ప్రపంచ ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాను వివాదం చుట్టుముట్టింది. సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్ చైనా గూఢచర్య ప్రయత్నానికి లక్ష్యంగా మారారా? అన్న అనుమానాలపై కంపెనీ డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ పరిణామాలతో సోమవారం అమెరికా మార్కెట్‌లో ఎన్విడియా షేర్లు భారీగా పడిపోయాయి. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో సుమారు 5 శాతం క్షీణించగా, ట్రేడింగ్ ప్రారంభంలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రారంభ గంట మోగిన వెంటనే కంపెనీ షేర్లు దాదాపు 7.5% పడిపోయాయి. గత ముగింపుతో పోల్చుకుంటే ఒక్కో షేరు విలువ 186.64 డాలర్ల నుంచి 172.75 డాలర్లకు పడిపోయింది. దీంతో మొత్తంగా ఎన్విడియా మార్కెట్ విలువలో 335 బిలియన్ డాలర్లు (రూ.25 లక్షల కోట్లకు పైగా) తుడిచిపెట్టుకుపోయాయి. కంపెనీ విలువను 4.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.16 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది.
అసలేం జరిగింది?
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థలో గతంలో పనిచేసిన ఆలిస్ హువాంగ్‌తో జెన్సన్ హువాంగ్‌కు సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె చైనా కోసం సమాచారాన్ని సేకరించినట్లు అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయన్నది ఈ కథనాల సారాంశం. మరోవైపు, తన భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు జెన్సన్ హువాంగ్ ఉద్యోగులకు పంపిన సందేశంలో అంగీకరించి క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో ఎన్‌విడియా బోర్డు స్వతంత్ర డైరెక్టర్లు, బయటి న్యాయ సలహాదారుల పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టనుంది. అయితే కంపెనీ రహస్యాలు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లీక్ అయినట్లు ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని బోర్డు పేర్కొంది. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ సీఈవోగా హువాంగ్ కొనసాగుతారని సంస్థ స్పష్టం చేసింది.


