జెన్సన్ హువాంగ్‌కు ఎలాన్ మస్క్ మద్దతు | Elon Musk, Bill Ackman support Jensen Huang | Sakshi
Sakshi News home page

జెన్సన్ హువాంగ్‌కు ఎలాన్ మస్క్ మద్దతు

Nov 9 2026 3:14 PM | Updated on Nov 9 2026 3:26 PM

Elon Musk, Bill Ackman support Jensen Huang

ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు అంగీకరించిన ఆయనకు అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌, ప్రముఖ పెట్టుబడిదారుడు బిల్ అక్‌మన్ తమ మద్దతు తెలిపారు.

మస్క్ ఏమన్నారంటే?
హువాంగ్‌కు మద్దతుగా బిల్ అక్‌మన్ స్పందిస్తూ.. ‘‘జెన్సన్ గొప్ప వ్యక్తి. అయితే గొప్ప వ్యక్తులు కూడా తప్పులు చేస్తారు. ఆయన తన తప్పును అంగీకరించి పూర్తి బాధ్యత తీసుకున్నారు. మనమంతా ఆయనకు, ఆయన కుటుంబానికి మద్దతుగా నిలవాలి’’ అని అన్నారు.

సీక్వోయా పార్ట్‌నర్ షాన్ మాగ్వైర్ కూడా హువాంగ్‌కు మద్దతు తెలిపారు. ఆయన చేసిన పని తప్పేనని, కానీ దాని వెనుక దురుద్దేశం మాత్రం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘నేను అంగీకరిస్తున్నాను’’ అని రెండు పదాల్లో తన మద్దతును ప్రకటించారు.

చైనా గూఢచర్య ఆరోపణలపై దర్యాప్తు
ఇక మరోవైపు చైనా పౌరురాలైన అలైస్ హువాంగ్‌తో జెన్సన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని గత నెలలో ఓ మీడియా కథనం వెల్లడించింది. అంతేకాదు ఆమె బీజింగ్‌కు సమాచారం చేరవేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారని కూడా పేర్కొంది.

అలైస్ గతంలో చైనాలో ఓ టెలివిజన్ జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థలో కీలక పదవిలో ఉన్నారు. అయితే ఈ సంస్థ గత రెండేళ్లలో ఎన్విడియా నుంచి 4.8 బిలియన్ డాలర్లకు పైగా విలువైన చిప్‌లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జెన్సన్ హువాంగ్ విదేశీ నిఘా కార్యకలాపాలకు లక్ష్యంగా మారారా అనే అంశంపై ఎన్విడియా బోర్డు దర్యాప్తు ప్రారంభించింది.

క్షమాపణలు చెప్పిన జెన్సన్ హువాంగ్
తన భార్యకు, పిల్లలతో పాటు సంస్థలోని ఉద్యోగులకు కూడా క్షమాపణలు చెబుతూ జెన్సన్ హువాంగ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను నా భార్యకు నమ్మకద్రోహం చేశాను. నా చర్యల వల్ల ఆమెతో పాటు పిల్లలు కూడా బాధపడ్డారు. దీనికి ఎలాంటి సమర్థన లేదు. నన్ను క్షమించండి’’ అని పేర్కొన్నారు. 41 ఏళ్లుగా భార్య లోరీతో కలిసి జీవిస్తున్న 63 ఏళ్ల హువాంగ్.. తన చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్విడియాకు నాయకత్వం వహించడం తన జీవితంలో గొప్ప అవకాశమని, ఉద్యోగుల నమ్మకానికి తగినట్లుగా వ్యవహరించడంలో విఫలమయ్యానని కూడా ఆయన అంగీకరించారు.

ఇదీ చదవండి: ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు.. చైనా సాయం కోరుతున్న అమెరికా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement