ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ ప్రస్తుతం ఒక పెద్ద వివాదం నడుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ (AI) చిప్‌లను తయారు చేసే ఎన్విడియా కంపెనీ అధినేత.. జెన్సన్ హువాంగ్‌కు చైనాకు చెందిన అలిస్ హువాంగ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని, అంతేకాకుండా.. ఆమెకు చైనా గూఢచార సంస్థలతో సంబంధాలు ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై ఎన్విడియా బోర్డు కూడా విచారణ చేపట్టింది.
ఎవరీ అలిస్ హువాంగ్?
అలిస్ హువాంగ్ అసలు పేరు హువాంగ్ లే. ఆమె సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థలో కీలక పదవిలో పనిచేసినట్లు సమాచారం. గతంలో ఆమె ఒక మాజీ టీవీ రిపోర్టర్.. హునాన్ టీవీ, ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీలలో పనిచేశారు. సీఐటీఐసీ సెక్యూరిటీస్‌లో వైస్ ప్రెసిడెంట్ కాకముందు, హెచ్‌ఎస్‌బీసీలో కూడా పనిచేశారని, అక్కడ దాని ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగం అధ్యక్షుడికి సహాయకురాలిగా పనిచేసినట్లు సమాచారం.
అయితే.. ఆమె గత ఉద్యోగాలకు సంబంధించి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే.. హునాన్ టీవీకి చెందిన ఒక అధికారి ఆమె గురించి తమకు తెలియదని చెప్పినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. ఆమె వృత్తికి సంబంధించిన విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఫొటోలు వెలుగులోకి
2024 జూన్‌లో తైవాన్‌లోని ఒక బార్‌లో జెన్సన్ హువాంగ్ పక్కన అలిస్ హువాంగ్ కనిపించినట్లు ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో గిగాబైట్, నెట్‌థండర్ సంస్థలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు కూడా అక్కడ ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఆలిస్‌కు సంబంధం ఉన్న మెగాస్పీడ్ సంస్థ ఎన్విడియా ఏఐ చిప్‌లను భారీ స్థాయిలో కొనుగోలు చేయడం ప్రారంభించిందని నివేదికలు చెబుతున్నాయి. గత రెండేళ్లలో ఆ సంస్థ సుమారు 4.8 బిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా చిప్‌లను కొనుగోలు చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అమెరికా అధికారుల దృష్టికి కూడా ఈ లావాదేవీలు వెళ్లినట్లు సమాచారం.
ఆందోళన కలిగిస్తున్న విషయం
ఈ వ్యవహారంలో అసలు ఆందోళన కలిగిస్తున్న విషయం చైనా గూఢచర్య ఆరోపణలు. అమెరికా అధికారుల విచారణలో మెగాస్పీడ్‌కు చెందిన వ్యక్తులు చైనాకు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమైనట్లు వార్తలు వచ్చాయి.
చైనా నిఘా సంస్థ అయిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ.. అలిస్ హువాంగ్‌ను జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి, అలాగే చైనాకు ఎన్విడియా చిప్‌ల ఎగుమతుల విషయంలో కంపెనీ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించుకుందని ఒక రహస్య నివేదికలో పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా అమెరికా చైనాకు అత్యాధునిక ఏఐ చిప్‌ల విక్రయాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

స్పందించిన ట్రంప్
ఈ వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఈ వ్యవహారం చాలా క్లిష్టమైనదని, జెన్సన్ హువాంగ్ విషయంలో అంతా సవ్యంగా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని కూడా తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం.. ఇది కంపెనీకి సంబంధించిన అంతర్గత వ్యవహారమని, దీనిపై తాను వ్యాఖ్యానించలేనని చెప్పారు.
ఇదీ చదవండి: మహిళల కోసం బెస్ట్ కార్లు.. తక్కువ ధరలో అదిరిపోయే మోడల్స్!


