బీజింగ్: చైనాలో పరిహారం చెల్లింపుల వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి ఎక్స్‌కవేటర్‌తో ప్రభుత్వ సేవా కేంద్రంపై దాడికి దిగాడు. భవన ప్రవేశ ద్వారాన్ని ధ్వంసం చేయడంతో పాటు కార్యాలయ సముదాయంలోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాడు. దాదాపు గంటపాటు ఈ ఘటన కొనసాగగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
చైనాలోని వాయవ్య ప్రాంతమైన షాంగ్జీ ప్రావిన్స్‌లో నవంబర్ 9న ఈ ఘటన చోటుచేసుకుంది. జియాన్ నగరంలోని షిషియాన్ న్యూ ఏరియాలో ఉన్న ఫెంగ్‌డాంగ్ న్యూ సిటీ ప్రభుత్వ సేవా కేంద్రంలోకి 47 ఏళ్ల వ్యక్తి ఎక్స్‌కవేటర్‌ను నడుపుకుంటూ దూసుకెళ్లాడు. భవనంలోని మొదటి నంబర్ బ్లాక్ ప్రవేశ ద్వారం వద్ద యంత్రంతో విధ్వంసం సృష్టించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిలో ఎక్స్‌కవేటర్‌తో భవన ప్రవేశ మార్గాన్ని, కార్యాలయానికి సంబంధించిన బాహ్య భాగాలను ధ్వంసం చేయడం కనిపిస్తోంది. భవనం మెట్లతో పాటు ప్రధాన నామఫలకం, అద్దాల తలుపులను కూడా యంత్రంతో ఢీకొట్టాడు. కార్యాలయ సముదాయంలోని కనీసం 6 ప్రాంతాలు దెబ్బతిన్నట్లు స్థానిక నివేదికలు వెల్లడించాయి.
ఘటన సమయంలో కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు, ప్రజలను సురక్షితంగా బయటకు పంపేందుకు అత్యవసర తరలింపు చర్యలు చేపట్టినట్లు అక్కడి ఓ ఉద్యోగి చైనా మీడియాకు తెలిపారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి.. అక్కడున్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని, నిందితుడిని అడ్డుకునేందుకు ఎవరూ ప్రయత్నించలేదని స్థానిక మీడియాకు వివరించారు. అదే రోజు మధ్యాహ్నం తర్వాత కొన్ని సేవా విభాగాలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయి.
ఇదిలా ఉండగా.. గ్రామస్థుల ఇళ్లను కూల్చివేసినందుకు చెల్లించాల్సిన పరిహారం అందకపోవడంపై నెలకొన్న వివాదమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని స్థానిక మీడియా కథనాలను ఉటంకిస్తూ అల్‌జజీరా పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు. నిందితుడు ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డాడనే కారణాన్ని కూడా వెల్లడించలేదు.
ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు అసలు కారణమేంటన్నది అధికారులు చేపట్టిన దర్యాప్తులో తేలాల్సి ఉంది. పరిహారం చెల్లింపుల వివాదానికి, ఈ విధ్వంసానికి మధ్య ఉన్న సంబంధంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


