హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 687 కోట్ల ఆదాయం ప్రకటించింది. క్రితం క్యూ2తో పోలిస్తే ఇది 5 శాతం అధికం. ఇక నిర్వహణ లాభం 18 శాతం వృద్ధి చెంది దాదాపు రూ. 110 కోట్లకు, లాభం 5 శాతం పెరిగి రూ. 52 కోట్లకు చేరింది. సెపె్టంబర్ త్రైమాసికంలో కంపెనీ 401 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది.
ఒలెక్ట్రా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,750కి పైగా వాహనాలను డెలివరీ చేయగా, 8,000 బస్సులకు ఆర్డర్లు ఉన్నాయి. నాలుగో త్రైమాసికంలో కొత్త తరం ఎలక్ట్రిక్ బస్సులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఎండీ మహేశ్ బాబు తెలిపారు. స్థానికంగా తయారీకి ప్రాధాన్యం ఇస్తూ.. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.


