ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ సమీపంలో పురావస్తు తవ్వకాల సందర్భంగా బయటపడిన 8,000 కప్పల ఎముకల వెనుక ఉన్న రహస్యాన్ని పరిశోధకులు దాదాపు పదేళ్ల తర్వాత ఛేదించారు. సుమారు 1,700 ఏళ్ల క్రితం వేటాడే పక్షులు పెద్ద సంఖ్యలో చిన్న కప్పలను తిని, వాటి ఎముకలను ఒకే ప్రాంతంలో వదిలివేసి ఉంటాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఒకప్పుడు కప్పల సమాధిగా భావించిన ఈ ప్రాంతం.. వాస్తవానికి గుడ్లగూబలు, ఇతర వేట పక్షులకు కాలానుగుణంగా ఆహారం లభించిన ప్రదేశమని పరిశోధకులు గుర్తించారు.
2016 నుంచి 2018 మధ్య ఇంగ్లండ్‌లోని నేషనల్ హైవేస్ చేపట్టిన ఏ14 కేంబ్రిడ్జ్-హంటింగ్‌డన్ రహదారి అభివృద్ధి పనులకు సంబంధించిన పురావస్తు పరిశోధనల్లో ఈ ఎముకలు బయటపడ్డాయి. కేంబ్రిడ్జ్ సమీపంలోని బార్ హిల్ ప్రాంతంలో, ఇనుప యుగం నాటి వృత్తాకార నివాస నిర్మాణానికి దగ్గరగా ఉన్న ఒక గోతిలో వీటిని గుర్తించారు. ఈ గోతిలోని ఎముకలన్నీ కేవలం ఏడాది వ్యవధిలోనే పేరుకుపోయినట్లు ఆధారాలు లభించడంతో పరిశోధకులు ఆశ్చర్యపోయారు. అనేక తరాలుగా నెమ్మదిగా పేరుకుపోయాయనే వాదనకు ఇది సరిపోలలేదు.
ఈ మిస్టరీని ఛేదించేందుకు బోర్న్‌మౌత్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు డాక్టర్ పాల్ క్లార్క్‌సన్, మ్యూజియం ఆఫ్ లండన్ ఆర్కియాలజీకి చెందిన సీనియర్ జంతు అవశేషాల నిపుణురాలు డాక్టర్ విక్కీ ఇవెన్స్ సహాయం కోరారు. పురాతన ఎముకలపై ఉన్న గుర్తులు, వాటి దెబ్బతిన్న తీరును గత పరిశోధనలతో పోల్చినప్పుడు వేట పక్షాలే వీటిని తిని ఉంటాయనే ఆధారాలు లభించాయి. ముఖ్యంగా పొట్టి చెవుల గుడ్లగూబలు, హెన్ హారియర్లు ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అంచనా వేశారు.
అయితే ఇంత తక్కువ సమయంలో ఒకే ప్రాంతంలోకి ఇన్ని కప్పలు ఎలా చేరాయన్న ప్రశ్నకు సమాధానం కనుగొనడం మరో సవాలుగా మారింది. ఇందుకోసం కప్పల పైచేయి ఎముకలైన హ్యూమరస్‌ల పొడవును కొలిచే కొత్త పద్ధతిని పరిశోధకులు ఉపయోగించారు. వాటిలో ఎక్కువ భాగం చిన్న వయసులో ఉన్న కప్పలవేనని, పుట్టిన మొదటి సంవత్సరపు చలికాలంలోనే అవి చనిపోయాయని గుర్తించారు. వియన్నా విశ్వవిద్యాలయం నిర్వహించిన రేడియోకార్బన్ పరీక్షల్లో ఈ అవశేషాలు సుమారు 1,700 ఏళ్ల నాటివని తేలింది. దీంతో ఈ ఘటన రోమన్ పాలన కాలంలో జరిగినట్లు నిర్ధారించారు.
పర్యావరణ మార్పులే కారణమా?
ఆ కాలంలో ఆ ప్రాంతంలోని లోయలో ఉన్న చిత్తడి నేలలు క్రమంగా తగ్గుముఖం పట్టడం కప్పల సంతానోత్పత్తికి అనుకూల పరిస్థితులను కల్పించిందని పరిశోధకులు భావిస్తున్నారు. అదే సమయంలో పెద్ద ఎత్తున అడవులు తొలగించారు. నత్తల అవశేషాలు, పుప్పొడి, బొగ్గు ఆధారాలను పరిశీలించి ఇనుప యుగం నాటి అడవులు క్రమంగా పశువుల మేతకు అనువైన బహిరంగ ప్రాంతాలుగా మారినట్లు గుర్తించారు.
చెట్ల కవచం తగ్గడంతో కప్పలకు దాక్కునేందుకు ఆశ్రయాలు తగ్గి, గడ్డి భూముల్లో వేటాడే పక్షులకు అవి సులభంగా ఆహారంగా మారాయి. పశువులను కాలానుగుణంగా ఇతర ప్రాంతాలకు తరలించడం, ఆ ప్రాంతంలో నిరంతర నివాసాలు తగ్గడం వంటి మానవ కార్యకలాపాల మార్పులు కూడా ఈ పరిణామంపై ప్రభావం చూపి ఉండవచ్చని అధ్యయనం సూచించింది.
ఈ పరిశోధన వివరాలు ఎన్విరాన్‌మెంటల్ ఆర్కియాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వేలాది చిన్న ఎముకలు కేవలం పురాతన జీవుల అవశేషాలే కాకుండా.. వేట పక్షులు, వాటి ఆహార జీవులు, మానవ భూ వినియోగం మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకోవడానికి కీలక ఆధారాలుగా నిలిచాయి. రోమన్ కాలంలో బ్రిటన్‌లో పర్యావరణం ఎలా మారిందో తెలుసుకోవడానికి ఈ అధ్యయనం కొత్త సమాచారాన్ని అందించింది.


