పశ్చిమ ఆఫ్రికా దేశం సెనెగల్ తీరంలో వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 34కి చేరింది. ఈ ఘటనలో ఒకరిని రక్షించగా, ఇంకా ఎంతమంది ఆచూకీ తెలియకుండా ఉన్నారనే విషయం స్పష్టంగా తెలియలేదని సెనెగల్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అధికారిక వర్గాలను ఉటంకిస్తూ సెనెగల్ ప్రెస్ ఏజెన్సీ (ఏపీఎస్) ఈ వివరాలను తెలిపింది.
రాజధాని డాకర్, ఉత్తర ప్రాంతంలోని సెయింట్ లూయిస్ నగరాల మధ్య అట్లాంటిక్ సముద్రంలో ఈ ప్రమాదం జరిగింది. స్పెయిన్‌కు చెందిన కానరీ దీవుల దిశగా వెళ్తున్న చిన్న చెక్క పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలన్నీ సెనెగల్ దేశస్థులవేనని వలసదారులకు సహాయం అందించే బోజా ఫీ సంస్థ వ్యవస్థాపకుడు సాలియో డియూఫ్ ఏఎఫ్‌పీకి తెలిపారు. పడవలో ఉన్న మిగతావారి జాతీయతలు ఇంకా నిర్ధారణ కాలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఈ ఘటనపై అధ్యక్షుడు బస్సిరౌ డియోమాయే ఫాయే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాల ద్వారా ప్రాణాలను పణంగా పెట్టవద్దని దేశ ప్రజలకు సూచించారు. వలస ప్రయాణాలను నిర్వహిస్తున్న ముఠాలను అణచివేసేందుకు చర్యలను మరింత ముమ్మరం చేస్తామని ఎక్స్‌లో ప్రకటించారు.
"ఈ సముద్ర ప్రయాణాలను నిర్వహించే వారిపై పోరాటాన్ని, మన యువతకు స్వదేశంలోనే ఆశతో జీవించే అవకాశాలు కల్పించే ప్రయత్నాలను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొనసాగిస్తాం" అని ఆయన పేర్కొన్నారు. స్పెయిన్‌కు చెందిన వాకింగ్ బోర్డర్స్ సంస్థ గణాంకాల ప్రకారం.. 2026 జనవరి నుంచి మే వరకు కానరీ దీవులకు చేరుకునే అట్లాంటిక్ మార్గంలో 635 మంది ప్రాణాలు కోల్పోయారు. తాము పర్యవేక్షిస్తున్న వలస మార్గాల్లో ఇదే అత్యధిక మరణాల సంఖ్య. ఈ కాలంలో కానరీ దీవులకు చేరుకున్న ప్రతి 100 మందికి మరో 21 మంది సముద్రంలో మరణించినట్లు సంస్థ అంచనా వేసింది.
మరో పడవను అడ్డుకున్న అధికారులు
ఇదిలా ఉండగా, శుక్రవారం స్పెయిన్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న 142 మంది వలసదారులతో కూడిన మరో పడవను సెనెగల్ అధికారులు అడ్డుకున్నారు. అందులో 23 మంది మహిళలు, ఇద్దరు శిశువులు, మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెనెగల్, గాంబియా, గినియా-బిస్సావు, గినియా, నైజీరియా దేశాలకు చెందినవారు ఈ బృందంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు, వలసదారుల రాక పెరగడంతో స్పెయిన్‌కు చెందిన ఎల్ హియెర్రో దీవిలో శనివారం అత్యవసర పరిస్థితి ప్రకటించారు. నవంబర్ ప్రారంభం నుంచి సుమారు 30 పడవల్లో 3,300 మందికి పైగా అక్కడికి చేరుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పశ్చిమ ఆఫ్రికా నుంచి యూరప్‌కు చేరుకునేందుకు కానరీ దీవుల మార్గం ప్రధాన ప్రవేశద్వారంగా మారింది. ఐరోపా దేశాలు, ఉత్తర ఆఫ్రికా దేశాల మధ్య పెరిగిన నియంత్రణలు, సహకారం కారణంగా కొందరు వలసదారులు మధ్యధరా సముద్ర మార్గానికి బదులుగా అట్లాంటిక్ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) ప్రకారం.. ఉపాధి అవకాశాల కొరత, కుటుంబ ఒత్తిళ్లు, ఇప్పటికే ఏర్పడిన వలస నెట్‌వర్క్‌లు సెనెగల్ ప్రజలు దేశం విడిచి వెళ్లడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించి మెరుగైన ఆదాయం పొందాలనే ఆశతో చాలామంది యువకులు ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. సెనెగల్ గణాంకాల సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 రెండో త్రైమాసికంలో దేశంలోని ప్రతి నలుగురు యువతలో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు.
2024 ఎన్నికల్లో యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు ఫాయే ప్రభుత్వానికి ఉద్యోగాల కల్పన పెద్ద సవాలుగా మారింది. అక్రమ వలసలను అరికట్టేందుకు పొరుగు దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు మానవ అక్రమ రవాణా ముఠాలపై చర్యలు కొనసాగిస్తామని సెనెగల్ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదివారం ప్రకటించింది. యువతకు స్వదేశంలో ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ప్రమాదకర వలస ప్రయాణాలను నియంత్రించడంలో ప్రభుత్వం ఎంతవరకు విజయం సాధిస్తుందన్నది కీలకంగా మారింది.


