 రోజుల్లోగా తిరిగి వచ్చి ఉండేవారని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సారథ్యంలోని తిరుగుబాటుతో అవామీలీగ్‌ ప్రభుత్వం కుప్పకూలడంతో 2024 ఆగస్ట్‌ నుంచి హసీనా భారత్‌లోనే ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement