ధంతేరాస్ (ధన త్రయోదశి), దీపావళి వచ్చాయంటే బంగారం, వెండి కొనుగోళ్లు జోరందుకుంటాయి. కొందరు ఆభరణాలు కొనుగోలు చేస్తే.. మరికొందరు బంగారు నాణేలు, బిస్కెట్ల రూపంలో కొంటుంటారు. మీలో చాలా మంది ఇప్పటికే బంగారం కొనే ఉంటారు. అయితే ఆ కొన్న బంగారాన్ని ఏం చేస్తున్నారు.. ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఎంత పరిమాణం దాటితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నిస్తారు? బంగారం నిల్వలపై పన్ను చెల్లించాలా? ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు?
భారత్‌లో ఒక వ్యక్తి ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవాలనే దానిపై నిర్దిష్టమైన చట్టపరమైన పరిమితి లేదు. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. వారసత్వంగా వచ్చినా, సొంత ఆదాయంతో కొనుగోలు చేసినా, ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో వివరించగలిగితే ఎంత మొత్తంలోనైనా కలిగి ఉండవచ్చు. అయితే ఆదాయపు పన్ను శాఖ దాడుల సమయంలో బంగారు ఆభరణాల స్వాధీనానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
వాటి ప్రకారం కుటుంబ సభ్యుల వద్ద ఉన్న బంగారు ఆభరణాల్లో.. పెళ్లయిన మహిళ అయితే 500 గ్రాములు, పెళ్లికాని మహిళ అయితే 250 గ్రాములు, పురుషులు 100 గ్రాములు వరకు కలిగి ఉంటే అధికారులు స్వాధీనం చేసుకోకూడదు. కుటుంబ సంప్రదాయాలు, సామాజిక పరిస్థితులను బట్టి అంతకంటే ఎక్కువ ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకోకుండా మినహాయించే అధికారం అధికారులకు ఉంటుంది.
బంగారం నిల్వలపై పన్ను చెల్లించాలా?
సాధారణంగా ఇంట్లో బంగారం ఉంచుకున్నంత మాత్రాన ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆ బంగారం కొనుగోలు చేసిన ఆదాయ వనరు చట్టబద్ధమైనదై ఉండాలి. వారసత్వంగా వచ్చిన బంగారానికి సంబంధించి వీలునామా, వారసత్వ పత్రాలు, కుటుంబ వివరాలు వంటి ఆధారాలు భద్రపరుచుకోవడం మంచిది. కొనుగోలు చేసిన బంగారానికి బిల్లులు, చెల్లింపుల రసీదులు, బ్యాంకు లావాదేవీల వివరాలు ఉంచుకోవాలి.
తగిన ఆధారాలు లేకుండా భారీ మొత్తంలో బంగారం గుర్తిస్తే.. దాని మూలాలపై అధికారులు వివరణ కోరవచ్చు. ఆదాయానికి సరిపోని, లెక్కల్లో చూపని ఆస్తిగా నిర్ధారణ అయితే పన్నులు, జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో బంగారాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.
బంగారం కొనుగోలు, అమ్మకంపై పన్నులు
బంగారం కొనుగోలు చేసేటప్పుడు సాధారణంగా 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఆభరణాల విషయంలో తయారీ ఛార్జీలను విడిగా చూపించినప్పటికీ మొత్తం లావాదేవీ విలువపై 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అదేవిధంగా బంగారాన్ని విక్రయించినప్పుడు వచ్చిన లాభంపై మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టిన కాలం అంటే ఆ బంగారం ఎప్పుడు కొనుగోలు చేశారన్నది కీలకం.
కొన్నప్పటి నుంచి 24 నెలల్లోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణించి వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అదే 24 నెలల తర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణించి 12.5 శాతం పన్ను విధిస్తారు. దీనికి ఇండెక్సేషన్ ప్రయోజనం ఉండదు.
బ్యాంకు లాకర్‌లో బంగారం పెడితే..
ఇంట్లో బంగారం ఉంచుకోవడం కంటే బ్యాంకు లాకర్లలో భద్రపరచడాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే బ్యాంకు లాకర్ అద్దె అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండదు. లాకర్ పరిమాణం, బ్యాంకు, బ్రాంచ్‌ను బట్టి ఛార్జీలు మారుతుంటాయి. ముఖ్యంగా ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు నిర్లక్ష్యం, అగ్నిప్రమాదం, దొంగతనం వంటి నిర్దిష్ట సందర్భాల్లో లాకర్‌లోని వస్తువులకు నష్టం జరిగితే.. వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్ల వరకు బ్యాంకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉదాహరణకు వార్షిక అద్దె రూ.5,000 అయితే పరిహారం గరిష్ఠంగా రూ.5 లక్షలు మాత్రమే. ఇది లాకర్‌లోని మొత్తం బంగారానికి వర్తించే బీమా కాదు. కాబట్టి విలువైన ఆభరణాలకు అదనపు బీమా తీసుకోవడాన్ని కూడా పరిశీలించాలి.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు (నవంబర్ 9) నమోదైన బంగారం, వెండి ధరలను ఈ కింద తెలుసుకోవచ్చు..
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


